Ahmadabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెను విషాదమని ప్రభుత్వం చెబుతున్నా, టాటా (TATA) గ్రూప్ నష్టపరిహారం ప్రకటించినా, బాధిత కుటుంబాల్లో ఇది ఎప్పటికీ తీరని శోకం. కుటుంబసభ్యులను, తెలిసినవాళ్లను కోల్పోయి అనేక కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. అసలు, ఘటనకు గల కారణాలేంటో ఇంతవరకు తెలియలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. అలా ఎందుకు జరిగింది? విమానంలో సాంకేతిక లోపాలున్నాయా? లేదా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) తర్వాత జరిగిన ఘటన కావడంతో ఉగ్ర కోణం ఉందా? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) కీలక విషయాలు వెల్లడించారు.
నాకు ఆ బాధ తెలుసు..
విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన కేంద్రమంత్రి, గడిచిన రెండు రోజులు భారంగా గడిచిందని అన్నారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు తెలుసని చెప్పారు. తన తండ్రి ఎర్రన్నాయుడు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఘటన జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకొని చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రమాదం స్థలాన్ని తాను కూడా పరిశీలించానని, గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని వివరించారు.
విచారణ కోసం కమిటీ
విమాన ప్రమాదాన్ని పౌర విమానయాన శాఖ చాలా సీరియస్‌గా తీసుకున్నదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మెడికల్, ఫోరెన్సిక్ టీమ్‌లతో పాటు ఐదుగురితో ఏఐబీ బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రెటరీ, గుజరాత్ అధికారులు, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్, స్పెషల్ డైరెక్టర్ ఐబీని నియమించినట్టు తెలిపారు. మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తారన్నారు.
Read Also- Manisha Krystina: 2 వేల మంది అప్రోచ్ అయితే.. 500 మంది కమిట్‌మెంట్ అడిగారు!
బ్లాక్ బాక్స్ చాలా కీలకం
దర్యాప్తు సంస్థలు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయని కేంద్రమంత్రి చెప్పారు. ఇప్పటికే డీవీఆర్, బ్లాక్ బాక్సులను స్వాధీనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బ్లాక్ బాక్సులో ఉన్న సమాచారం కీలకంగా మారనున్నదని, దాన్ని డీకోడ్ చేస్తే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, బ్లాక్ బాక్స్ వివరాల కోసం వేచి ఉన్నట్టు వివరించారు.
భద్రతా ప్రమాణాల పెంపు
అహ్మదాబాద్ ఘటన తర్వాత భద్రతా ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్‌కు చెందిన విమానాలను పరిశీలించాల్సిందిగా డీజీసీఏకు ఉత్తర్వులు ఇచ్చామని గుర్తు చేశారు. దేశంలో 34 బోయింగ్ విమానాలు ఉన్నాయని, వాటిలో 8 విమానాల తనిఖీ పూర్తయిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరుగకుండా భద్రతా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నామని, వీలైనంత త్వరగా గుజరాత్‌లోనే పూర్తవుతాయని చెప్పారు.
ప్రతిపక్షాల అతి అవసరమా?
ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని మరోసారి చెప్పిన కేంద్రమంత్రి, బాధ్యులైన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం తర్వాత విపక్షాలు తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. నిజానిజాలేంటో బయటకు వస్తాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Read Also- Diabetes Temple: మీకు షుగర్ ఉందా.. ఆ గుడికి వెళ్తే సరి.. ఇక రోజూ స్వీట్స్ తినొచ్చు!