Telangana BJP: తెలంగాణ కమల దళపతి నియామకానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థాగత ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ను కూడా టీబీజేపీ(TBJP) రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ యెండల లక్ష్మీనారాయణ(Laxmi Narayana) ప్రకటించారు. స్టేట్ చీఫ్ పగ్గాలను బీసీ(BC)కే అప్పగిస్తారనేది తెలిసిందే. అయితే ఆ బీసీ నేత ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. వాస్తవానికి హైకమాండ్ సైతం ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ప్రకటించాలని చూస్తోంది. అయినా కాషాయ దళపతి ఎవరనే అంశంపై ఏ చిన్న లీక్ కూడా ఇవ్వడంలేదు. బయటకు పొక్కకుండా అటు హైకమాండ్, ఇటు రాష్ట్ర నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) సైతం ఈ అంశంపై ఏమాత్రం హింట్ ఇవ్వకుండా హస్తినకు పయనమయ్యారు. కాగా పార్టీ నేతలు సైతం సైలెంట్ అయ్యారు. అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
ఓటర్ లిస్టు సైతం సిద్ధం
టీబీజేపీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. మరొక్క రోజులో అధ్యక్షుడి ఎన్నిక పూర్తికానుంది. బీజేపీ స్టేట్ చీఫ్(BJP State Chief) ఎవరని కొంతకాలంగా వేచిచూస్తున్న వారి ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓటర్ లిస్టు సైతం సిద్ధమైంది. ఇప్పటికే బూత్ స్థాయి, మండల, జిల్లాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఒక్కో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర కమిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ స్టేట్ చీఫ్ నియామకంలో 119 మంది కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లాల అధ్యక్షులు, 17 మంది జాతీయ కమిటీ కౌన్సిల్ సభ్యులు కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. కాగా ఎన్నికలకు సంబంధించిన అంశంపై బీజేపీ ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగును సైతం నిర్వహించింది. మన్నెగూడలోని ఒక ఫంక్షన్ హాల్ లో దీనికి సంబంధించిన కసరత్తుపై పార్టీ రాష్ట్ర ఇన్ చార్జీ అభయ్ పాటిల్(Abhay Patil), సంస్థాగత ఇన్ చార్జీ చంద్రశేఖర్ తివారి నాయకులకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఎన్నిక
కాషాయ పార్టీ సంస్థాగత ఎన్నికకు సంబంధించి సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా అదేరోజు సాయంత్ర 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉప సంహరణకు అవకాశం కల్పించారు. కాగా ఈ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే(Minister Shobha Karandlaje) వ్యవహరించనున్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీన అధ్యక్షుడి ప్రకటన ఉండనుంది.
Also Read: Srisailam Reservoir Survey: శ్రీశైలంపై ముగిసిన అండర్‌వాటర్ వీడియోగ్రఫీ సర్వే!
హైకమాండ్ మదిలో ఉన్న నేత
టీబీజేపీ చీఫ్ ను ఏకగ్రీవం చేయాలని హైకమాండ్ ఆలోచనలు చేస్తోంది. వాస్తవానికి ఏకగ్రీవం చేస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ నియామక ప్రక్రియను ఆలస్యం చేసినట్లుగా చర్చించుకుంటున్నారు. హైకమాండ్ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చినట్లయితే ఒక్క నేత నుంచే నామినేషన్ దాఖలు చేయించే అవకాశముంది. హైకమాండ్ మదిలో ఉన్న నేతకు ఫోన్ చేసి నామినేషన్ వేయాల్సిందిగా సూచించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా సదరు నేతతో నామినేషన్ వేయించేందుకు రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల అధికారి ఏర్పాట్లుచేస్తారు. నామినేషన్ వేసిన కొద్ది గంటల్లోనే స్క్రూటినీ, విత్ డ్రా ప్రక్రియ ఉండనుంది. అయితే ఇదంతా నామమాత్రమేననే చెప్పుకుంటున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కోసం నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఢిల్లీ(Delhi) పార్టీ పెద్దలను కలిసి ఇప్పటికే పలువురు విన్నవించుకున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో హైకమాండ్ అభిప్రాయాల సేకరణ సైతం చేపట్టింది. కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే(Minister Shobha Karandlaje) సైతం ఇప్పటికే రాష్ట్ర నేతల నుంచి ఒపీనియన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender), మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు(Ram Chendar Rao) పేరు బలంగా వినిపించాయి. బీసీ నేత కావడంతో ఈటల రాజేందర్‌కు అడ్వాంటేజ్ అవుతుందని టాక్. సంఘ్ పరివార క్షేత్రాల మద్దతుతో మరికొంతమంది నేతలు తమ ప్రయత్నాలు చేశారు. బండి సంజయ్(Bandi Sanjay) గతంలో స్వయంగా తాను అధ్యక్ష రేసులో లేనని చెప్పినా ఆయన పేరు వినిపిస్తూనే వచ్చింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పార్టీ రథసారధి ఎంపిక ఉంటుందని నేతలు చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడి సారధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elactions) కు వెళ్లి సత్తా చాటాలని కాషాయ సేన భావిస్తోంది. నూతనోత్సాహంతో కమలం తెలంగాణ(Telangana)లో వికసిస్తుందని కేడర్ కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. మరి పార్టీ కమల దళపతిగా ఎవరిని నియమిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆశావహుల్లో ఒకింత టెన్షన్ సైతం మొదలైంది. హైకమాండ్ మదిలో ఏముందో అనే ఆందోళనతో ఉన్నారు. మరి పార్టీ ఎవరిని ఫైనల్ చేస్తుందనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.
Also Read: Telangana Jobs: యువతకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..