Kuberaa Review
ఎంటర్‌టైన్మెంట్

Kuberaa Review: ధనుష్, నాగ్, రష్మికల ‘కుబేర’ ఎలా ఉందంటే..

మూవీ పేరు: ‘కుబేర’
విడుదల తేదీ: 20 జూన్, 2025
నటీనటులు: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, నాజర్, షాయాజీ షిండే, జయప్రకాశ్‌ తదితరులు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల

Kuberaa Review: దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తమిళ దర్శకుడు మణిరత్నం సినిమాల కోసం ఎలా అయితే అంతా వెయిట్ చేస్తుంటారో.. టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల సినిమాల కోసం కూడా అంతగా ఎదురు చూస్తుంటారు. వారిద్దరి చిత్రీకరణ స్టైల్ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. చాలా సైలెంట్‌గా వారి పని వాళ్లు చేస్తుంటారు. రొటీన్ కంటెంట్ కాకుండా, మంచి మెసేజ్‌తో ఏదైనా కొత్తగా ప్రేక్షకులకు చెప్పాలని శేఖర్ కమ్ముల తాపత్రయపడుతుంటారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలను గమనిస్తే.. ఇది అర్థమవుతుంది. అలాంటి దర్శకుడు ఫస్ట్ టైమ్ స్టార్ హీరోలైన ధనుష్, నాగార్జున వంటి వారితో చేసిన చిత్రం ‘కుబేర’. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మొదటి నుంచి ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. విడుదల విషయంలో కాస్త జాప్యం జరిగినప్పటికీ టీజర్, ట్రైలర్, ఇంటర్వ్యూలతో సినిమాపై భారీగా హైప్ పెంచారు. మరి ఆ హైప్‌ని ఈ సినిమా అందుకుందా? చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల చేసిన ‘కుబేర’ ఎలా ఉంది? అసలు ‘కుబేర’లో ఉన్న మ్యాటరేంటి? బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

‘కుబేర’ కథ (Keberaa Story):
స్టోరీ చాలా నేచురల్‌గా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో నిజాయితీ గల ఆఫీసర్స్‌ని రాజకీయ నాయకులు ఎలా ఇబ్బంది పెడుతున్నారో తెలియంది కాదు. అదే లీడ్‌తో సినిమా ప్రారంభమవుతుంది. దీపక్ (కింగ్ నాగార్జున) ఒక నిజాయితీపరుడైన సీబీఐ అధికారి. దేనిని లెక్క చేయడు. అలాంటి అధికారిని ఒక మంత్రి తన ఇంటిపై రైడ్ చేసినందుకు లేని పోని కేసులు పెట్టించి జైలుకి పంపిస్తాడు. దీపక్ గురించి, అతని తెలివితేటల గురించి తెలిసిన దేశంలోనే టాప్ రిచెస్ట్ పర్సన్స్‌లో ఒకరైన నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్).. తన పలుకుబడితో బయటికి తీసుకువస్తాడు. దీపక్‌ని నీరజ్ మిత్రా బయటికి తీసుకురావడానికి ఓ కారణం ఉంటుంది.. అదేంటి? దీపక్‌కి నీరజ్ మిత్రా అప్పగించిన లక్ష కోట్ల రూపాయల వర్క్‌లో ఒక బిచ్చగాడు, అనాథ అయిన దేవా (ధనుష్) ఎలా భాగమయ్యాడు? ఎందుకు భాగమయ్యాడు? దీపక్ అండ్ నీరజ్ మిత్రా టీమ్‌ని ఈ మనీ వ్యవహారంలో దేవా ఎన్ని ఇబ్బందులు పెట్టాడు? దేవాతో ఉండే సమీరా (రష్మిక మందన్నా) ఎవరు? దేవాతో పాటు సమీరాను కూడా ఆ టీమ్ ఎందుకు వెతుకుతుంది? చివరికి వారిద్దరూ దొరికారా? ఆ లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వచ్చిన ‘కుబేర’ చూడాల్సిందే.

Also Read- Ayan Mukerji: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణ వల్లే.. ‘వార్ 2’ ఆలస్యం!

