Telangana BJP president: తెలంగాణ భాజపా (BJP) కొత్త అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramchander Rao) పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్షుడిగా ఎవరిని నిలబెట్టాలన్న దానిపై జులై 1న ఎన్నికలు నిర్వహించాలని తొలుత భాజపా నిర్ణయించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రామచందర్ రావుకు పిలుపు రావడంతో పొలిటికల్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
వారి సపోర్ట్ వల్లనే!
రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై గత కొంతకాలంగా బీజేపీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేర్లు బలంగా వినిపించాయి. అయితే ఈటల రాజేందర్ లేదా ధర్మపురి అర్వింద్ లకే అధ్యక్షుడి అయ్యే ఛాన్స్ ఉన్నట్లు గట్టిగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రామచందర్ రావు వైపు పార్టీ అధిష్టానం మెుగ్గుచూపడం గమనార్హం. ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు రామచందర్ రావు పేరును బలంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంతో పాటు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రామచందర్ రావుకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
పొలిటికల్ నేపథ్యం
రామచందర్ రావు పొలిటికల్ స్టేటస్ విషయానికి వస్తే.. ఆయన బీజేపీలో ఎంతో అనుభవం కలిగిన నేత. విద్యార్థి దశ నుంచే ఆయన ఆ పార్టీలో చురుగ్గా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చురుకైన పాత్ర పోషించారు. భారతీయ జనతా యువ మోర్చా కార్యదర్శిగా, లీగల్ సెల్ కన్వీనర్ గా సేవలు అందించారు. 2011-13లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2014లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా వర్క్ చేశారు. 2015 – 2021 మధ్య మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సేవలు అందించారు. 2017 హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి గా పార్టీ ఆయన్ను నియమించింది.
Also Read: Congress vs BJP: డీఎస్ విగ్రహావిష్కరణపై వార్.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఎందుకంటే?
అసంతృప్తిలో ఈటల వర్గం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు పేరు దాదాపుగా ఖరారు కావడంతో ఈటల రాజేందర్ (Etela Rajender) తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈటల వర్గం చాలా గుర్రుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షపీఠం ఆశించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సైతం అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. అయితే అధ్యక్ష పీఠానికి నామినేషన్ వేయాలని మాత్రమే రామచందర్ రావును ప్రకటించిన నేపథ్యంలో.. ధర్మపురి అర్వింద్ సైతం పోటీలోకి వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది. ఒకవేళ ఆయనకు సైతం నామినేషన్ వేసే అవకాశం హైకమండ్ కల్పించే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అదే జరిగితే కొత్త అధ్యక్షుడి కోసం ఓటింగ్ జరిగే అవకాశముంది.