Honeymoon Murder Case: దేశంలో సంచలనంగా మారిన హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. భర్తన రాజా రఘువంశీని భార్య సోనమ్ హత్య చేయించిన కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రియుడితో కలిసి సోనమ్ తన భర్తను హత్య చేయించినట్లు ఇప్పటివరకూ అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే సుపారీ గ్యాంగ్ కు ఆమె చేసిన పేమెంట్స్ చూస్తే కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. సోనమ్ కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్యలో ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
తెరపైకి సోనమ్ కజిన్ పేరు!
భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ కొంతమంది కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 23న వారికి జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. అయితే ఈ జితేంద్ర అనే వ్యక్తి సోనమ్ కు కజిన్ అవుతారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో రాజా రఘువంశీ హత్యలో సోనమ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందన్న అనుమానాలు సైతం ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. సోనమ్ తండ్రికి సంబంధించిన బిజినెస్ లో జితేంద్ర జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. హవాలా రూపంలో జితేంద్ర బ్యాంక్ ఖాతా నుంచి సోనమ్ చెల్లింపులు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సోనమ్ బ్రదర్ రియాక్షన్
జితేంద్ర రఘువంశీకి సంబంధించి పలు ఆరోపణలు వస్తుండటంతో సోనమ్ సోదరుడు గోవింద్ స్పందించారు. జితేంద్ర రఘువంశీ తమకు బంధువేనని తేల్చారు. హవాలాతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తమ గోదాములో లోడింగ్, అన్ లోడింగ్ పనులన్నీ అతడే చూసుకుంటాడని ఆయన పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలోని డబ్బు తమదేనని చెప్పారు. వ్యాపారంలో రోజువారీ ఖర్చులను అతడి ఖాతా నుంచి చెల్లిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు సోనమ్ యూపీఐ ఖాతాను సైతం జితేంద్ర పేరుతోనే తెరిచినట్లు గోవింద్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: Maharashtra Crime: పెళ్లై 3 వారాలే.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఇలా ఉన్నారేంటమ్మ!
నా సోదరే హత్య చేసింది: గోవింద్
ఇదిలా ఉంటే సోనమ్ సోదరుడు గోవింద్.. మృతుడు రాజా రఘువంశీ కుటుంబాన్ని పరామర్శించారు. తన చెల్లెలు సోనమ్ ఆమె భర్తను హత్య చేయించినట్లు తాను వందశాతం నమ్ముతున్నట్లు చెప్పారు. గాజీపూర్ లో సోనమ్ తో తాను మాట్లాడానని.. ఆమె మాట తీరును బట్టి తనే నేరం చేసినట్లు అర్థమైందని చెప్పారు. అందుకే ఆమెతో ఉన్న సంబంధాలన్నీ తమ కుటుంబం తెంచుకుందని స్పష్టం చేశారు. అంతేకాదు నేరం రుజువైతే తన చెల్లెలిని ఉరితీయాలని గోవింద్ కోరారు. బావ రాజా రఘువంశీ కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.