Telangana
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana: ఇదేందయ్యా ఇది.. చనిపోయిన వారికి ఐదేళ్లుగా పెన్షన్!

  • చనిపోయిన వారికి కూడా పెన్షన్
  • ఐదేళ్లుగా దాదాపు లక్షన్నర మందికి నెలనెలా జమ
  • అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఖజానాకు గండి
  • ఐదేళ్లుగా మృతుల అకౌంట్లలో పడుతున్నరూ.1000 కోట్లు?
  • ఏటీఎం ఉంటే విత్ డ్రా.. నామినీ అయితే బ్యాంకు నుంచి డ్రా
  • డెత్ సర్టిఫికెట్ చెక్ చేయలేనంత అశ్రద్ధలో అధికార యంత్రాంగం
  • ఇప్పటికే సోషల్ ఆడిటింగ్‌కు ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • అధికారుల అలసత్వంపై స్వేచ్ఛ కేస్ స్టడీ స్టోరీ

పబ్బు సతీష్


వరంగల్, స్వేచ్ఛ

Telangana: రాష్ట్రంలో 57 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు నెలనెలా ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నది. ఇలా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నది. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.2,016 అందుతున్నది. అయితే, గత ఐదేళ్లుగా అధికారుల నిర్లక్ష్యంతో చనిపోయిన వారికి కూడా డబ్బులు జమ అవుతున్నాయి. ఏటీఎం ఉన్న వారి కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా డ్రా చేసుకుంటున్నారు. మరికొందరు నామినీల పేర్లు ఉంచడంతో బ్యాంకు సిబ్బంది ఇచ్చేస్తున్నారు. ఇంకొందరు నెలనెలా జమ అవుతున్న డబ్బును ఎలా విత్ డ్రా చేసుకోవాలని తెలిసిన వారిని అడుగుతున్నారు. ఇలా ఐదేళ్లలో అక్షరాలా రూ.1000 కోట్ల వరకు చనిపోయిన వారి ఖాతాల్లోకి పెన్షన్ రూపంలో చేరాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాదాపు లక్షా 50 వేల మంది చనిపోయిన వారి ఖాతాల్లో నెలనెలా రూ.30 కోట్ల వరకు అధికారులు జమ చేస్తున్నారు.


ఏటా ఎంత అంటే?

బతికున్న అర్హులైన వారిని ముప్పు తిప్పలు పెట్టే అధికారులు, నిజంగా చనిపోయన వారికి పెన్షన్ ఇస్తున్నారా అనే దానిపై స్వేచ్ఛ టీం ఇన్వెస్టిగేషన్ చేసింది. దీంతో అధికారుల మొద్దు నిద్ర బయటపడింది. ఒక నెల, రెండు నెలలు సమన్వయ లోపం వల్ల జరిగిందంటే ఆ తర్వాత సరిచేసుకుంటారని భావించవచ్చు. కానీ 5 ఏళ్లుగా చనిపోయిన వారిని గుర్తించలేదు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ దాదాపు లక్షా 50వేలకు చేరుకున్నన్నట్టు సమాచారం. వారికి నెలనెలా పెన్షన్ ఇస్తుండడంతో రూ.1000 కోట్ల ప్రజా ధనం చనిపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. ప్రతి నెలా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, భర్త వదిలేసిన ఒంటరి మహిళలకు, గీత, నేత కార్మికులు, బీడీ కార్మికులకు, హెచ్ఐవీ బాధితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో పెన్షన్ ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం పేరుతో ఇస్తున్నది. సుమారు 42.7 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. నెలనెలా రూ.9 వేల కోట్లు ఈ స్కీంపై ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ప్రభుత్వం ఎంత మంచిగా ఆలోచించినా, క్షేత్రస్థాయిలో సరిగ్గా ఉంటేనే చక్కగా అమలవుతుంది. చేసే పని పట్ల అధికారులకు చిత్తశుద్ధి ఉంటేనే అంతా సవ్యంగా సాగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.50 లక్షలకు పైగా లబ్ధిదారులు మృతి చెందారు. ఇందులో ఎక్కువమంది వృద్ధులే ఉన్నారని అంచనా. ఒకవైపు లోటు బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని నడిపేందుకు పెద్దలు అనేక ఆపసోపాలు పడుతుండగా, అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మృతుల ఖాతాల్లో వేస్తున్నారు.

ఏటీఎం ఉంటే డ్రా.. లేదంటే ఖాతాల్లోనే..

