Sanjay Kapur: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త (Karishma Kapoor ex-husband), పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ (53) మృతి చెందారు. ఇంగ్లాండ్‌లో గురువారం పోలో మ్యాచ్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా తెలుస్తున్నా.. అంతకంటే ముందు ఆయన పోలో ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక తేనెటీగ ఆయన నోట్లోకి వెళ్లిందని, దాని వల్లే ఆయనకు ఊపిరాడక, గుండెపోటుకు దారితీసిందనేలా ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైనట్లుగా సమాచారం. వెంటనే ఆడుతున్న పోలో ఆటను నిలిపివేసి, వైద్య సహాయం అందించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. దీంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ దురదృష్టకర సంఘటన ఇంగ్లాండ్‌లోని గార్డ్స్ పోలో క్లబ్‌లో చోటుచేసుకుంది. సంజయ్ కపూర్ మరణవార్త వ్యాపార, సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆటోమోటివ్ రంగంలో కీలకమైన వ్యక్తి
సంజయ్ కపూర్ భారత ఆటోమోటివ్ రంగంలో చాలా కీలకమైన వ్యక్తి. సోనా కామ్‌స్టార్ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ, ఆ కంపెనీని ఆటోమోటివ్ విడి భాగాల తయారీలో ప్రపంచస్థాయి గుర్తింపుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన చేసిన అభివృద్ధికి ప్రశంసలు దక్కాయి. వ్యాపార రంగంతో పాటు ఆయనకు పోలో క్రీడ అంటే అమితాసక్తి ఉంది. అందుకే దేశీయ, అంతర్జాతీయ పోలో టోర్నమెంట్‌లలో ఆయన ఎప్పుడూ కనిపించేవారు. అంతేకాదు, ఆరియస్ పేరుతో సొంతంగా ఆయన పోలో జట్టును కూడా నడిపారు.
Also Read- Priya Naidu: పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నొక్కుతాడు
పిల్లల విషయంలో ముందు చూపు
కరిష్మా, సంజయ్ 2014లో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పిల్లల విషయంలో ముందు చూపుతో వ్యవహరించారు. కరిష్మా, సంజయ్‌లకు ఇద్దరు పిల్లలు. సమైరా, కియాన్. సంజయ్ 2003లో కరిష్మాను వివాహం చేసుకున్నారు. ఈ జంట 2005లో కుమార్తె సమైరాకు, 2011లో కుమారుడు కియాన్‌కు జన్మనిచ్చారు. 2014లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకోగా, 2016లో వారికి విడాకులు మంజూరయ్యాయి. విడాకుల విచారణలో పిల్లల సంరక్షణను కోర్టు కరిష్మాకు అప్పగిస్తూ.. సంజయ్‌కు ఎప్పుడంటే అప్పుడు వారిని చూసే హక్కును కల్పించింది. వారిద్దరూ విడిపోయిన తర్వాత, సంజయ్ ప్రియా సచ్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. కరిష్మాతో విడిపోయినప్పటికీ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వారి పేరిట రూ. 14 కోట్ల బాండ్లను కొనుగోలు చేశారు. ఈ రూ. 14 కోట్లకు వచ్చే వడ్డీ రూ. 10 లక్షలు వారి ఖర్చులకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆస్తి కేటాయింపులో సంజయ్ తన తండ్రికి చెందిన ఇంటిలో కూడా భాగం కల్పించారు. విడాకుల తర్వాత కూడా కరిష్మా, సంజయ్‌లు గౌరవప్రదమైన సంబంధాన్ని కొనసాగించారు.
Also Read- Ahmedabad plane crash: ఘోర విమాన ప్రమాదం.. బతికి బయట పడిన చిరంజీవి, సుస్మిత.. నాగబాబు సంచలన పోస్ట్
సమైరా 18వ పుట్టినరోజున చేసిన ట్వీట్ వైరల్
కుమార్తె 18వ పుట్టినరోజును పురస్కరించుకుని మూడవ భార్య ప్రియా సచ్‌దేవ్‌తో కలిసి, సమైరా (సంజయ్ మరియు కరిష్మా కుమార్తె) పుట్టినరోజుకు హాజరై, తన ఎక్స్ హ్యాండిల్‌లో ఫొటోలను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో.. ‘‘ఒక తండ్రి తన కూతురి చేయి పట్టుకునేది కొద్దిసేపే అయినా, ఆమె హృదయంలో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాడు. నా తొలి ప్రేమ సమైరాకు 18వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె యుక్తవయస్సుకు స్వాగతం. ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో గడపండి. మేమందరం మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఎక్స్ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. కాగా, ఆయన భార్య ప్రియా సచ్‌దేవ్‌కు అంతకు ముందు జరిగిన వివాహం ద్వారా ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా, ఆ తర్వాత ఈ జంటకు అజారియస్ అనే కుమారుడు జన్మించాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు