Hormuz Closure Impact: ఇరాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు అగ్రరాజ్యం అమెరికా తోడవడంతో పరిస్థితులు మరింత క్షీణించాయి. ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ (Hormuz Strait) జలసంధిని మూసివేసేలా ఇరాన్ పార్లమెంటు నిర్ణయించినట్లు కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే భారత్ లో చమురు ధరలు అమాంతం పెరగొచ్చన్న ఆందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
భారత్‌పై ప్రభావం
ఒకవేళ ఇరాన్ నిజంగానే హర్మూజ్ జలసంధిని మూసివేస్తే భారత్ ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశముందని నిపుణలు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% (రోజుకు 20 మిలియన్ బ్యారెల్స్) రవాణా చేసే మార్గంగా హర్మూన్ జలసంధి ఉంది. సరఫరా అంతరాయం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120–130 డాలర్ల వరకు చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. ముడి చమురు ధరలు 10 డాలర్లు పెరిగితేనే.. భారత్‌లో ద్రవ్యోల్బణం 0.3% మేర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరెంట్ ఖాతా లోటు GDPలో 0.55% పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇది సహజంగానే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు.
హర్మూజ్ జలసంధిపై భారత్ ఆధారం
భారత్ తన చమురు, గ్యాస్ అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతులపై ఆధారపడుతోంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 21% ఇరాక్ నుంచి వస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, రష్యా దేశాల నుండి మిగిలిన మెుత్తం చమురు వస్తోంది. అయితే భారత్ దిగుమతి చేసుకునే 90% ముడి చమురులో 40% హర్మూజ్ జలసంధి ద్వారా నుంచే వస్తోంది. ఇది రోజుకు సుమారు 15 లక్షల బ్యారెల్స్ కు సమానం. ఒకవేళ హర్మూజ్ జలసంధి మార్గాన్ని మూసివేస్తే 10-12 కోట్ల లీటర్ల పెట్రోల్ ఉత్పత్తి నిలిచిపోవచ్చని అంచనాలు ఉన్నాయి. భారత్ వినియోగించే ఎల్ఎన్‌జీ (LNG)లో40 శాతం ఖతార్ నుంచి, 10 శాతం ఇతర గల్ప్ దేశాల నుంచి దిగుమతి అవుతోంది. అదంతా హర్మూజ్ జలసంధి నుంచే రానున్న నేపథ్యంలో గ్యాస్ ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి
భారత్ లో చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ(Hardeep Singh Puri) స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘గత 2 వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో మనం గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించాం. మన సరఫరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా రావడం లేదు. మన చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనేక వారాల పాటు సరఫరాలు ఉండటంతో పాటు వివిధ మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అందుతూనే ఉన్నాయి. మన పౌరులకు ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.
Also Read: Anganwadi – Panchayat: అంగన్‌వాడీ పంచాయతీ భవనాలకు త్వరలో శంకుస్థాపన!
ఆసియా మార్కెట్లపై పెను ప్రభావం!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరింది. యూఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8 శాతం ఎగబాకి 75.98 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 0.7 శాతం మేర కుంగాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్ సూచీ 0.5%, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.6% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.