Flight Emergency: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన తర్వాత, ఇతర విమాన సర్వీసుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, ఇతర అవాంతరాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి నమోదయ్యింది. కొచ్చి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది.
Read this- SSC CGL 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. భారీ ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
దీంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని నాగ్‌పూర్ మళ్లించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం సేఫ్‌గా ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 157 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం లోపల బాంబు అమర్చినట్టు ఒక ఈ-మెయిల్ వచ్చింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. రాడార్ డేటా ప్రకారం, విమానం ఉదయం 9:20 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, 11 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 9:31 గంటలకు కొచ్చి విమానాశ్రయం నుంచి బయలుదేరింది.
అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు
మంగళవారం (జూన్ 17) మధ్యాహ్నం అహ్మదాబాద్-లండన్ గాట్విక్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఏఐ-159 సర్వీసును అధికారులు రద్దు చేశారు. గగన తల పరిమితుల కారణంగా ఎయిరిండియా విమానం అందుబాటులో లేకపోవడం, అదనపు ముందు జాగ్రత్త తనిఖీల కారణంగా రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ‘‘అహ్మదాబాద్ నుంచి గాట్విక్ కు వెళ్లాల్సిన ఏఐ-159 విమానాన్ని ఈరోజే రద్దు చేశాం. అదనపు ముందు జాగ్రత్త తనిఖీలు జరిగాయి. అత్యంత జాగ్రత్తగా పరిశీలించడంతో సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టింది. ఎలాంటి సాంకేతిక లోపం లేదు’’ అని వివరించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నామని, ప్యాసింజర్లను వారిని వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రయాణికులకు హోటల్ వసతిని కూడా అందిస్తున్నామన్నారు. టికెట్ రద్దుపై పూర్తి డబ్బు వాపసు లేదా ఉచిత రీషెడ్యూలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. తత్ఫలితంగా, లండన్ గాట్విక్ నుంచి అమృత్‌సర్‌కు రావాల్సిన ఏఐ-170 విమానం కూడా రద్దు అయ్యిందని చెప్పారు.
అకస్మాత్తుగా విమానం రద్దు చేయడంపై ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘నేను లండన్ వెళుతున్నాను. కానీ, అనూహ్యంగా ఫ్లైట్ రద్దైంది. టికెట్ డబ్బులు వాపసు గురించి, రద్దు కావడానికి కారణాలపై సిబ్బంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, విమానం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దానిని మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ చేశారు. అయితే, విమానాన్ని రద్దు చేస్తూ మధ్యాహ్నం 1.45 గంటలకు ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. రద్దైన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఏఐ-159 అని ‘ఎయిరిండియా’ వెబ్‌సైట్ పేర్కొంది.
Read this- Ex Minister Srinivas Goud: ఫార్ములా ఈ కార్ రేస్‌లో.. అవినీతి జరగలేదు!
మరో విమానంలో సాంకేతిక లోపం
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళుతున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో హాల్ట్ సమయంలో ప్రయాణికులు అందరినీ కిందకు దించారు. ఎడమ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఇంజనీర్లు దానిని రిపేర్ చేశారు. ఈ కారణంగా కోల్‌కతా నుంచి ముంబైకి ప్రయాణం ఆలస్యమైంది. ఎయిరిండియా విమానం ‘ఏఐ180’ షెడ్యూల్ ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఎడమ ఇంజిన్‌లో సమస్య ఉన్నట్టు గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు.