Modi Vs Lalu: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad), ఆయన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi Vs Lalu) పదునైన విమర్శలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను ‘జంగిల్ రాజ్’గా ప్రధాని అభివర్ణించారు. చాలా కాలంగా బీహార్ వెనుకబడడానికి ఆయన కారణమని ఆరోపించారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్డీయే ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘వర్షం, తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా నా ప్రసంగాన్ని వినడానికి ఇక్కడికి వచ్చిన 20 ఏళ్ల యువతకు ఆర్జేడీ ‘జంగిల్ రాజ్’ గురించి తెలియకపోవచ్చు. చట్టవిరుద్ధ వ్యవహారాలు, పేదరికం, వలసలు ఆర్జేడీ పాలనలో ముఖ్య లక్షణాలు. బీహార్‌ను తిరిగి అభివృద్ధి బాట పట్టించింది సీఎం నితీష్ కుమార్ మాత్రమే” అని మోదీ అన్నారు.
Read this- England vs India: ఇంగ్లండ్‌పై కదం తొక్కిన జైస్వాల్.. సంచలన రికార్డు
అంబేద్కర్‌ను అగౌరవపరుస్తావా?
జూన్ 11న లాలూ ప్రసాద్ యాదవ్ తన పుట్టిన రోజు వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటానికి కాళ్లు దగ్గరగా పెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. లాలూను ఆయన మూర్ఖుడితో పోల్చారు. “ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ఆర్జేడీ అగౌరవపరిచిన వీడియో ఫుటేజ్‌ను ఇటీవల దేశం మొత్తం చూసింది. అయినప్పటికీ, ఈ వ్యక్తులు (లాలూ ప్రసాద్‌ను ప్రస్తావిస్తూ) వారి మూర్ఖత్వానికి ఎప్పటికీ క్షమాపణ చెప్పరు. మోదీ మాత్రం అలా కాదు. అంబేద్కర్‌ను హృదయంలో ఉంచుకుంటారు. వాళ్లకు (ఆర్జేడీ, కాంగ్రెస్) కుటుంబాలే ముఖ్యం. అన్నింటికంటే కుటుంబాలే ముఖ్యం. బీజేపీలో ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ ఉంటుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బహిరంగ సమావేశానికి ముందు, విద్యుత్, రైల్వేలు, డ్రైనేజీ రంగాలకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు.
Read this- Iran Israel Conflict: ఇరాన్‌కు భారత్ ప్రత్యేక విజ్ఞప్తి.. వెంటనే అంగీకారం
భారత్‌పై ప్రపంచం ప్రశంసలు
మూడు దేశాల పర్యటన నుంచి తాను నిన్ననే (గురువారం) తిరిగి వచ్చానని, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వృద్ధి చెందడాన్ని ప్రపంచ నాయకులు ప్రశంసిస్తున్నారని మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే, బీహార్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మోదీ పేర్కొన్నారు. బీహార్‌కు అన్ని విధాల అండగా నిలుస్తున్నారంటూ ఈ సందర్భంగా ప్రధాని మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు బీహార్‌లో పర్యటించిన ప్రతిసారీ వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను విరాళంగా ఇస్తున్నారు. ఈ చలవ రాష్ట్రం సత్వర అభివృద్ధికి దోహదపడుతుంది’’ అని అన్నారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధాని మోదీ విమర్శలు చేయడంతో అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించినట్టేనని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు. తాజా పర్యటన కలుపుకొని ఈ ఏడాది నాలుగుసార్లు బీహార్‌లో ప్రధాని పర్యటించారు.