Allegations Of Officials Misusing( image credit: free pic)
తెలంగాణ

Allegations Of Officials Misusing: అద్దె వాహనాల పేరుతో బిల్లులు.. తిరగకున్నా తిరిగినట్లు రికార్డ్!

Allegations Of Officials Misusing: నెలనెలా లక్షల్లో జీతం అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాలను అద్దెగా చూపుతూ, అటు ప్రభుత్వ ఖజానాకు, ఇటు నిరుద్యోగుల ఉపాధికి కొందరు అధికారులు గండికొడుతున్నారనే ఆరోపణలువస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం ఒక్కో వాహనానికి లక్షల్లో ఖర్చుచేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో వాహనాలు అవసరం ఉన్న చోట అద్దె వాహనాలు వినియోగించుకోవాలని, నెలవారీ చెల్లింపులు చేస్తామని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ కొంతమంది అధికారులు సొంత వాహనాలనే అద్దె వాహనాల కింద చూపుతూ ప్రతి నెలా రూ.34 వేలు స్వాహా చేస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

బినామీ పేర్లతో, తెలుపు రంగు నంబర్ ప్లేట్‌తో
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న మండల స్థాయిలో ఎంపీడీఓల నుంచి జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహన సదుపాయం కల్పిస్తుంది. అయితే నూతన వాహనాల కొనుగోలు ఆర్థిక భారంను దృష్టిలో ఉంచుకొని అద్దె వాహనాలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆర్థికభారం తప్పడంతోపాటు అద్దె వాహనాలతో నిరుద్యోగులకు ఉపాధి చూపినట్టవుతుందని భావించింది. అందుకు వాహనాల అద్దె కింద ప్రతి నెలా రూ.34వేల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇదే అదునుగా భావించిన కొందరు అధికారులు బినామీ పేర్లతో, తెలుపు రంగు నెంబర్ ప్లేటు(నాన్‌ ట్యాక్సీ) ఉన్న కార్లను వినియోగిస్తున్నారు.

వ్యక్తిగత కారునే బినామీ పేరుతో అద్దెగా చూపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం ఇచ్చే అద్దెను నెలవారీ వాయిదాలకు చెల్లిస్తే కొద్ది కాలానికి వాహనం సొంతమవుతుందని వారి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే వాహనం ఉన్న వారికి అద్దె మొత్తం సొంత జేబులోకి వెళ్తున్నది. వ్యక్తిగత వాహనాన్ని అద్దెకు వినియోగిస్తే ఇంటి అవసరాలతోపాటు కార్యాలయ అవసరాలు తీరడంతోపాటు అదనంగా ఆదాయం వస్తున్నదని కొంతమంది అధికారులు భావిస్తున్నారు. దీంతో అద్దెకోసం బయటి వాహనాల జోలికి అధికారులు వెళ్లకుండా నమ్మిన వ్యక్తులను బినామిగా చూపి వారినే డ్రైవర్‌గా వినియోగించుకుంటున్నారు.

 Also Read: Seethakka: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత వాహనాల్లోనే గ్రామాల టూర్
ఇటీవల ఎంపీడీవోలు తమ సొంత వాహనాల్లోనే గ్రామాల టూర్లకు వెళ్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత వాహనాలు వాడొద్దని నిబంధనలు చెబుతున్నా, వాటిని పట్టించుకోవడం లేదు. కొన్ని కార్యాలయాలకు ప్రభుత్వ వాహనాలు ఉన్నప్పటికీ వినియోగించకుండా అద్దె వాహనాల పేరుతో నెలనెలా బిల్లులు తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 శాతం మంది ఎంపీడీవోలు తమ సొంత వాహనాలనే వినియోగిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 570 మంది ఎంపీడీవోలు ఉన్నారు. వారంతా మండల స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులతోపాటు పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

