Suryapet Gang War: మద్యం మత్తులో తలెత్తిన వివాదం.. రెండు వర్గాల మధ్య భీకర దాడులకు దారితీసింది. నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు ముష్ఠియుద్ధానికి దిగారు. దొరికినవాళ్లను దొరికినట్లు పొట్టు పొట్టున కొట్టుకున్నారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిన ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
సూర్యపేట జిల్లా నేరేడుచర్ల పట్టణం రాంపురం రోడ్డులోని వైన్ షాపులో టౌన్ కు చెందిన ముగ్గురు మద్యం సేవించడానికి వెళ్లారు. ఈ క్రమంలో వారి పక్క టేబుల్ వద్ద పెంచికలదిన్నె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూర్చొని మద్యం సేవిస్తున్నారు. పక్క పక్క టేబుల్ లో కూర్చొని మద్యం త్రాగుతున్న క్రమంలో వారి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. మాట మాట పెరిగి అక్కడే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ గొడవలో మొదట నేరేడుచర్లకు చెందిన యువకులను పెంచికల్ దిన్నకు చెందిన యువకులు చితకబాదారని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో గ్యాంగ్ వార్
నడిరోడ్డుపై విచక్షణారహితంగా ఇరు వర్గాలు పరస్పరం దాడులు. నలుగురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. రామాపురం ఎక్స్ రోడ్డులో పెంచికల్ దిన్నె, నేరేడుచర్లకు చెందిన వర్గాల మధ్య ఘర్షణ. డ్రైనేజ్‌లో పడి కొట్టుకున్న వైనం.#Suryapet #gangwar pic.twitter.com/FmVYjmMW8S
— Sanjay Journalist (@SanjuJournalist) June 23, 2025
పోలీసులు ఆపినా.. ఆగకుండా
అయితే దాడి విషయాన్ని నేరేడుచర్లకు చెందిన యువకులు వారికి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో వారి వర్గం మూకుమ్మడిగా వచ్చి పెంచికలదిన్నె గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై వివక్షరహితంగా దాడి చేశారు. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. పోలీసులు ఆపుతున్న ఆగకుండా పెంచికలదిన్నెకు చెందిన యువకులను రోడ్డుపై నుండి తన్నుకుంటూ వెళ్లి మురికి కలువలో పడేసి మరి దాడి చేశారు.
Also Read: Trisha – Vijay: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న విజయ్, త్రిష జంట.. పెళ్లి ఫిక్స్ అయినట్లేనా?
పలువురికి తీవ్ర గాయాలు
యువకుల గ్యాంగ్ వార్ తో నడిరోడ్డుపై తీవ్ర భయాందోళన పరిస్థితులు తలెత్తాయి. ఏం జరుగుతుంతో తెలియక స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలోసైతం వైరల్ గా మారాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.