Case on KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ కేసు ఫైల్ అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెున్న సుప్రీంకోర్టు నోటీసులు.. నిన్న ఏసీబీ నోటీసులు, ఇవాళ కేసు నమోదు కావడంతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
సీఎం రేవంత్ రెడ్డి పరువుకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmoori Venkat).. జూన్ 12న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సైతం ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. తాజాగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 352ల కింద ఎఫ్ఐఆర్ రాశారు.
ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే!
ఇటీవల కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన సందర్భంగా కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ (CM Revanth) రాజకీయ దురుద్దేశ్యంతో కేసీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ (KCR) వెంట్రుక కూడ పీకలేరని ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని.. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు. వంద జన్మలు ఎత్తినా కేసీఆర్ గొప్పతనం ఆయనకు అర్థం కాదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: Ahmedabad Flight Crash: విమాన ప్రమాదం.. తెరపైకి మరో విషాద గాధ.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఏసీబీ నోటీసులు..
బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు శుక్రవారం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్మూలా ఈ కారు రేస్ (Formula-E race case)కు సంబంధించిన కేసులో ఈ నోటీసులు అందజేశారు. సోమవారం రోజున ఉ.10 గం.లకు విచారణకు హాజరు కావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్మూలా ఈ కారు రేసులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏ1గా కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్ (Aravind Kumar), ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)లను చేర్చారు.