పెన్షన్ పొందిన వారు మృతి చెందినప్పుడు వారి పేర్లు జాబితా నుంచి తీసివేయాలని ప్రతిపాదించాల్సిన అధికారులు ఆ పని చేయడం లేదు. ఒక గ్రామంలో ఎంతమంది చనిపోయారు. ఎంతమంది బతికి ఉన్నారో తెలుసుకోవడం లేదు. దీంతో మృతుల పేరు మీద ఏటీఎం ఉంటే వారి బంధువులు పెన్షన్ డబ్బులు దర్జాగా విత్ డ్రా చేసుకుంటున్నారు. ఏటీఎం లేని వారు కొందరు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి, మరికొందరు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై డబ్బులు తీసుకుంటున్నారు. ఇవి ఏమీ చేయలేని వారు డబ్బులు తీయకపోవడంతో మృతుల ఖాతాల్లో కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు మూలుగుతున్నాయి.

మృతుల పేరిట వృథా.. అర్హుల వ్యధ

మృతుల పేర్లు పెన్షన్ జాబితాలో భద్రంగా ఉంచిన అధికారులు. 2016లో ఆసరా పెన్షన్ తీసుకునే వారి సంఖ్య అన్ని విభాగాల వారు కలిసి 38.42 లక్షల మంది ఉండగా ప్రస్తుతం చేయూత పెన్షన్ తీసుకునే వారి సంఖ్య 42.7 లక్షలకు పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు వయో పరిమితి 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించి దరఖాస్తులు తీసుకుని కొత్త పెన్షన్స్ మాత్రం మంజూరు చేయలేదు. ఇప్పుడు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 20 లక్షల మంది వరకు ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు మంజూరు లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్న వారు కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఒక వైపు మృతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు వేసి డబ్బులు వృథా చేస్తున్నారు కానీ, కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ఇబ్బంది పడుతున్న పేదలకు న్యాయం జరగడం లేదు.

ఆరేళ్లుగా మృతురాలి ఖాతాలో పెన్షన్

హనుమకొండ జిల్లాలోని ఓ మండలానికి చెందిన వృద్ధురాలు 6 సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఇప్పటికీ ఆమె ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి. ఇప్పటిదాకా రూ.1.47 లక్షలు జమ అయ్యాయి. ఈ విషయం ఇటీవలే తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు షాకయ్యారు.

Read Also-Ram Charan: రాజకీయాల్లోకి రామ్ చరణ్.. ఇంత హడావుడి వెనుక..!

ఐదేళ్లుగా చనిపోయిన వృద్ధుడి ఖాతాలో..

వరంగల్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు 5 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆయన మృతి డిక్లరేషన్ అధికారులు చేయకపోవడంతో ఇప్పటికీ ఆయన ఖాతాలో పెన్షన్ డబ్బులు పడుతూనే ఉన్నాయి.

రెండేళ్ల నుంచి పడుతూనే ఉన్నాయి

హనుమకొండ జిల్లాలోని మరొక మండలంలో ఓ వృద్ధుడు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అయినా కూడా అతని ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే ఆయన కొడుకు బ్యాంకు ఖాతా క్లోజ్ చేసేందుకు వెళ్లగా, అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు చూసి షాకయ్యాడు. ఇన్ని డబ్బులు ఎక్కడివి అని బ్యాంక్ అధికారులను అడుగగా పెన్షన్ డబ్బులు ప్రతి నెలా జమ అవుతున్నాయని చెప్పారు. అకౌంట్ క్లోజ్ చేసేందుకు ఎంపీడీవో ధృవీకరణ పత్రం ఇవ్వడంతో మృతి చెందిన నాటికి డబ్బుకు మృతుని కుటుంబానికి ఇచ్చి మిగిలిన డబ్బులు ప్రభుత్వానికి జమ చేశారు.

విచారణ చేపట్టి వృథాను అరికట్టాలి

ఇప్పటికైనా అధికారులు ఎవరెవరు చనిపోయారు, ఎంత మంది బతికి ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ చేపట్టి పెన్షన్ డబ్బుల వృథాను అరికట్టాల్సిన అవసరం ఉన్నది. అర్హులైన వారికి కొత్త పెన్షన్ మంజూరు చేసి గత ఐదు సంవత్సరాలుగా దరఖాస్తు చేసి పడిగాపులు పడుతున్న వారి తిప్పలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన లావాదేవీలపై ఆడిటింగ్ చేయిస్తున్నది. లిస్టులో పెన్షన్లకు సంబంధించిన అంశం కూడా ఉన్నదని సమాచారం. ఈ నేపథ్యంలో చనిపోయిన వారికి పెన్షన్ జమ స్తున్న విషయం తేలే ఛాన్స్ ఉంది. తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయేమో చూద్దాం.

Read Also- Viral News: ప్రియుడితో కలిసి.. భర్త కళ్లలో కారం కొట్టి..

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!