అందుకోసం వారికి ప్రభుత్వం అద్దె ప్రాతిపదికన వాహన సౌకర్యం కల్పిస్తున్నది. నెలకు 2,500 కిలో మీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఒకవేళ కిలో మీటర్లు తగ్గితే బిల్లు కూడా తగ్గించి ఇస్తుంది. అయితే, వాహనాల కిరాయి కోసం ఒక్కో ఎంపీడీవోకి ప్రభు త్వం ప్రతి నెలా రూ.34 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇందులోనే డ్రైవర్​ జీతం, డీజిల్​ ఖర్చులు భరించాలనే నిబంధన ఉంది. ఒక్కో ఎంపీడీవో ఏటా రూ.4.08 లక్షల వరకు బిల్లులు పెడుతున్నట్లు సమాచారం. గతంలో కొన్ని జిల్లాల్లో ఎంపీడీవోలు, ఇతర ప్రభుత్వ అధికారులు ఇలాంటి నకిలీ బిల్లుల ద్వారా రూ.లక్షలు కాజేయడంతో ఆడిట్ సందర్భంగా బిల్లుల్లోని అవకతవకలు బయటపడ్డాయి. 2020 లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వాహన బిల్లుల ఆరోపణలపై విచారణ జరిగింది. కొందరు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదనే ప్రచారం జరుగుతున్నది.

నెలనెల బిల్లులు రాకపోవడంతో
ప్రభుత్వం తక్కువగా అద్దె వాహనాలకు బిల్లులు చెల్లిస్తుందని పలువురు ఎంపీడీలు వాపోతున్నారు. నెలకు 34 వేలు మాత్రమే చెల్లిస్తుండటంతో అద్దె వాహనదారులు ముందుకు రావడం లేదని, పలుమార్లు విజ్ఞప్తులు చేశామని, అయినప్పటికీ చేసేదేమీ లేక విధిలేని పరిస్థితుల్లో సొంత వాహనాన్ని వాడుతున్నామని పలువురు వాపోతున్నారు. మరోవైపు ప్రతీ నెలనెల బిల్లులు రాకపోవడంతో కూడా అద్దె వాహనదారులు ఆసక్తి చూపడం లేదని తెలిపారు. 34వేలు మాత్రమే ప్రభుత్వం నెలనెల బిల్లు ఇస్తుందని, ఆ వాహనదారుడికి మాత్రం ఖర్చు 40వేలకు పైగా అవుతున్నట్లు సమాచారం. ప్రతి నెల 50వేలు చెల్లిస్తే అద్దె వాహనదారులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అధికారులు వాహన అద్దె పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 Also Read: Schools Reopen: నూత‌నోత్సాహంతో పాఠ‌శాల‌ల పున:ప్రారంభం!

పెండింగ్‌లో రూ.44.18 కోట్లు
అద్దె ప్రాతిపదికన ఎంపీడీవోలు వినియోగించే వాహన బిల్లులను సర్కారు విడుదల చేయడం లేదు. వారికి నెలవారీగా రూ.34 చొప్పున రావాల్సిన వాహన బిల్లులు గత 15 నెలలుగా రావడం లేదు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే బడ్జెట్‌ లేదని చెబుతున్నారని తెలంగాణ ఎంపీడీవోల అసోయేషన్‌ నేతలు పేర్కొంటున్నారు. కొన్ని శాఖల్లోని అధికారులకు రెండు నెలలకోసారి వాహన బిల్లులను చెల్లిస్తున్నా, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 మార్చి తర్వాత నుంచి ఇప్పటివరకు వాహన బిల్లులు క్లియర్‌ కాలేదు. ఇప్పటి వరకు రూ.44.18 కోట్లపైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో ఎంపీడీవోలు వాహన కిరాయి చెల్లించలేక తమ సొంత వాహనాలను వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. తమ సొంత డబ్బుతో వాహన కిరాయిలు చెల్లించే బదులు తమ వాహనాన్నే వినియోగిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వాహన బిల్లులు విడుదల చేయాలని తెలంగాణ ఎంపీడీవోల సంఘం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

బిల్లుల పెండింగ్ వాస్తవం
= పీఆర్​, ఆర్డీ శాఖల డైరెక్టర్​ సృజన
పంచాయతీరాజ్ శాఖలో అద్దె వాహనాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనేది వాస్తవం. అధికారుల నుంచి బిల్లుల పెండింగ్ లిస్టును తెప్పించాం. రాష్ట్ర ఆర్థికశాఖకు పంపించాం. త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం.

 Also Read: Ponguleti Srinivas Reddy: వర్షాకాలానికి ముందస్తు ప్రణాళికలు.. మంత్రి కీలక అదేశాలు!

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?