Harish rao: యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ.1,161 కోట్ల బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. సన్ ఫ్లవర్ కొనుగోలు పూర్తై 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.
ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వలేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్ ఫ్లవర్ రైతుల (Sun Flowers Farmers) పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని చెప్పారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని వ్యవసాయ మంత్రి ప్రగల్బాలు పలికారని అన్నారు. రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయమని చెప్పారు. వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రూ.1,116 కోట్ల సన్నాల బోనస్ తో పాటు సన్ ఫ్లవర్ రైతుల డబ్బులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని.. ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
Also Read: YS sharmila: ఏపీలో రప్పా రప్పా రచ్చ.. జగన్‌ను ఏకిపారేసిన వైఎస్ షర్మిల..!
ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress Govt).. పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోందన్న హరీశ్.. 50 శాతం రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదని అన్నారు. గత వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారని.. యాసంగిలో రైతు భరోసా సగం మందికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు రూ.15 వేల రైతు భరోసా అని చెప్పి.. మాట తప్పి రూ.12,000 కి పరిమితం చేశారని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఎన్నికల హామీల్లో అన్ని పంటలకు బోనస్ అని చెప్పి రైతులను మభ్యపెట్టారని.. ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.