Rs 4 Cr Donation to Temple: తల్లిదండ్రులు తమ బిడ్డను ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పుడు వారికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఏది కోరుకున్న క్షణాల్లో వారి ముందు ఉంచి.. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. అయితే కొందరు పిల్లలు మాత్రం.. పెద్దయ్యాక తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా ఏదోక రూపంలో కన్న తల్లిదండ్రులను అవమానిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తనను అవమానించిన కన్న కొడుకుకి ఓ తండ్రి గట్టిగా బుద్ది చెప్పాడు. ప్రస్తుతం అతడు చేసిన పని.. ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అసలేం జరిగిందంటే!
తమిళనాడు అరణి పట్టణం కేశవపురం గ్రామానికి చెందిన విజయన్ (65).. సైన్యంలో పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కట్ చేస్తే.. జూన్ 24న తిరువన్నమలై జిల్లాలోని అరుళ్మిగు రేణుగాంబల్ అమ్మన్ ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ క్రమంలో రూ.4 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు.. హుండీలో బయటపడ్డాయి. ఇది గమనించిన ఆలయ సిబ్బంది.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. డాక్యుమెంట్స్ పై ఉన్న పేరు ఆధారంగా విజయన్ సంప్రదించారు.
రూ. 4కోట్ల ఆస్తి విరాళం
తాను పూర్తి స్పృహలో ఉండే తన ఆస్తి పేపర్లను హుండీలో వేసినట్లు విజయన్.. ఆలయ అధికారులకు సమాధానం ఇచ్చారు. ఆస్తుల వారసత్వం విషయంలో తన కుమార్తెలతో గొడవలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆస్తి కోసం తనను పట్టించుకోవడం మానేసి.. తనను అవమానించారని విజయన్ చెప్పారు. పైగా రూ.4 కోట్ల ఆస్తిని పొందేందుకు ఇద్దరు కూతుళ్లు పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తన ఆస్తి ఎవరికీ చెందకుండా ఆలయానికి విరాళంగా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే హుండీలో ఆస్తి పేపర్లు వేసినట్లు వివరించారు.
Also Read: Maoists Party Letter: మంత్రి సీతక్కపై మావోయిస్టుల బహిరంగ లేఖ.. సూటిగా ప్రశ్నల వర్షం!
ఆలయ అభివృద్ధి కోసం..
విజయన్.. హుండీలో వేసిన ఆస్తిపత్రాలు రెండు స్థలాలకు సంబంధించినది. అందులో ఒకటి ఆలయానికి సమీపంలో ఉన్న ల్యాండ్ కాగా దాని విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరొక స్థలం విలువ రూ.కోటి వరకూ అంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. ప్రతీ 2 నెలలకోసారి అరుళ్మిగు రేణుగాంబల్ అమ్మన్ ఆలయంలో హుండీని లెక్కిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో జూన్ 24 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఆస్తి పేపర్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు. విజయన్ ఇచ్చిన ఆస్తిని.. ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.