PJR
Politics

PJR Flyover: పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజ్.. సీఎం కీలక వ్యాఖ్యలు

PJR Flyover: దివంగత మాజీ మంత్రి పి. జనార్థన్ రెడ్డి నివాసం ఒక జనతా గ్యారేజీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జంట నగరాల్లో 25 ఏళ్ల పాటు పీజేఆర్ శకం నడిచిందన్నారు. హైదరాబాద్ సిటీకి బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారిపై దౌర్జన్యాలు జరిగితే, వారిని కాపాడేందుకు పీజేఆర్ అండగా నిలిచే వారని సీఎం గుర్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన స్ట్రాటజికల్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ) కింద శిల్పా లే అవుట్ ఫేజ్-2 (పీజేఆర్ ఫ్లై ఓవర్)ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్‌ను 1.2 కి.మీ.ల పొడవు, ఆరు లేన్లు రూ.182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎల్పీ నేతగా పీజేఆర్ పోరాటం అందరికీ తెలుసన్నారు. పీజేఆర్ పోరాటం వల్లనే నగరానికి కృష్ణా జలాలు వచ్చాయని, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై మొట్టమొదటి సారిగా ఆయన సర్కారుకు వ్యతిరేకంగా గళం వినిపించిన అసలైన తెలంగాణ వాది అని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర మంచినీటి అవసరాలు తీరి, నేడు కృష్ణా, గోదావరి జలాలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయంటే అది పీజేఆర్ చలువేనని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఎంతో చిత్తశుద్ధితో పీజేఆర్ పోరాటం చేసి ఉండకపోతే హైటెక్ సిటీ మహారాష్ట్రకు తరలి వెళ్లేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి 65 శాతం ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తుందని, మహానగర అభివృద్ధి విషయంలో మనం ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాలతో కాకుండా న్యూయార్క్, టోక్యో, సింగపూర్ నగరాలతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మౌలిక వసతుల మెరుగు దిశగా

రాజకీయ ముసుగులో కొందరు హైదరాబాద్ నగరాభివృద్ధికి అవాంతరాలు సృష్టిస్తున్నారని, ఇలాంటి వారిని ఎప్పటికీ క్షమించొద్దని సీఎం పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్, సేమీ అర్బన్ రీజియన్, రూరల్ తెలంగాణగా విభజించి అభివృద్ది, రవాణా, మౌలిక వసతుల మెరుగు దిశగా అడుగులు ముందుకేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా నివసించ లేని పరిస్థితిలో నెలకొన్నదని, చెన్నై‌లో వరద కష్టాలు, బెంగుళూరులో ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయని, వాటితో గుణపాఠం నేర్చుకుని, ఇలాంటి పరిస్థితులు మున్ముందు హైదరాబాద్ నగరానికి రాకుండా ఉండేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గచ్చిబౌలిలో భూముల్లో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి లక్షలాది మంది ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తే, అనవసరమైన రాజకీయాలు చేస్తూ, వాటిని అడ్డుకుంటున్నారని సీఎం ఫైర్ అయ్యారు. గచ్చిబౌలి భూములపై న్యాయపోరాటం చేసి, సాధించుకుని లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎవరేం చేసినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు.

నగరంలో కాలుష్యానికి చెక్

హైదరాబాద్ నగరంలో కూడా కాలుష్యం యమపాశంగా మారుతుందని, డీజిల్ బస్సుల వల్ల హైదరాబాద్‌లో కాలుష్యం పెరుగుతుందని వాటిని జిల్లాలకు తరలించి, నగరంలో ఆధునిక, లగ్జరీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సుమారు 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు. ఆటోల కొనుగోలు పైన నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్, సీఎన్‌జీ ఆటోలకు అనుమతి ఇస్తున్నామని, ఈవీ వెహికల్స్‌కు పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం వివరించారు. రానున్న వంద ఏళ్లకు సరిపోయేలా సిటీ డెవలప్‌మెంట్ కోసం సమర్థవంతమైన ప్రణాళికలను సిద్దం చేసినట్లు ఆయన వెల్లడించారు. రోడ్ల వెడల్పు, అండర్ పాస్‌లు, ప్లై ఓవర్లు నిర్మించబోతున్నామని సీఎం స్పష్టం చేశారు.

Read Also- Kannappa Movie: ప్రభాస్ వచ్చినప్పుడు కాదు.. ఆ సీన్ నుంచే సినిమా లేచింది.. విష్ణు కామెంట్స్!

అక్రమార్కులపై నజర్

నగరంలో నాలాల కబ్జాల కారణంగా వర్షపు నీరు రోడ్ల పైకి వచ్చి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, హైడ్రాతో ఆక్రమణలు తొలగిస్తున్నామని తెలిపారు. ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రభుత్వం తొలగించిందని, హీరో నాగార్జున స్వయంగా ఎన్ కన్వెన్షన్‌కు చెందిన రెండెకరాల భూమిని అప్పగించి, నగరాభివృద్ధికి సహకరించారని సీఎం గుర్తు చేశారు. 40 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకుల ఆక్రమణలో ఉన్న బతుకమ్మ కుంటను గుర్తించి, అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. డిసెంబర్ 9 లోపు విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామన్నారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, నేడు ప్రపంచమంతా భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుందన్నారు. 2029 లో శేరిలింగంపల్లి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉందంటూ సీఎం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను సమర్థించేలా వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ హైదరాబాద్‌కు ఏం ఇచ్చారు?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,  జైపాల్ రెడ్డిల కృషి వల్లే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చిందని, పీవీ నరసింహారావు వల్ల ఐటీ వచ్చిందని, ప్రధాని మోదీ వల్ల హైదరాబాద్ నగరానికి ఇప్పటివరకు ఏం వచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. బెంగళూరు, చెన్నై, ఏపీకి మెట్రో రైల్ ఇచ్చారని, గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్, గుజరాత్‌కు సబర్మతి, ఢిల్లీకి యమునా, ఉత్తర ప్రదేశ్‌కు గంగా ఇచ్చారని, మరీ మన మూసీ రివర్ ఫ్రంట్‌కు ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు? తెలంగాణ పైన ఎందుకు ఈ వివక్ష? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో భేషజాలు లేవు, మీ వెంట వస్తామని స్వయంగా కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి తాను అడిగానని సీఎం వివరించారు. నగరానికి వస్తున్న అమిత్ షాను కలిసి మెట్రోకు, ట్రిపుల్‌ఆర్‌కు, మూసీ‌కి అనుమతులు ఇవ్వాలని కోరతామని సీఎం స్పష్టం చేశారు. మెట్రోలో తెలంగాణ తొమ్మిదో స్థానానికి దిగజారిందని, ఇది కిషన్ రెడ్డి‌కి కనిపించడం లేదా? అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. పీజేఆర్ విగ్రహం ఏర్పాటు కోసం సరైన స్థలాన్ని గుర్తించాలని, పేదలకు అండగా నిలిచిన పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

Read Also- Telangana: ఇదేందయ్యా ఇది.. చనిపోయిన వారికి ఐదేళ్లుగా పెన్షన్!

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?