YSRCP: అవును.. యంగ్ డైనమిక్ లీడర్, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) స్థానం ఇకపైన మరో మాజీ మంత్రి అంబటి రాంబాబుదే. మంగళవారం రాత్రి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన రాంబాబును ఇప్పుడు రజిని స్థానానికి అధినేత పంపుతున్నారు. రేపల్లె, సత్తెనపల్లె ఈ రెండు నియోజకవర్గాలు అంబటికి కంచుకోటగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. తాజా ప్రకటనతో మాజీ మంత్రుల అభిమానులు ఒకింత కంగుతిన్నారు. ఇదేంటి పంపితే రేపల్లె లేదంటే సత్తెనపల్లెలోనే ఉంచితే సరిపోయేది కదా.. ఎలాంటి సంబంధంలేని గుంటూరు పశ్చిమ నియోకవర్గానికి పంపడం ఎంతవరకూ సమంజసం అని అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి. కాగా, ఇప్పటికే పశ్చిమను పక్కనెట్టి యథావిధిగా చిలకలూరిపేటను రజినికి అధిష్టానం అప్పగించింది. మాస్ లీడర్, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరిచయాలున్న నేత కావడంతో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. రాంబాబు ఈసారి కూడా సత్తెనపల్లి నుంచే పోటీచేద్దామనుకున్నారు కానీ, జగన్ గట్టిగానే దెబ్బ కొట్టారని అభిమానులు, అనుచరులు.. కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Read Also- YS Jagan: వైఎస్ జగన్ డై హార్డ్ ఫ్యాన్స్‌కు ముఖ్య గమనిక!
పశ్చిమలో పరిస్థితేంటి?
పశ్చిమలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 2019 సంగతి అటుంచితే.. 2024లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. విడదల రజిని 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వాస్తవానికి ఆమె 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచి, ఆ తర్వాత మంత్రి అయ్యారు. అయితే, 2024 ఎన్నికల నాటికి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. టీడీపీ తరఫున పోటీచేసిన గళ్ళా మాధవి చేతిలో ఏకంగా 51,150 ఓట్ల తేడాతో విడదల రజిని ఘోర పరాజయం పాలయ్యారు. అంతేకాదు.. మునుపటి చిలకలూరిపేటలోనూ వైసీపీ తరఫున కావటి శివనాగ మనోహర్ నాయుడు పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు. సాధారణంగా 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన వ్యతిరేకతతో పాటు ఆమె వ్యక్తిగత అంశాలను కూడా ప్రభావితం చేశాయి. చిలకలూరిపేటలో ఆమెకు మంచి పట్టు ఉన్నప్పటికీ, ఆమెను చివరి నిమిషంలో గుంటూరు పశ్చిమకు మార్చడం వల్ల కొత్త నియోజకవర్గంలో బలమైన పట్టు సాధించలేకపోయారని భావిస్తున్నారు. దీనికితోడు గుంటూరు పశ్చిమ టీడీపీకి బలమైన నియోజకవర్గం. మరోవైపు.. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై బలమైన వ్యతిరేకత, కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) పట్ల అనుకూలత స్పష్టంగా కనిపించడంతో రజిని అడ్రస్ లేకుండా పోయారు. నాడు వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం, చిలకలూరిపేటలో ఆమెపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి, సొంత పార్టీలోని వర్గపోరు కూడా ఆమె కేడర్ మార్పునకు, పరోక్షంగా ఓటమికి కారణమై ఉండొచ్చని తేలింది.
మార్పు వచ్చేనా?
రజిని ఇటు చిలకలూరిపేటకు వచ్చేసిన తర్వాత పశ్చిమలో క్యాడర్‌ను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. దీంతో ఎవరైతే ఆ నియోజకవర్గానికి సరైన నేత అని సర్వే చేయించగా.. రాంబాబు అయితే మాస్ లీడర్, జిల్లా వ్యాప్తంగా పరిచయాలు, అంతకుమించి అనుభవం ఉన్న సీనియర్ నేత కావడంతో సమన్వయకర్తగా జగన్ నియమించారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ్నుంచే అంబటి తప్పకుండా పోటీచేయాల్సి ఉంటుంది. అయితే.. సత్తెనపల్లి సంగతేంటి? ఈ నియోజకవర్గాన్ని ఎవరికి అప్పగిస్తారు? అనేది ఇంతవరకూ తెలియరాలేదు కానీ.. సామాజికవర్గం, నియోజకవర్గంపై పట్టు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే. అందుకే త్వరలోనే ఆర్కేకు సత్తెనపల్లిని అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆర్కే 2024 ఎన్నికల్లో ఎక్కడా పోటీచేయలేదు. చివరి నిమిషంలో మంగళగిరి స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసిన నారా లోకేష్‌పై వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేశారు. అయితే వైసీపీ అనుకున్న ప్లాన్ మొత్తం అట్టర్ ప్లాప్ కాగా, కనివినీ ఎరుగని రీతిలో 91,413 ఓట్ల మెజార్టీతో లోకేష్ విజయదుందుభి మోగించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఏ నియోజకవర్గానికి సంబంధం లేకుండా.. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనకుండా ఆర్కే ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను యాక్టివ్ చేయాలంటే సత్తెనపల్లి కేటాయిస్తే సరిగ్గా సరిపోతుందని అధిష్టానం భావిస్తున్నది. ఆర్కేకు కేటాయించని పరిస్థితుల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి కేటాయించే ఛాన్స్ ఉన్నది.
వైసీపీ అధికారిక ప్రకటన ఇదే..
