King Nagarjuna: కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను కింగ్ నాగార్జున మీడియాకు తెలిపారు.
శేఖర్ కమ్ములతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉంది. చైతన్య ఆయన దర్శకత్వంలో సినిమా చేశాడు. నేను కూడా చేయాలని అనుకుంటూ ఉన్నా. ‘ఆనంద్’ దగ్గర నుంచి ఆయన చేసిన అన్ని సినిమాలు చూశాను. అన్నీ నాకు ఇష్టమే. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ నాకు బాగా నచ్చుతుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్‌గానే ఉంటాయి. అలాగే అద్భుతమైన పాటలు ఉంటాయి. ‘కుబేర’ వంటి మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు వేరే హీరోలతో చేశాను. నాన్న(ఏఎన్ఆర్), ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి లెజెండ్స్ ఎంతో మంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు.
Also Read- Peddi: ‘పెద్ది’లో రామ్ బుజ్జిగా ‘మీర్జాపూర్’ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?
‘కుబేర’లో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్‌గా ఉంటుంది. శేఖర్‌కి ఈ పాయింట్ తన మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాలో మంచోళ్ళు ఉన్నారు.. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. అందరికీ ఈ సినిమా రీచ్ అవుతుంది. ఇందులో నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణతో నా పాత్రని మలిచాడు శేఖర్. నా పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. శేఖర్ చాలా అద్భుతంగా రాశారు. పెర్ఫార్మన్స్‌కి మంచి స్కోప్ ఉండే పాత్ర. ఇంకా ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్‌కి రిలేటెడ్‌గా ఉంటూ, అందరినీ లీనం చేస్తాయి. శేఖర్ నా పాత్రని ఎలా అయితే రాశాడో.. అలానే చిత్రీకరించాడు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. ఏ కొంచెం మార్చినా.. మొత్తం చెడిపోతుంది. అలా కనెక్ట్ అయి ఉంటాయి పాత్రలు. ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అతని పాత్రకు చాలా మంచి మార్కులు పడతాయి. రష్మిక క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. తను అద్భుతంగా చేసింది. సినిమా చూసిన తర్వాత రష్మికతో.. ఈ సినిమాకు నువ్వే స్టార్ అని చెప్పా. అంత బాగుంటుంది ఆమె పాత్ర.
Also Read- Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లి ఫిక్స్? రాజ్ నిడిమోరు భార్య పెట్టిన పోస్ట్ తో కన్ఫర్మ్?
ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పాత్రలలో కంటే ‘కుబేర’లోని పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా కథే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. ఇలా అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శేఖర్ కమ్ముల స్టైల్‌లో ఉంటాయి. ఈ సినిమాను దాదాపుగా రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశాం. తిరుపతి, ముంబై, గోవా, బ్యాంకాక్ ఇలా అన్ని బిగ్ రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావుఒక పెద్ద సినిమా చేయాలనుకున్నారు. తెలుగు, తమిళ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది. చాలా ప్యాషన్‌తో సినిమా తీశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏది అడిగితే అది ఇచ్చారు. సినిమా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. పాటలు సందర్భానుసారంగా వస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.
ఇది చాలా వైవిధ్యభరితమైన చిత్రం. రెగ్యులర్ స్క్రీన్‌ప్లే కాదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి ఉండదు. నిజంగా ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి. పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం లేదు కదా. ఈ సినిమా తర్వాత ‘కూలీ’లో మరో డిఫరెంట్ పాత్ర చేస్తున్నాను. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైమ్ నేను అలాంటి పాత్రలో చేశాను. నా 100వ సినిమాకు సంబంధించి ప్లానింగ్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్‌గా ‘కింగ్100’ అని పెట్టాం. ‘శివ 4K’ వెర్షన్ పూర్తయింది. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ చేస్తున్నారు. ఒక రీల్ చూశాను. చాలా బాగా వస్తుంది. త్వరలోనే రీ రిలీజ్ తేదీ ప్రకటిస్తాం. సితార, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇలా అన్ని బ్యానర్లలో సినిమాలు చేయాలని ఉంది. కాకపోతే మంచి ప్రాజెక్ట్ సెట్ కావాలి’’ అని కింగ్ నాగార్జున ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు