Iran Israel Conflict: చిరకాల శత్రుదేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య (Iran Israel Conflict) భీకర పోరు కొనసాగుతోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట ఇరాన్‌లోని అణు కేంద్రాలు, ఆ దేశానికి చెందిన కీలక శాస్త్రవేత్తలు, ఆర్మీ చీఫ్‌లను డ్రోన్, క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ బలగాలు అంతమొందించడంతో ఈ తీవ్ర ఘర్షణ ఆరంభమైంది. గతవారం రోజులుగా ఇరు దేశాలూ పరస్పరం మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. దీంతో, రోజురోజుకూ అక్కడి పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి.
యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత పౌరులు అక్కడ ఉండడం ఏమాత్రం క్షేమం కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం, తరలింపు ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ఆపరేషన్ సింధు’ను మొదలు పెట్టింది. ఇందుకోసం ఇరాన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా గగనతలాన్ని తెరవాలని కోరింది. ఈ విజ్ఞప్తికి ఇరాన్ ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. కేవలం భారత విమానాలు ప్రయాణించేందుకు వీలుగా గగనతలాన్ని తెరుస్తామని ఒప్పుకుంది. ఒకవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తూ అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం.
Read this- Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లిపై ఆసక్తికర విషయం బయటపెట్టిన వెడ్డింగ్ డిజైనర్
కాగా, ఆపరేషన్ సింధులో భాగంగా, మషద్ నుంచి మహాన్ ఎయిర్ చార్టర్డ్ విమానాల ద్వారా సుమారు 1,000 మంది భారతీయులను స్వదేశానికి తరలించనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తొలి విమానం శుక్రవారం రాత్రి (జూన్ 20) ఢిల్లీలో ల్యాండింగ్ కానుంది. ఇరాన్ నుంచి వచ్చేయాలని నిర్ణయించుకున్న భారతీయుల కోసం ఈ చార్టర్డ్ విమానాలను అధికారులు షెడ్యూల్ చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, అక్కడి భారత పౌరుల భద్రత ఈ ఆపరేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్ర దాల్చుతున్న నేపథ్యంలో, రెండు రోజుల క్రితమే ‘ఆపరేషన్ సింధు’ను ప్రారంభించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇరాన్‌లో ఇజ్రాయెల్ సైనిక దాడులు కొనసాగుతుండటం, ఘర్షణ కాస్త పరిధి ధాటి యుద్ధ రూపు దాల్చుకొని మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ ఈ ఆపరేషన్ చేపట్టింది.
Read this- Pakistan: పాక్ అమ్ములపొదిలోకి అధునాతన అస్త్రం.. భారత్ వద్ద కూడా లేదు
తరలింపు ప్రక్రియలో భాగంగా 110 మంది భారతీయ విద్యార్థులను ఉత్తర ఇరాన్ నుంచి సురక్షితంగా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. కాగా, ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను ఇరాన్, అర్మేనియాలోని భారత కాన్సులేట్లు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. ఇరాన్‌లో సుమారుగా 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో, దాదాపు 1,500-2,000 మంది విద్యార్థులు, మరో 6,000 మంది ఉపాధి, ఇతర పనుల కోసం జీవిస్తున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాల నుంచి భారత్ రావాలనుకున్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం తరలింపు ప్రక్రియను ప్రారంభించింది.
ఇక, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులను భూ సరిహద్దుల ద్వారా బయటకు తరలిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత, వారిని విమానంలో భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం రవాణా, ఇతర సమన్వయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.