Hydraa News:
- బడికి బాట చూపినందుకు హైడ్రాకు విద్యార్థుల ధన్యవాదాలు
హైడ్రా కార్యాలయంలో కమిషనర్‌ను కలిసిన విద్యార్థులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బడికి బాట చూపిన హైడ్రాకు స్కూల్ విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ డివిజన్ చిలకలగూడ దూద్‌బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మంగళవారం కలిసి చిరుసత్కారం చేశారు. స్కూల్‌కు రాకపోకలు సాగించే బాటను కొద్ది రోజుల క్రితం కొందరు స్థానికులు మూసివేశారు. అడ్డంగా ప్రహరీ గోడను నిర్మించారు. దీంతో, విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే పాఠశాల మార్గాన్ని తెరిపించాలంటూ స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున్ రెడ్డి, మరికొందరు ఉపాధ్యాయులు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు ముందు గతంలో ధర్నా చేశారు. విషయం తెలిసిన మరుసటి రోజే హైడ్రా స్పందించింది.
పాఠశాలకు రాకపోకలు సాగించేందుకు అడ్డుగా నిర్మించిన గోడను నేలమట్టం చేసింది. పాఠశాలకు రాకపోకలు సాగించేందుకు లైన్ క్లియర్ చేసింది. బడికి బాట ఏర్పడడంతో హర్షం వ్యక్తం చేసిన స్కూల్ విద్యార్థులు మంగళవారం హైడ్రా ఆఫీసుకు వెళ్లి కమిషనర్ రంగనాథకు ధన్యవాదాలు తెలిపారు. ‘థ్యాంక్యూ సర్..’ అంటూ ముద్దుగా పలికారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకట రమణ విద్యార్థులతో పాటు హైడ్రా కార్యాలయానికి వచ్చారు. కమిషనర్ రంగనాథ్‌ను కలిసి ఒక మొక్కను బహుకరించారు.
Read this- Honeymoon Case: హనీమూన్ కేసులో వెలుగులోకి మరో వాస్తవం.. అందరూ షాక్
పాఠశాలకు వెళ్లే మార్గంలో అడ్డంగా ఉన్న ప్రహరీని తొలగించడంతో పాటు అక్కడ రోడ్డు వేయించి, పాఠశాలకు గేటు కూడా ఏర్పాటు చేయించినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. హైడ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సైతం ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, అందరూ బాగా చదువుకోవాలని సూచించారు. రంగనాథ్ చెప్పగానే అందరూ ఓకే సార్ అంటూ ముక్తకంఠంతో పలికారు. పాఠశాలకు రోడ్డు వేయించి గేటు పెట్టించిన జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ రవికిరణ్‌కు కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
Read this- Viral News: ప్రియుడితో లేచిపోయిన నవ వధువు.. సంతోషంలో భర్త.. ఎందుకంటే?
ఎఫ్‌సీఐ లేఔట్ పునరుద్ధరణ
శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌ను హైడ్రా మంగళవారం పునరుద్ధరించింది. ఈ లేఔట్ హద్దులను చెరిపేస్తూ సంధ్యా కన్వెన్షన్ ప్రతినిధులు పలు నిర్మాణాలు చేపట్టగారు. వాటిని అక్రమ నిర్మాణాలుగా నిర్ధారించిన హైడ్రా గత నెల 6న తొలగించింది. 20 ఎకరాలకు పైగా ఉన్న లే ఔట్‌లో 170 వరకూ ప్లాట్ల యజమానులున్నారు. 1980వ దశకంలో వేసిన లే ఔట్ నామ రూపాలు లేకుండా కబ్జాలకు గురైందని హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల హద్దులు లేకుండా పోయిన ఈ లేఔట్‌ను హైడ్రా పునరుద్ధరించింది. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి, హైడ్రా అధికారులు ఈ లేఔట్‌కు మళ్లీ జీవం పోశారు. గతంలో ఉన్న లేఔట్ ప్రకారం రహదారులకు హద్దులు నిర్ధారించి, వెంటనే వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంది. లే ఔట్ ప్రకారం ప్రధాన రహదారులతో పాటు ఇంటర్నల్ రహదారులను పునరుద్ధరించింది. రహదారులతో పాటు పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల హద్దులను నిర్ధారించడంతో అక్కడి ప్లాట్ యజమానులు హర్షం వ్యక్తం చేశారు. లే ఔట్ ప్రకారం ఎవరి ప్లాట్‌ను వారు గుర్తించి హద్దులు నిర్ధారించుకున్నారు. మ్యాంగో, యునెక్స్ ఫుడ్ కోర్టులతో పాటు స్పైసీ బార్, ఇలా 7 వరకూ ఉన్న దుకాణ సముదాయాలు కూడా రోడ్డుపై నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. వాటిని తొలగించాలని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో వాటిని కూడా తొలగించి రోడ్డు నిర్మాణం చేపడతామని హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.