Jagan On Chandrababu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: చంద్రబాబు-జగన్ మధ్య ‘కమ్మ’ ఫైట్.. అభ్యంతరమేంటి?

YS Jagan: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బాబు-జగన్ మధ్య ‘కమ్మ’ సామాజికవర్గం విషయంలో పెద్ద యుద్ధమే జరుగుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఆత్మహ‌త్య చేసుకున్న వైసీపీ కార్యక‌ర్త, గ్రామ ఉప స‌ర్పంచ్‌ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జ‌గ‌న్ ప‌రామ‌ర్శించి, ఆయ‌న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబూ.. తమరికి ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ కుమ్మవారు మా వైసీపీలో ఉంటే నీకేంటి అభ్యంతరం? వైసీపీలోని కమ్మవారిని చంద్రబాబు టార్గెట్‌ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేరనే దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు? చంద్రబాబు శాడిజానికి వంశీ బాధపడుతున్నారు. కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు? ఏంపాపం చేశాడని మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని కృష్ణవేణిని మహిళ అని కూడా చూడకుండా వేధించారు. ఏం పాపం చేశాడని ఇంటూరి రవి కిరణ్‌పై కేసులు పెట్టి వేధించారు’ అని చంద్రబాబుపై జగన్ ధ్వజ‌మెత్తారు.

YS Jagan

ఏం పాపం చేశారు?
ఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా? అని అడుగుతా ఉన్నా. కమ్మవారు పుట్టింది కేవలం చంద్రబాబుకు ఊడిగం చేయడానికేనా? అని అడుగుతున్నా. కమ్మవారు పుట్టింది కేవలం చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పుట్టారంట. చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే.. ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని వెంటాడి వెంటాడి.. హింసించి జైల్లో పెట్టడం.. దొంగకేసులు బనాయించడం.. దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం.. కేవలం చంద్రబాబుకు మాత్రమే చెల్లు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ, అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశాడని తనను పొట్టనపెట్టుకున్నారని చంద్రబాబును అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం చేశారని భయపెట్టి.. బెదిరించి ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఎందుకు తీసుకువచ్చారని చంద్రబాబును అడుగుతా ఉన్నా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న నిదర్శనం అని వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Read Also- Actor Arya: స్టార్ నటుడు ఆర్యకు బిగ్‌ షాక్.. ఇంట్లోకి ప్రవేశించిన ఐటీ అధికారులు

ఇన్ని అక్రమ కేసులా?
ఏం పాపం చేశార‌ని మా పార్టీకి చెందిన వినుకొండ‌, పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంక‌ర‌రావుల‌ మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్ మీదా అక్రమ కేసులు పెట్టారు. ఆయ‌న కాలేజీల‌కు చెల్లించాల్సిన ఫీజు రీయిబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు చెల్లించ‌కపోగా కాలేజీలో త‌నిఖీల పేరుతో చిత్రహింస‌ల‌కు గురిచేస్తున్నారు. మా పార్టీ సానుభూతిప‌రుడైనందుకు ఇదే క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన సినీ న‌టుడు పోసాని కృష్ణముర‌ళిని నెల‌రోజుల‌పాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బ‌నాయించి శ్రీకాకుళం నుంచి క‌డ‌ప దాకా ర‌క‌ర‌కాల స్టేష‌న్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడ‌ని ఆయ‌న‌కు వైజాగులో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు ర‌ద్దు చేశారు. మంగ‌ళ‌గిరికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి సోష‌ల్ మీడియాలో చంద్రబాబుకి వ్యతిరేకంగా, జ‌గ‌న్‌కి అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయ‌నతోపాటు ఆయ‌న భార్య కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెల‌రోజుల‌పాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి చొక్కా విప్పించి లోకేష్ ఫొటో ముందు మోకాళ్లపై నిల‌బెట్టి ప్రాధేయ‌ప‌డేలా చేశారు. ఏం పాపం చేశాడ‌ని మరో సోష‌ల్ మీడియా కార్యక‌ర్త ఇంటూరి ర‌వికిర‌ణ్ మీద 19 త‌ప్పుడు కేసులు పెట్టి నెల‌ల త‌ర‌బ‌డి స్టేష‌న్ల చుట్టూ తిప్పారు అని కూటమి సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

YS Jagan Press meet

సినిమా చూపిస్తా..
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు జ‌రుగుతోంది. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అన్యాయాల మీద గురువారం ఉదయం 11 గంట‌ల‌కు సుదీర్ఘమైన ప్రెస్‌మీట్ పెట్టి ప్రజ‌లంద‌రికీ వివ‌రించ‌డం జ‌రుగుతుంది. చంద్రబాబుకి, ఆయ‌న‌కి వ‌త్తాసు పలుకుతున్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కొంద‌రికి (అంద‌రూ కాదు) మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఒక ఏడాది గ‌డిచిపోయింది. మ‌రో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తుంది. మా ప్రభుత్వం వ‌చ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తా. ఎందుకంటే నాగ‌మ‌ల్లేశ్వర‌రావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్ బుక్ కార‌ణంగా ప్రతి గ్రామంలోనూ క‌నిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి ప్రతి అధికారికీ ఒక‌టే చెబుతున్నా, ఈ అన్యాయాల‌లో మీరు భాగ‌స్వాములు కావొద్దు. భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు మిమ్మల్ని కూడా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తాన‌ని ఖ‌చ్చితంగా హెచ్చరిస్తున్నా. చంద్రబాబు పాల‌న‌లో రైతులు, చ‌దువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు ఎవ‌రూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబ‌ద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వ‌ర్గాలు బ‌లైపోయాయి. రెడ్ బుక్ రాజ్యాంగంతో విచ్చల‌విడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభ‌ద్రత‌లు పూర్తిగా నాశ‌నం అయిపోయాయి. ఈ ప‌రిపాల‌న ఎక్కువ రోజులు న‌డ‌వ‌దు. దేవుడు, ప్రజ‌లు గ‌ట్టిగా మొట్టికాయ‌లు వేసే రోజు తొంద‌ర్లోనే వ‌స్తుంద‌ని ఖ‌చ్చితంగా చెబుతున్నాను అని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చరించారు.

Read Also- YS Jagan: అల్లు అర్జున్‌ లాగే వైఎస్ జగన్‌ను కూడా అరెస్ట్ చేస్తారా?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?