Kishan Reddy: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, భవనంలోని ప్రతీ విభాగానికి సంబంధించిన వివరాలను దవాఖాన సూపరింటెండెంట్ తో పాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ టైమ్‌లో ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను సైతం ఆయన సందర్శించారు. ఆస్పత్రి భవనాలను వాటి మెయింటెనెన్స్‌ను స్వయంగా పరిశీలించారు. అయితే ఆస్పత్రిలో డ్రైన్ వ్యవస్థ మెరుగుపరిచాలని సూచించారు. అనంతరం మెయింటెనెన్స్ తో పాటు ఆస్పత్రిలో ఉన్న ప్రస్తుత ఖాళీలు ఎన్ని? వైద్య సిబ్బంది మొత్తం ఎంతమంది ఉన్నారు? డాక్టర్ల కొరత ఏమైనా ఉందా? ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారు? అని వివరాలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఏయే సర్జరీలు జరుగుతున్నాయి? ఎలాంటి సర్జరీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? అని ఆరా తీశారు.
ఏలాంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు
అంతేకాకుండా ఆసుపత్రిలో డయాగ్నస్టిక్స్ పరిస్థితి ఏంటి? రోగులకు ఏలాంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు? ఏయే వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి రోగులతో సైతం మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద వైద్య పరీక్షలు ఎలా కొనసాగుతున్నాయి? ఆయుష్మాన్ భారత్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమంది సిబ్బంది నియమించుకున్నారు? అనే విషయంపైనా కేంద్ర మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? ఇక్కడే అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారా? వంటి అంశాలపైనా కేంద్ర మంత్రి ఆరా తీశారు. కాగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని, కరోనా ప్రొటోకాల్స్‌ను ప్రజలకు మళ్లీ గుర్తు చేయాలని కేంద్ర మంత్రి సిబ్బందికి సూచించారు.
పేషెంట్లకు కార్డులు జారీ చేస్తున్నారా
పేషెంట్ల సంఖ్య అధికంగా ఉండటంతో, అవసరమైన చికిత్స, సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలని స్పష్టంచేశారు. దవాఖానలో ఆర్ఎంవో పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, కొత్త విభాగాలు కూడా ప్రారంభమవుతున్నాయని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద, ఆధార్ ఆధారంగా పేషెంట్లకు కార్డులు జారీ చేస్తున్నారని, ఆ కార్డు ద్వారా పేషెంట్లు గాంధీ ఆసుపత్రిలోనే కాకుండా ఇతర హాస్పిటల్స్ లోనూ చికిత్స పొందే అవకాశం కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. కొవిడ్ సమయంలో ప్రధాని ఆదేశాల మేరకు ఇక్కడ రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గాంధీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి, సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Israeli Iran War: తీవ్ర విషాదం.. దాడుల్లో 244 మంది మృత్యువాత.. ఇంత దారుణమా!
గతంలో సుద్దపూసలా మాట్లారు
అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ గతంలో సుద్దపూసలా మాట్లాడిందని ఎద్దేవాచేశారు. ఇప్పుడెందుకు దానిపై స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వయిరీకి ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ పై తాము కోర్టును ఆశ్రయించామని, న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని న్యాయస్థానం సీబీఐకి అప్పజెప్పేలా తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. కొంతమంది తమపై దుందుకుడు మాటలు మాట్లాడుతున్నారని, పదేళ్లు అధికారంలో ఉండి వారేం వెలగబెట్టారని ప్రశ్నించారు. బీజేపీపై ప్రతి అడ్డమైన వాళ్లు మాట్లాడటం సరికాదన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించాలని, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి సీఎం చొరవ తీసుకుని జలశక్తి మంత్రి ద్వారా ఏపీ సీఎంతో సమావేశమవ్వాలని కిషన్ రెడ్డి సూచించారు. కాళేశ్వరం అంశంపై బీజేపీ ఎప్పుడూ ఒక్క మాట మీదే ఉందని తెలిపారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ కోరామన్నారు. కానీ ఈ అంశంలో కాంగ్రెస్ స్టాండ్ మారిందని చురకలంటించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు
కాళేశ్వరం విషయంలో గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకోవాలని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రోజుకు 3 టీఎంసీల నీళ్లు తరలిపోతుంటే ఫాంహౌస్ లో నిద్రపోతున్నారని ఘాటుగా ఫైరయ్యారు. తెలంగాణ బాగు కోసం అన్ని పార్టీలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు ఉండబోవని, అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీకి దిగుతామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యతమిస్తామన్నారు. చేతకాక ఎన్నికలు వాయిదా వేయడం సరికాదని ఫైరయ్యారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి కొనియాడారు. 20027 మార్చి1 నాటికి జనగణన పూర్తవుతుందన్నారు. 30 లక్షల మంది సూపర్ వైజర్లు పని చేయనున్నారని, డిజిటల్ విధానంలో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. రాజకీయంగా రాజసింగ్‌కు చాలా అనుభవం ఉందన్నారు. ఆయన పార్టీ కోసం చాలా త్యాగాలు చేసిన వ్యక్తి అని కేంద్ర మంత్రి కొనియాడారు. తాము సాధారణ కార్యకర్తలమని, రాజాసింగ్ లాంటి వ్యక్తి మాట్లాడితే వింటామని చెప్పుకొచ్చారు.
Also Read: Rapido: యువతిపై రాపిడో డ్రైవర్ దాడి.. సీన్ కట్ చేస్తే…?