Telangana: డయాలసిస్ రోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ‘చేయూత’నిస్తున్నది. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ప్రతినెలా పింఛన్లు ఇస్తూ అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో ఇవ్వని విధంగా కాంగ్రెస్ ఈ ఏడాది మే నెలలోనే 4021 మంది కిడ్నీ రోగులను గుర్తించి వారికి పింఛన్లు అందజేసింది. దీంతో పలువురు రోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు.
వయసుతో సంబంధం లేకుండా
డయాలసిస్ పేషెంట్లలో నడివయసువారు, వృద్ధులు, యువకులు ఎక్కువగా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీగా చేర్చి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పింఛన్ అందిస్తు్న్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ రోగులపై ప్రత్యేక దృష్టి సారించింది. దరఖాస్తు చేసుకున్నవారి ఆర్థిక పరిస్థితిని పరిశీలించింది. అర్హులను ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మే నెలలోనే 4,021 మంది డయాలసిస్ రోగులకు ‘చేయూత’ పింఛన్ అందిస్తుందని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం , మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే పింఛన్ మంజూరు అయ్యిందని పలువురు పేర్కొంటున్నారు.
ఒక్కొక్కరికి నెలకు రూ.2,016
గతంలో బీఆర్ఎస్ పాలనలో 10వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే, ఆ దరఖాస్తులకు మోక్షం కలుగలేదని కిడ్నీ వ్యాధిగ్రస్తులే పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో పింఛన్లు ఇవ్వలేదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆనతి కాలంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ మంది డయాలసిస్ రోగులకు పింఛన్ మంజూరు చేస్తుంది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేండ్లలోనూ 4011 మందికి మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. అందులోనే చేర్పులు మార్పులు జరుగుతున్నాయి. కానీ, నూతనంగా పింఛన్లు మంజూరు చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు 4011 సంఖ్య మాత్రమే కొనసాగించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఒక్క నెలలోనే దానికి మించి 4021 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రికార్డు సృష్టించింది. కొత్త పింఛన్లతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 8,032 మంది డయాలసిస్ రోగులకు పింఛన్ తీసుకుంటున్నారు.
Read Also- BRS Party: గులాబీ కోటలో కేసుల తంటా.. విచారణతోనే సరి
కొత్తగా 4,021 మంది ఎంపిక
ఈ ఏడాది మే నెలలోనే కొత్తగా 4,021 మందికి నూతనంగా పింఛన్‌లకు అర్హులుగా ఎంపిక చేసింది. పింఛన్లు ఇవ్వడం ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాలో 153, భద్రాద్రి– కొత్తగూడెం జిల్లాలో 267, హనుమకొండ195, హైదరాబాద్ 848, జగిత్యాల 200, జనగాం 138, జయశంకర్ – భూపాల పల్లి 53, జోగులాంబ గద్వాలా 124, కామారెడ్డి 194, కరీంనగర్ 277, ఖమ్మం 285, కొమురం భీం ఆసిఫాబాద్ 108, మహబూబాబాద్ 156, మహబూబ్‌నగర్ 204, మంచిర్యాల 180, మెదక్ 164, మేడ్చల్ –మల్కాజిగిరి 705, ములుగు 42, నాగర్ కర్నూల్ 168, నల్లగొండ 434, నారాయణపేట 114, నిర్మల్ 122, నిజామాబాద్ 365, పెద్దపల్లి197, రాజన్న సిరిసిల్ల 134, రంగారెడ్డి 685, సంగారెడ్డి 280, సిద్ధిపేట 249, సూర్యాపేట258, వికారాబాద్ 181, వనపర్తి 108, వరంగల్ 213, యాదాద్రి భువనగిరి జిల్లాలో 231 డయాలసిస్ రోగులు పింఛన్ అందుకుంటున్నారు.
త్వరలో హెచ్‌ఐవీ బాధితులకు కూడా
త్వరలో హెచ్‌ఐవీ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేసేలా సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,000 మంది హెచ్‌ఐవీ పేషెంట్లు తమకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అన్నిరకాల నూతన పెన్షన్ దారుల ఎంపిక కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థికశాఖ నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నది. అనుమతులు రాగానే మరింత మంది లబ్ధిదారులకు లబ్ధిచేకూరనున్నది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ.993 కోట్లు ఖర్చు చేస్తున్నది. కొత్త పింఛన్ దారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయితే ఈ అమౌంట్ మరింత పెరగనున్నది.