KTR: ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో జరిగిన అక్రమాల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు (సోమవారం) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆయనకు ఇది రెండో విచారణ. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీని ద్వారా హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలుస్తుందని, వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేశారు. అయితే, రెండోసారి రేస్ జరగకముందే స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చిన సంస్థ వైదొలిగింది. దీంతో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రేస్ నిర్వహణా సంస్థకు చెల్లింపులు జరిపింది.
Also Read: BJP Caste Politics: క్యాస్ట్ ఈక్వేషన్‌లో బీజేపీ వెనుకంజ.. నేతల కోసం పక్క పార్టీ వైపు చూపు
అయితే, ఈ చెల్లింపులు కేబినెట్ ఆమోదం లేకుండానే జరిగాయని, అంతేకాకుండా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఈ చెల్లింపులు జరగడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఏసీబీ విచారణకు ఆదేశించగా, అధికారులు కేటీఆర్‌తో పాటు కొందరు ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సినందున, నేడు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు.