Air India Crash Survivor: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం (Air India Plane Crash) నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ (Vishwas Kumar Ramesh) ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు ఆయనే కావడం గమనార్హం. ప్రమాదం అనంతరం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన విశ్వాస్ కుమార్.. తాజాగా కోలుకున్నారు. అయితే ఆస్పత్రి నుంచి నేరుగా తన సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అతడి పాడే మోసి కన్నీరు మున్నీరు అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డీఎన్ఏ ఆధారంగా గుర్తింపు
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం జూన్ 12న ఘోర ప్రమాదానికి గురైంది. అయితే ఆ విమానంలోనే విశ్వాస్ కుమార్ తో పాటు అతడి సోదరుడు అజయ్ కుమార్ కూడా ఉన్నారు. విశ్వాస్ ప్రాణాలతో బయటపడగా.. అజయ్ మాత్రం అగ్నికీలల్లో చిక్కుకొని మరణించాడు. విశ్వాస్ డీఎన్ఏ ఆధారంగా అజయ్ మృతదేహాన్ని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. దీంతో బుధవారం అతడి కుటుంబానికి అజయ్ బాడీని అప్పగించారు. ఈ క్రమంలోనే అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విశ్వాస్ కుమార్.. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
#WATCH | Diu | Lone survivor of AI-171 flight crash, Vishwas Ramesh Kumar, mourns the death of his brother Ajay Ramesh, who was travelling on the same flight
Vishwas Ramesh Kumar is a native of Diu and is settled in the UK. pic.twitter.com/fSAsCNwGz5
— ANI (@ANI) June 18, 2025
తమ్ముడి కోసం కన్నీరుమున్నీరు
డయ్యూలోని విశ్వాస్ స్వగృహంలో అజయ్ అంత్యక్రియలను నిర్వహించారు. ముందు రోజు రాత్రే ఇంటికి చేరుకున్న విశ్వాస్.. సోదరుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా కన్నీరు పెట్టుకున్నారు. తన సోదరుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడని తెలిసి.. కన్నీరుమున్నీరు అయ్యారు. మరుసటి రోజు జరిగిన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఒంటిపై ఉన్న గాయాల తాలుకూ కట్లతోనే విశ్వాస్ ఏడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. విశ్వాస్ కష్టాన్ని చూసి నెటిజన్లు సైతం బాధపడుతున్నారు. సోదరుడి ఆత్మకు శాంతి కలగలాని కోరుకుంటున్నారు. భయానక ఘటన నుంచి విశ్వాస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Vishwas Kumar, the only passenger who survived the plane crash, has been discharged from the Civil Hospital. But Ramesh Vishwas is mourning the death of his brother. pic.twitter.com/wgiNoRKvXf
— ChoosyBluesy (@ChoosyBluesy) June 18, 2025
విశ్వాస్ బయటపడటం.. మిరాకిల్!
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతటి ఘోర విమాన ప్రమాదం నుంచి రమేష్ ప్రాణాలతో బయటపడడం చూసి దేశవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోయారు. రమేష్ వయసు 38 సంవత్సరాలు కాగా.. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొని ఉన్నాడు. విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌కు వెనుక భాగంలో ఆ సీటు ఉంది. ప్రాణాలతో బయటపడ్డ అతడికి కొన్ని గాయాలు కాగా.. ముఖంపై బాగానే దెబ్బలు తగిలాయి. ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడిన విశ్వాస్.. తన సోదరుడు అజయ్ కుమార్ తో కలిగి యూకేకు బయలుదేరినట్లు చెప్పారు. తన సోదరుడు మాత్రం వేరే వరుసలోని సీటులో కూర్చున్నాడని వెల్లడించారు.