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇందులో నటించిన ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రధాన పాత్రలైన ధనుష్, నాగార్జున, రష్మిక ముగ్గురూ కూడా మూడు పిల్లర్స్‌గా నిలబడ్డారు. నాలుగో పిల్లర్ శేఖర్ కమ్ముల. ముఖ్యంగా ధనుష్ డీగ్లామర్ పాత్ర, అందులోనూ బిచ్చగాడి పాత్ర చేయడం మాములు విషయం కాదు. తెలుగు హీరోలని ఎవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేం కూడా. అంతబాగా తన నటనతో ధనుష్ ఆ పాత్రకు న్యాయం చేశారు. ఇంకా చెప్పాలంటే.. మరో నేషనల్ అవార్డు పక్కా అనేలా.. ఇందులో ధనుష్ పాత్రని శేఖర్ కమ్ముల డిజైన్ చేశారు. అంతే గొప్పగా ధనుష్ తన నటనతో మెప్పించారు. కెరీర్‌లో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఇలాంటి తరహా పాత్రలైతే చేయలేదు. చాలా కొత్తగా ఆయన పాత్రని శేఖర్ మలిచారు. ఆయన పాత్రలో రెండు కోణాలు ఉంటాయి. నాగార్జునని తెరపై చూసి అంతా ప్రేమించేస్తారు. అంత బాగా నాగ్.. ఈ పాత్రకు సరిపోయారు. రష్మిక ఇందులో రెగ్యులర్‌గా కనిపించేలా కాకుండా.. చాలా సహజంగా కనిపిస్తుంది. ఆమె డైలాగ్స్ అందరితో ఈలలు వేయిస్తాయి. కింగ్ నాగ్ కూడా చెప్పారు.. సినిమాలో నాకు నచ్చిన పాత్ర రష్మికాదే అని. అవును అది నిజమే. రష్మిక ఖాతాలో మంచి హిట్ పడినట్టే. విలన్‌గా జిమ్ సర్బ్‌కి మంచి లైఫ్ ఇచ్చిన చిత్రంగా ‘కుబేర’ నిలబడిపోతుంది. చాలా గంభీరమైన పాత్రలో, అంతే గంభీరంగా డైలాగ్స్ చెబుతూ.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే అందరికీ ఎక్కేస్తాడు. శేఖర్ కమ్ముల చెప్పినట్టుగా ముందు ముందు ఆయనకు మరిన్ని అవకాశాలు రావడం తధ్యం. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.

Kuberaa Still

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సాంకేతికంగా దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి మార్కులు పడతాయి. సౌండ్ స్పీకర్లు పగలగొట్టాలని కాకుండా.. సన్నివేశానికి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలా ఇచ్చి.. థియేటర్స్‌లో ఉన్న వారందరినీ సినిమాలో లీనం అయ్యేలా చేయడంలో దేవిశ్రీ పాత్ర ఎంతో కీలకమైనది. అంతేకాదు, అసలీ సినిమాకు సంగీతం అందించింది దేవిశ్రీ అంటే ఎవరూ నమ్మరు కూడా. టెర్రిఫిక్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ కూడా వేటికవే అన్నట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా మాత్రం ధనుష్, రష్మికల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలకు కత్తెర పడితే బాగుండేది అనిపిస్తుంది. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు.. తమ ప్రతిభను కనబరిచారు. శేఖర్ కమ్ముల తన మార్క్ తప్పకుండా ఓ వైవిధ్యమైన కథను చెప్పిన విధానం అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, ఎంచుకున్న పాత్రలు అన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ ఆలోచించేలా చేస్తాయి. కాస్త ఆలస్యమైనా, ఒక మంచి కథని ఆయన తెరకెక్కించిన తీరుకు అభినందనీయుడు.

విశ్లేషణ:
శేఖర్ కమ్ముల ఈ సినిమా కథను ట్రైలర్‌లోనే చెప్పేశారు. అలాగే ఇంటర్వ్యూలలో కూడా బిలియనీర్‌కు, బెగ్గర్‌కు మధ్య జరిగే సంఘర్షణతో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. వైట్ మనీ, బ్లాక్ మనీ అంటూ ధనవంతులు చేసే ట్రిక్స్‌ని ఇందులో శేఖర్ కమ్ముల టచ్ చేశారు. బ్లాక్ మనీ, బినామీ సిస్టమ్‌లోని లొసుగులను ఎత్తి చూపారు. తను ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నాడో.. సినిమా స్టార్టింగ్‌లోనే ఆయన ఓ స్పష్టతనిస్తారు. దీపక్ పాత్రని పరిచయం చేసిన తీరు, ఆ పాత్రకు ఉన్న విభిన్నత్వం చక్కగా పండాయి. ధనుష్ ఇంట్రడక్షన్ సీన్‌తో చూస్తున్న వారి గుండెలు పిండేశాడు. ఆ తర్వాత దీపక్ బినామీ కుట్రలో దేవాని భాగం చేయడం మొదలు, ఆయన పాత్ర నడిచే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సినిమాలో లీనం చేస్తుంది. బెగ్గింగ్ మాఫియా విషయంలో ఆయన టచ్ చేసిన పాయింట్స్ ఆకట్టుకుంటాయి.

Also Read- Famous Temple: మెగాస్టార్ ధ్యానం చేసిన ఆలయం.. అమరావతికి దగ్గరలోనే!

బినామీ దేవా పారిపోయిన తర్వాత దీపక్, నీరజ్ చేసే ప్రయత్నాలు, ఈ కుట్రలో సమీరా ఇరుక్కోవడం వంటి వన్నీ ప్రేక్షకులకు థ్రిల్ పంచుతాయి. ఇక నాగ్‌లోని రెండో కోణం మొదలైనప్పటి నుంచి సినిమా ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ కూడా మంచి కిక్ ఇస్తుంది. క్లైమాక్స్ కాస్త రొటీన్ అనిపిస్తుంది కానీ, అంతకు ముందు వరకు శేఖర్ కమ్ముల మార్క్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను చూపుతిప్పుకోనివ్వదు. ఈ క్రమంలో దీపక్ పాత్ర ప్రేక్షకులని ఎమోషన్‌కు గురి చేస్తుంది. ఓవరాల్‌గా అయితే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఐటమ్ సాంగ్స్, ఎలివేషన్లు, ఎక్స్‌పోజింగ్ వంటివే అవసరం లేదని, కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిన శేఖర్ కమ్ముల వంటి వారు, అవేమీ లేకుండా కూడా మంచి కథ, స్క్రీన్‌ప్లే‌తో కూడా థియేటర్లకు రప్పించగలరని నిరూపించిన చిత్రమే ‘కుబేర’. ‘స్వేచ్ఛ కోసం తల్లిదండ్రులని అడుక్కున్నా, ప్రేమించమని వెధవను అడుక్కున్నా, ఇంట్లో కొన్ని రోజులు ఉండనివ్వమని స్నేహితురాలని అడక్కుకున్నా, ఉద్యోగం కోసం అడుక్కుంటున్నా.. ఇక్కడ‌ అందరం అడుక్కునే వాళ్లమే’ అనే డైలాగ్ రాయడానికి ఎన్ని ఘట్స్ కావాలి. బికారి అయినా, బిలియనీర్ అయినా మనుషులంతా ఒక్కటే. అందరూ ఏదో ఒక చోట అడుక్కోవాల్సిందే అంటాడు శేఖర్ కమ్ముల. సినిమాలో కొంత సాగదీత, రిపీటెడ్ సీన్లు అన్నట్లుగా కొన్ని ఉన్నాయి కానీ.. నటీనటుల నటన, శేఖర్ కమ్ముల రచనలోని నిజాయితీ.. వాటన్నింటినీ లెక్కలోకి రానివ్వవు. ఒక మంచి సినిమా చూశామనే ఫీల్ మాత్రం ప్రేక్షకులకు ‘కుబేర’ ఇస్తుంది.

ట్యాగ్‌లైన్: కుబేర.. కమ్ముల కొట్టేశాడ్రా!
రేటింగ్: 3/5

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