Actress Kalpika: టాలీవుడ్ నటి కల్పిక గణేష్.. ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పుట్టిన రోజు సందర్భంగా ఓ పబ్ కు వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందితో గొడవపెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా కల్పికకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ (Gachibowli Police station)లో కేసు నమోదైంది.
అసలేం జరిగిందంటే?
మే 29వ తేదీన నటి కల్పిక.. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజమ్ పబ్ (Prism Pub)కు వెళ్లారు. అక్కడ తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే కేకు విషయంలో కల్పికకు, పబ్ సిబ్బందికి మధ్య గొడవ తలెత్తింది. అది చినికి చినికి గాలి వానలా మారింది. దీంతో పబ్ సిబ్బందిపై కల్పిక బూతులతో రెచ్చిపోయారు. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ క్లబ్ సిబ్బంది దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తనపై దాడి జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోషల్ మీడియా వేదికగా కల్పిక ఫైర్ అయ్యారు.
పబ్ నిర్వహాకులు ఫిర్యాదుతో
కల్పిక ఘటనకు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో గచ్చిబౌలి పోలీసులు రంగంలోకి దిగారు. దానికి తోడు పబ్ సిబ్బంది సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతు పురాణాలు తిట్టడం వంటివి ఆమె చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే కల్పిక హంగామా సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కోర్టు అనుమతి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. తాజాగా ఆమెపై కేసు నమోదు చేశారు. 324(4), 352, 351(2) బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశముంది.
Also Read: Karnataka Crime: తెరపైకి మరో కిల్లర్ భార్య.. భర్త, పిల్లలు తినే ఫుడ్‌లో విష మాత్రలు.. చివరికీ!
కల్పిక ఫిల్మ్ కెరీర్
కల్పిక గణేష్ విషయానికి వస్తే ఆమె 2009లో మోడలింగ్ లోకి అడుగు పెట్టారు. అదే సంవత్సరం చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘ప్రయాణం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2013లో విడుదల అయిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఆమె పలు చిత్రాలు చేశారు. చివరగా అధర్వ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.