MLA Raja Singh: బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేసే ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నట్టుండి స్వరం మార్చారు. సడెన్‌గా యూటర్న్ తీసుకున్నారు. విన్నపాలు వినవలెనంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని వేడుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో నిత్యం అసంతృప్తరాగాలు వినిపించే ఎమ్మెల్యే రాజాసింగ్. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా విన్నపాలు వినవలేనంటూ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారు. ఆకస్మాత్తుగా గోషామహల్ స్వరం మారడానికి కారణాలేంటనే అంశంపై పార్టీలో చర్చసాగుతోంది. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని ప్రతిసందర్భంలోనూ రాష్ట్ర నాయకత్వంపై చిటపటలాడేవారు. పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఏమీ అనకపోయినప్పటికీ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ చికాకు పెట్టేవారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని చాలా సార్లు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు.
రాజాసింగ్‌ను సముదాయించే ప్రయత్నం
హైదరాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో స్వయంగా కేంద్రమంత్రి బండి సంజయ్ వెళ్లి రాజాసింగ్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు సైలెంట్‌గా ఉన్న రాజాసింగ్ ఆ తర్వాత కరీంనగర్ నుంచి వార్ మొదలైందంటూ ఇన్ డైరెక్ట్‌గా బండి సంజయ్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తే చేసుకోండంటూనే అందరి జాతకాలు బయటపెడతానంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కొరకరాని కొయ్యలా రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజాసింగ్ కామెంట్స్ పై కిషన్ రెడ్డి స్పందించారు. పనికి వచ్చేది మాట్లాడాలని, రాజాసింగ్ సీనియర్ లీడర్ ప్రజాప్రతినిధి, తాను సామాన్య కార్యకర్తను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజాసింగ్ ఏమనుకున్నారో ఏమో వెంటనే తన రోటిన్ మేసేజ్‌లకు భిన్నంగా మీడియాకు విన్నపాలు వినవలేనంటూ కిషన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నట్లు మేసేజ్ పాస్ చేయడం గమనార్హం.
Also Read: AP Politics: కూటమి ఏడాది పాలనపై సర్వే.. కలలో కూడా ఊహించని విషయాలు వెలుగులోకి!
సమయం చెప్తే కలిసేందుకు సిద్ధం
తెలంగాణ బీజేజీకి సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు వ్యక్తిగత సమయం ఇవ్వాలని, తాను వచ్చి కలిసేందుకు సిద్ధమని రాజాసింగ్ కిషన్ రెడ్డి (Kishan Reddy)ని అభ్యర్థించారు. సమయం నిర్ణయించి చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి.. ఐక్యంగా పని చేద్దామని కోరారు. రాజాసింగ్ యూ టర్న్ స్టేట్ మెంట్ పై పార్టీలో విస్తృత చర్చసాగుతోంది. రాజాసింగ్ యూటర్న్ తీసుకోవడానికి ముందు.. బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జరిగిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి ఏం చేశారు? తనపై నిత్యం అసంతృప్తిగళం విప్పే నాయకుడిని దారికి తెచ్చుకున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి సమస్యలు వినేందుకు కమలదళపతి కిషన్ రెడ్డి.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు టైం ఇస్తారా? విబేధాలు పక్కనపెట్టి కలిసి పనిచేస్తారా ? అన్నది చూడాలి.
Also Read: Mulugu District News: ఆదివాసీల గుడిసెలను కూల్చేందుకు అటవి పోలీసులు ప్రయత్నం