YSRCP: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్నట్లుగా తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలు విజయవంతం కావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ వైసీపీకి మంచి ఊపును తెస్తున్నాయి. అయితే ఇంతకుమించే బూస్టప్ ఇచ్చే విషయం ఏమిటంటే టీడీపీ నుంచి నేతలు కొందరు వైసీపీలో చేరుతుండటమే. అందులోనూ కీలక నేతలు.. టీడీపీ (Telugudesam) తరఫున పోటీచేసి ఓడిపోయిన నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో చేరుతుండటంతో పార్టీకి మంచిరోజులు వస్తున్నాయని క్యాడర్ నూతనోత్సాహంలో మునిగితేలుతున్నది. బుధవారం నాడు టీడీపీ సీనియర్ నేత.. ఫ్యాన్ పార్టీలో చేరడంతో అధికారంలో ఉన్న పార్టీ నుంచి రావడమేంటి? అసలు కూటమి పార్టీల్లో, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? అని అందరూ ఆలోచనలో పడిన పరిస్థితి.
Read Also- TDP: టీడీపీకి ఊహించని ఝలక్.. అవాక్కైన అధిష్టానం.. కీలక నేత రాజీనామా వెనుక!
వైసీపీలోకి వచ్చిందెవరు?
టీడీపీ కీలక నేత, రాజంపేట ఇన్‌ఛార్జ్ సుగవాసి సుబ్రమణ్యం (Sugavasi Subramanyam) ఆ పార్టీకి ఇదివరకే రాజీనామా చేశారు. నేడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కండువా కప్పిన జగన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరిక కార్యక్రమంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రెడ్డెప్పగారి రమేష్ కుమార్ రెడ్డి, రఘురామిరెడ్డి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పార్టీ తరఫున సుగవాసి సుబ్రమణ్యంకు సముచిత గుర్తింపు, స్థానం లభిస్తుందని నేతలు భరోసా ఇచ్చారు. మరోవైపు వైఎస్ జగన్ కూడా సుగవాసితో 5 నిమిషాలపాటు ప్రత్యేకంగా మాట్లాడి అన్ని విధాలుగా అండగా ఉంటామని.. రానున్న ఎన్నికల్లో న్యాయం చేస్తానని భరోసా ఇచ్చినట్లుగా తెలిసింది.
మరింత బలం..
చేరిక అనంతరం వైసీపీ సీనియర్ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అంటే సామాన్యుని పార్టీ అని వ్యాఖ్యానించారు. కుల, మత, ప్రాంత వివక్షలకు అతీతంగా అన్ని వర్గాలను గౌరవించే పార్టీ అని.. ఇందులో సీనియర్ నేతలకు సముచిత స్థానం, గౌరవం ఉంటుందన్నారు. అంతేకాదు వైసీపీతోనే అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. సుబ్రమణ్యం లాంటి నేతల చేరికతో పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సుగవాసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ జగన్ నేతృత్వంపై విశ్వాసం ఉందన్నారు. ప్రజల కోసం పనిచేసేలా, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానన్నారు. తనకు ఇక్కడ గౌరవం, అవకాశాలు ఉంటాయని సుగవాసి ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, సుగవాసి ఫ్యామిలీకి (Sugavasi Family) రాయచోటి నియోజకవర్గంతో సుమారు 4 దశాబ్దాల అనుబంధం ఉన్నది. దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు (Sugavasi Palakondrayudu) ఎమ్మెల్యేగా, ఎంపీగా.. రాయచోటి (Rayachoty), రాజంపేట ప్రజలకు సేవలు అందించారు. స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచిన చరిత్ర ఆయనకే సొంతం. ఈ మధ్యనే అనారోగ్యంతో రాయుడు తుదిశ్వాస విడిచారు. అయితే.. తన కుటుంబంలో ఇంత విషాద ఘటన జరిగినా అధిష్టానం, చంద్రబాబు పట్టించుకోలేదని సుగవాసి కుటుంబం.. అభిమానులు, అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే సుబ్రమణ్యం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also- YS Jagan: వైఎస్ జగన్ డై హార్డ్ ఫ్యాన్స్‌కు ముఖ్య గమనిక!