Minister Sridhar Babu: పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే రావొద్దు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు కలిసి రండి అని మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామిక వేత్తలను కోరారు. హైదరాబాద్ లో ఓ హోటల్లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్(ఐబీసీ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ – 2025’ను ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంక్షేమం, అభివృద్ధిలో రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆయా దేశాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఆనతి కాలంలోనే తెలంగాణ అన్ స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగిందన్నారు.
దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ
రాష్ట్ర జీడీపీ ₹16.12 లక్షల కోట్లకు చేరిందన్నారు. 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు (9.9%)ను దాటేసిందని, తలసరి ఆదాయం ₹3.79 లక్షలు అన్నారు. ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ అన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సేకరించగలిగామని, గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్లో రూ. 40వేల కోట్ల పెట్టుబడులను సాధించామని, 2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం అని, దేశంలో ఇది 55 శాతంగా ఉందని, ఇవి అంకెలు కాదు తెలంగాణ పురోగతికి నిదర్శనాలు అని పేర్కొన్నారు. ప్రతి భాగస్వామ్యం ఒక లావాదేవీ కాదు అది ఒక మార్పు అన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణ పురోగతిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
Also Read: GHMC Commissioner: టౌన్ ప్లానింగ్‌పై.. ఫిర్యాదుల వెల్లువ!
తెలంగాణ ట్రెండ్ సృష్టిస్తుంది
ఆగ్రో ఇన్నోవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, డిజిటల్ ఫార్మింగ్, ఫ్యూచర్ – రెడీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ మానుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ తదితర అంశాల్లో ప్రపంచ దేశాలతో పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. మిగిలిన రాష్ట్రాలు ట్రెండ్‌ను అనుసరిస్తే తెలంగాణ దాన్ని సృష్టిస్తుందన్నారు. ‘బ్రెజిల్, జర్మనీ, రష్యా, కామెరూన్, మాల్టా, యూకే, బల్గరేయా, బెల్జియం, యూఏఈ, దుబాయి తదితర 25 దేశాల ప్రతినిధులు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామం అని, ఇది ఒక సదస్సుగా మిగిలిపోకుండా వివిధ దేశాల మధ్య సంస్కృతి, వ్యూహాలు, టెక్నాలజీ బదలాయింపునకు వారధిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిప్లోమేటిక్ రిలేషన్స్(ఐవోడీఆర్) మాల్టా గవర్నర్ లిల్లో మర్రా, కార్యదర్శి మార్సెల్లో పట్టి, బెల్జియం ఎంపీ ఇవాన్ పెట్రోవ్, జర్మనీ డిప్లోమాట్ డానియల్ జెర్బిన్, అర్జెంటీనా ఎంపీ క్లాడియో సింగోలనీ, ఐబీసీ ఛైర్మన్ సాల్మన్ గట్టు, డైరెక్టర్ గ్లోరియా సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ahmedabad plane crash: ఘోర విమాన ప్రమాదం.. బతికి బయట పడిన చిరంజీవి, సుస్మిత.. నాగబాబు సంచలన పోస్ట్