Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రెండోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈసారి కూడా ఆయన ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదని తెలిసింది. పైగా విచారణాధికారులకే ఎదురు ప్రశ్నలు వేసినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును అతి కష్టం మీద వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే.
ఆయన నోరు విప్పితే దీంట్లోని సూత్రధారులు ఎవరన్నది బయట పడుతుందని అందరూ భావించారు. అయితే, ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు ఏమాత్రం సహకరించటం లేదని తెలిసింది. బుధవారం రెండోసారి విచారణలో సైతం తాను ఎవరి ఫోన్లు ట్యాప్ చెయ్యలేదని ప్రభాకర్ రావు చెప్పినట్టు సమాచారం. ఎస్ఐబీకి తాను చీఫ్‌గా ఉన్నా తనకు పై అధికారులు ఉన్నారని ప్రభాకర్ రావు చెప్పినట్టు తెలిసింది. తాను చేసిన ప్రతీ పని గురించి వారికి పూర్తిగా తెలుసని చెప్పినట్లు సమాచారం.
Also Read: New Ministers Portfolios: కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
మొదటి రోజు విచారణలో చెప్పినట్టుగానే ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీ ఉంటుందని, దాంట్లో తాను సభ్యుడిని కాదని చెప్పినట్టు తెలిసింది. ఇక, ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన సంగతి కూడా తనకు తెలియదన్నట్టు సమాచారం. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ఎదుట పెట్టి ప్రశ్నించినా ప్రభాకర్ రావు వాళ్లు ఏం చెప్పారో? ఎందుకు చెప్పారో? నన్ను అడిగితే ఎలా? అని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాడిన సెల్ ఫోన్లను కూడా దర్యాప్తు అధికారులకు అప్పగించలేదని సమాచారం.
సుప్రీం కోర్టుకు…
విచారణకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించక పోతుండటంతో అదే విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలియ చెయ్యాలని దర్యాప్తు అధికారులు నిర్ణయం చేసినట్టు తెలిసింది. సుప్రీం కోర్టు కల్పించిన మధ్యంతర రక్షణ తొలగితే అరెస్ట్ చేసి ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. అప్పుడే ప్రభాకర్ రావు నోరు తెరుస్తాడని అనుకుంటున్నారు.
Also Read: Government Plans: పథకాల ప్రచారంపై.. సర్కార్ ఫోకస్!