Street Lights: రోజురోజుకూ పెరుగుతున్న స్ట్రీట్ లైట్ల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం అడిషనల్, జోనల్ కమిషనర్లు, హెచ్‌ఓడీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో డీ-సిల్టింగ్, శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, దోమల నివారణ, పన్నుల వసూళ్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్ట్రీట్ లైట్ సమస్యలపై కార్పొరేటర్లు, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, సాయంత్రం వేళల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు గల కారణాలను తెలుసుకుని పరిష్కరించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. మ్యాన్ పవర్, మెటీరియల్ ఏర్పాటుకు జోనల్ కమిషనర్లకు అనుమతి ఇచ్చినందున, సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ ఇంజినీర్లు, ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. తాను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కమిషనర్ వెల్లడించారు.
Also Read: Abhishek Bachchan: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. సింగిల్ గా ఉండాలనిపిస్తోందంటూ అభిషేక్ బచ్చన్ పోస్ట్?
సీజనల్ వ్యాధుల నివారణ..
వర్షాకాలంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. ఏఎల్ఓల ద్వారా ఐఈసీ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని, అందుకోసం పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో, పాఠశాలల్లో శానిటేషన్‌తో పాటు డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అడిషనల్ కమిషనర్ (హెల్త్) పంకజను కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన టార్గెట్ల మేరకు పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, ఖాళీ స్థలంపై నిర్దేశించిన లక్ష్యం మేరకు వసూలు చేయాలని ఆదేశించారు. గుర్తించిన కమర్షియల్ ప్రధాన రోడ్లలో ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ పరిశీలించి టాక్స్ వసూలు చేయాలన్నారు. ఈ విషయంలో తిరిగి విజిలెన్స్ బృందాలు కూడా పరిశీలన చేస్తాయని కమిషనర్ స్పష్టం చేశారు. డీ-సిల్టింగ్‌లో ఆశించిన ప్రగతి లేనందున, హైడ్రా సమన్వయంతో పరిశీలించి ప్రగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
Also Read: Maneru River: ‘మానేరు’ అవినీతిపై విచారణ చేపట్టాలని.. సీఎంను కోరిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి