Srikanth Arrest: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటుడు శ్రీకాంత్ (Srikanth Arrest) అలియాస్ శ్రీరామ్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూలై 7 వరకు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ చెన్నై కోర్టు సోమవారం రాత్రి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్ని చెన్నై పోలీసు వర్గాలు వెల్లడించాయి. శ్రీరామ్ అరెస్టుపై కేసు దర్యాప్తు పోలీసు అధికారులు స్పందిస్తూ, కొకైన్ కొనుగోలు చేసి, వాడినట్టుగా డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించామన్నారు. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిర్ధారించామని తెలిపారు. అయితే, జ్యుడీషియల్ కస్టడీపై శ్రీరామ్ తరపు న్యాయవాదులు ఇప్పటివరకు స్పందించలేదు.
Read this- ISKCON Monk: సుందర్ పిచాయ్ ప్రశ్నకు ఇస్కాన్ సన్యాసి ఇచ్చిన సమాధానం ఇదే
శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా చాటింగ్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ సప్లయ్‌తో సంబంధాలు ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఫోన్ డేటా లభ్యమైందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తమిళనాడుతో పాటు రాష్ట్రానికి అవతల పనిచేస్తున్న ఒక డ్రగ్స్ ముఠా సభ్యులతో శ్రీరామ్ సంబంధాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు. కాగా, అరెస్టుకు ముందు నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో శ్రీరామ్‌ను కొన్ని గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. అతడి రక్త నామూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిసింది. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టును అధికారులు ఇంకా బయటపెట్టలేదు.
శ్రీరామ్ దాదాపు రూ.4.5 లక్షలు అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు గుర్తించినట్టు సమాచారం. ఏకంగా 40 సార్లు కొకైన్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఏఐఏడీఎమ్‌కే ఐటీ వింగ్ మాజీ నేత ప్రసాద్ అరెస్టు కావడం శ్రీరామ్ అరెస్టు వరకు దారితీసింది. ఓ పబ్‌లో ప్రసాద్ ఘర్షణ పాల్పడ్డాడు. ఆ కేసు విషయమై పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడి శ్రీరామ్ అరెస్ట్‌కు దారితీసింది.
Read this- Health Awareness: మునగాకు వీళ్లు తింటే చాలా డేంజర్.. జరజాగ్రత్త
శ్రీరామ్ అరెస్ట్ వ్యవహారం తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ దుమారం రేపుతోంది. డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణలో అధికార డీఎంకే పార్టీ విఫలమైందంటూ డీఎంకే, బీజేపీ ఆరోపణలు గుప్పించాయి. ఈ ఆరోపణలను అధికార డీఎంకే నేతలు ఖండించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదిలిపెట్టబోమని, వ్యక్తులు ఎలాంటి హోదాలో ఉన్నా చట్టప్రకారం నడుచుకుంటామని, అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దేశంలో డ్రగ్స్ వినియోగం అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఉందని డీఎంకే నాయకులు చెబుతున్నారు. మరోవైపు, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. తమిళనాడులో డ్రగ్స్ తయారు కావడం లేదని అంటున్నారు. అయితే, శ్రీలంకకు మాదకద్రవ్యాల తరలింపులో తమిళనాడు రవాణా కేంద్రంగా మారుతోందని పోలీసులు చెబుతున్నారు.
కాగా, ‘రోజాపూలు’ సినిమాతో శ్రీకాంత్ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ వంటి సినిమాల్లో అలరించాడు. మొత్తం దాదాపు 70 సినిమాలలో నటించాడు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘త్రీ ఇడియట్స్’కు తమిళ రీమేక్ అయిన ‘నాన్బన్’లో అందరినీ మెప్పించాడు.