AirIndia Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంలో (Plane Crash) భారీగా ప్రాణనష్టం జరిగింది. అయితే, విమానాల భద్రతకు సంబంధించి పటిష్టమైన నిబంధనలు, పకడ్బందీ ప్రొటోకాల్ ఉన్నప్పటికీ ఇంతటి భారీ ప్రమాదాలు వరుసగా జరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ‘ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ171’ విమానం కుప్పకూలిన నేపథ్యంలో, బోయింగ్ 787 డ్రీమ్‌లైన్ ప్రమాదానికి అసలు కారణం ఏంటి?, ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను ఎంతవరకు నమ్మవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 242 మందితో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా విఫలమవవ్వడానికి కారణం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ఇంజన్లు ఫెయిలైతే ముందే తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. విమానం 825 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలోనే ఎమర్జెన్సీ కాల్ (మేడే కాల్) చేశారంటే బోయింగ్ 787 లైనర్ విమానంలో ఇంకా సరిచేయని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అర్థమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
చాలా కాలంగా ఆందోళనలు
బోయింగ్ 787 స్టార్ లైనర్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై చాలా కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విమానాల తయారీ లోపాలను విమానయానరంగ నిపుణులు, సంబంధిత వ్యక్తులు గుర్తించారు. ఈ లోపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ దశాబ్ద కాలంగా ఆందోళన కూడా వెలిబుచ్చుతున్నారు. దీంతో, అహ్మదాబాద్ దుర్ఘటన నేపథ్యంలో డ్రీమ్‌లైనర్ ప్రమాదం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Read this- Air India Plane Crash: విమానం దూసుకెళ్లిన హాస్టల్‌లో బీభత్సం.. భారీగా మృతులు
825 అడుగుల వద్ద మేడే కాల్
లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI171 సరైన ఎత్తుకు చేరుకోలేదని తెలుస్తోంది. విమానం గాలిలో కేవలం 825 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే పైలట్లు మేడే కాల్ చేశారు. ఆ తర్వాత అది కుప్పకూలింది. దీనిపై విమానయాన రంగ నిపుణుడు సంజయ్ లాజర్ మాట్లాడుతూ, అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన విమానంలో విద్యుత్ పోయి ఉండొచ్చని కోల్పోయి అని అనుమానం వ్యక్తం చేశారు. పక్షి ఢీకొనడం లేదా ఇంజిన్ నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని ఆయన విశ్లేషించారు.
డ్రీమ్‌లైనర్ భద్రతపై మళ్లీ చర్చ
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. ఎన్నో సందేహాలను కూడా లేవనెత్తింది. నిజానికి స్టార్‌లైనర్‌కు ఇంధన సామర్థ్యం అధికం. డిజైన్ కూడా అత్యాధునికంగా ఉంటుంది. తయారీలో ఉపయోగించే మిశ్రమ మెటీరియల్ కూడా విమానయానంలో కొత్త ఆలోచనలకు నాంది పలికాయి. అయితే, గత పదేళ్ల హిస్టరీని పరిశీలిస్తే, ఈ మోడల్ విమానాల్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. బ్యాటరీలు కాలిపోవడం, సాఫ్ట్‌వేర్ సమస్యలతో పాటు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలపై పలువురు నిపుణులు ఇప్పటికే హెచ్చరించినప్పటికీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.
Read this- Mahabubabad Mandal Schools: ఆ పాఠశాలకు ఎందుకంత దుర్గతి.. పట్టించుకోని అధికారులు
1000 విమానాలకు ముప్పు
ఏకంగా 1,000 కంటే ఎక్కువ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు ప్రమాదాల ముప్పు పొంచివుందని సామ్ సలేహ్‌పూర్ అనే బోయింగ్ ఇంజనీర్ 2024లో బహిరంగంగా అలర్ట్ చేశారు. విమానాల తయారీకి సత్వర మార్గాలను ఎంచుకున్నారని అన్నారు. దీంతో, ఫ్యూజ్‌లేజ్ ముక్కల మధ్య ఖాళీలు, కీలకమైన జాయింట్ల వద్ద శిథిలాల రూపంలో ప్రమాదాలు పొంచివున్నాయన్నారు. ఇంజనీర్ సామ్ హెచ్చరించినప్పుడు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. బోయింగ్ కంపెనీని సంప్రదించగా, ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పింది. విమానాలను మళ్లీ తనిఖీ చేస్తామని కూడా హామీ ఇచ్చింది.
డీజీసీఏ, బోయింగ్ దర్యాప్తు షురూ
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పూర్తి స్థాయి విచారణను మొదలుపెట్టింది. దర్యాప్తునకు అవసరమైన విమాన డేటా, వాయిస్ రికార్డింగ్‌లు, సాక్షుల ప్రతిస్పందనలను సేకరిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు చెప్పారు. విమానానికి సంబంధించిన టెక్నికల్ డేటా, విమానం నిర్వహణ ట్రాక్ రికార్డును కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తామని విమానాల తయారీ సంస్థ బోయింగ్ కూడా తెలిపింది. ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించిన తర్వాత వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.