Viral News: మధ్యప్రదేశ్ లో 90 డిగ్రీల డిగ్రీల మలుపుతో నిర్మించిన బ్రిడ్జి.. దేశవ్యాప్తంగా సంచలనంగా అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. వంతెన నిర్మించిన కాంట్రాక్టర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు, విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే ఘటన మర్చిపోకముందే దేశంలో మరోచోట ఇంకో విచిత్రం చోటుచేసుకుంది. బిహార్ (Bihar) లో నిర్మించిన ఓ రోడ్డు వివాదస్పదమవుతోంది. రహదారికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించకుండా వాటికి అటు, ఇటు రోడ్డు వేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
బిహార్ లోని జెహానాబాద్ – గయా మధ్య గుండా వెళ్లే జాతీయ రహదారి 83ను అభివృద్ధి చేస్తున్నారు. వాహనాల రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు నాలుగులైన్ల రహదారిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో జెహానాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం (Jehanabad District Magistrate) సమీపంలో జరిగిన రోడ్డు నిర్మాణం చర్చకు తావిస్తోంది. రహదారిపై కనీసం 7-8 చెట్లు ఉండగా వాటిని తొలగించకుండానే రోడ్డును నిర్మించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరంగా మారిన ఆ రోడ్డుపై ప్రయాణించడానికి వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్లు సెటైర్లు
రహదారిపై అడ్డంగా చెట్లు ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కాంట్రాక్టర్ నిద్రమత్తులో ఉండి రోడ్డు వేసినట్లు ఉన్నాడంటూ సెటైర్లు వేశారు. రోడ్డును నిర్మించిన వ్యక్తి కనిపిస్తే దండేసి దండం పెడతామంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న చెట్లను వెంటనే తొలగించాలని ఇంకొందరు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.
Also Read: Savita Pradhan: 16 ఏళ్లకే పెళ్లి.. అత్తింటి వేధింపులు.. కట్ చేస్తే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్..!
అధికారుల రియాక్షన్ ఇదే!
రోడ్ల మధ్య చెట్లు ఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ.. జెహానాబాద్ అదనపు కలెక్టర్ బ్రజేష్ కుమార్ (Brajesh Kumar) స్పందించారు. ఇది అధికారుల అసమర్థత కాదని స్పష్టం చేశారు. నిర్మాణ సమయంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించేందుకు ప్రజా పనుల శాఖ (PWD).. అటవీశాఖ అనుమతి కోరినట్లు చెప్పారు. అయితే కొన్ని కారణాల రిత్యా అటవీశాఖ నిరభ్యంతర పత్రం (NOC) మంజూరు చేయడానికి నిరాకరించిందని చెప్పారు. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.