Election Commission: తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను క్రాస్ చేశాయి. దీంతో ఉదయం నుంచే ప్రజలు గడప బయట అడుగు పెట్టడానికి జంకుతున్నారు. ఇదిలా ఉండగా.. సరిగ్గా మే నెల మధ్యలో ఇక్కడ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎండలకు భయపడి ఓటర్లు పోలింగ్ కేంద్రాలు ఎలా వస్తారా? అనే అనుమానాలు ఒకవైపు ఉన్నాయి. పోలింగ్ శాతం తగ్గిపోతుందా? అనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సమయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశాయి. ఇందుకు ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది.
తెలంగాణలో మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సమయాన్ని పొడిగించింది. తెలంగాణలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని తాజాగా ఈసీ ప్రకటించింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే. కానీ, రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత పోలింగ్ సమయం సాయంత్రం పూట ఒక గంట పెంచింది. ఈ గడువు ముగిసే సమయానికి ఓటు వేయడానికి వచ్చి క్యూలో నిలబడిన వారందరికీ తమ ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని ఈసీ కల్పిస్తుంది.
Also Read: భయం.. నా హిస్టరీలోనే లేదు!
ఇది పోలింగ్ శాతం పెరగడానికి ఉపయోగపడుతుందని చర్చిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. తెలంగాణలో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశ పోలింగ్ మే 13వ తేదీన జరుగనుంది. అన్ని దశల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే దశలో ఏపీలో లోక్ సభ ఎన్నికల స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి.