– రిజర్వేషన్ల రద్దుకై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర
– గుట్టంతా బయటపెట్టిన తెలంగాణ సీఎం
– గతంలో బీజేపీ నేతల మాటల్ని గుర్తు చేసిన రేవంత్
– కేసులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోనని వార్నింగ్
– ఢిల్లీ సుల్తానులకు తలొగ్గేదే లేదని స్పష్టం
– రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్‌కు..
– వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి
Reservations: దేశమంతా ప్రచార పర్వం కొనసాగుతోంది. మూడోసారి గెలుపు కోసం బీజేపీ, అధికారం కోసం ఇండియా కూటమి వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ పోలీసుల నుంచి రేవంత్ రెడ్డికి నోటీసులు అందడం హాట్ టాపిక్‌గా మారింది. నోటీసులు వేరే కేసుకు సంబంధించే వచ్చినా కూడా దాని వెనుక రిజర్వేషన్ల అంశంపై వినిపిస్తున్న గొంతును నొక్కడమేననే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విరుచుకుపడ్డారు.
ఢిల్లీ సుల్తానులకు తలొగ్గం!
రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని తెలిపారు సీఎం. దానిని అమలు చేయడమే బీజేపీ అజెండాగా చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ వేసుకున్న ప్రణాళికలను తాను ప్రస్తావించానని, ఆధారాలతో చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించినట్లు తనపై ఢిల్లీ పోలీసులను ఉసిగొల్పారని ఆరోపించారు రేవంత్. దీనిద్వారా తెలంగాణ సమాజాన్ని భయపెట్టాలని చూస్తున్నట్టుగా ఉందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా లొంగిపోతానని ఢిల్లీ సుల్తానులు భావిస్తున్నారని మండిపడ్డారు.
Also Read: కేసీఆర్‌కు వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి
ఆర్ఎస్ఎస్ విధానాల అమలే బీజేపీ లక్ష్యమా?
రిజర్వేషన్లు కాపాడటానికి, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టడానికే తన హోదాను ఉపయోగిస్తానని అన్నారు సీఎం. ఫిబ్రవరి 22, 2000లో బీజేపీ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, రాజ్యాంగాన్ని మార్చడానికి 10 మంది సభ్యులతో కూడిన జస్టిస్ వెంకటాచలమయ్య కమిషన్ వేశారని చెప్పారు. 2002లో ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందని, 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం తప్పిందన్నారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన గోల్వాకర్, ఎన్జీ వైద్య కూడా రిజర్వేషన్లు ఉండకూడదని పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుని, బీసీ జనగణన చేపట్టాలని రాహుల్ గాంధీ భావించినట్టు చెప్పారు.
సీఎంపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏంటి?
రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్రతోనే బీజేపీ 400 సీట్లు కావాలని కోరుతోందన్నారు రేవంత్ రెడ్డి. 8 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చి ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని ఆరోపించారు. బీజేపీ ఒక ప్రణాళికాబద్దంగా రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తోందని వివరించారు. ఈ విషయాన్ని తాను ప్రస్తావించాననే కక్షగట్టి కేసు పెట్టారని తెలిపారు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యున్ని చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసింది హోంశాఖే అని, కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల పెట్టి ఆగమేఘాల మీద దేశ భద్రతకు ముప్పు వచ్చినట్లు ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ ఝలక్.. కేటీఆర్ రియాక్షన్
మోదీ, అమిత్ షా ఏం చెప్తారు?
ఎడిటెడ్ వీడియోకు సంబంధించిన కేసుతో సంబంధం లేదని తమ మహిళా అడ్వకేట్ పోలీస్ స్టేషన్‌కు వెళితే దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు తెలంగాణ సీఎం. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు కాబట్టే ఢిల్లీ పోలీసులను ఎంచుకున్నారని, తనపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ప్రచారం చెయ్యకుండా చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చడానికే తాము వచ్చామని 2017లో కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే స్టేట్మెంట్ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిజర్వేషన్లు అభివృద్ధిని తీసుకొస్తాయా అంటూ 2014-2019 మధ్య లోక్ సభ స్పీకర్‌గా ఉన్న సుమిత్రా మహాజన్ మాట్లాడారని తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలందరూ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఒక అజెండాతో ముందుకెళుతున్నారన్నారు. దీనిపై మోదీ, అమిత్ షా దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
దేశ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి
బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజరవేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని దేశ ప్రజలను హెచ్చరించారు రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు పెరగాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. రాజ్యాంగం మారాలంటే ఎన్డీఏ, రాజ్యాంగం మార్చకూడదు అనుకుంటే ఇండియా కూటమికి ఓటు వేయాలన్నారు. ఎటువైపు నిలబడాలో దేశంలోని దళిత, గిరిజన, ఓబీసీ, మైనార్టీలు నిర్ణయించుకోవాలని సూచించారు. మోదీ, అమిత్ షాలకు ఒకటే చెబుతున్నా, పోలీసులతో నన్ను బేదిరించాలనుకుంటే అది జరగని పని. అలా చేయాలనుకుంటే ఏం జరుగుతుందో మీ చీకటి మిత్రుడిని అడిగి తెలుసుకోండి. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.