Government Plans: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని భావిస్తున్నది. ఆ బాధ్యతను రాష్ట్ర సంస్కృతి శాఖకు అప్పగించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కళాకారులను బృందాలుగా ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నది. త్వరలోనే కళాకారులతో వర్క్‌షాప్ నిర్వహించి ఏయే పథకాలకు పాటలు రాయాలని సూచించనున్నట్లు సమాచారం. సంస్కృతిక సారధిని సైతం ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు, మహిళా సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకోసం ఒక వైపు ప్రభుత్వ, మరోవైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నది.
రైతు భరోసా, రుణమాఫీ, భూ భారతి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, బాలికలకు పోషకాహారం అందించేందుకు ఇందిరమ్మ అమృతం, వృద్ధుల సంక్షేమం 37 డేకేర్ సెంటర్ల ఏర్పాటు, ట్రాన్స్‌జెండర్ మైనారిటీల సంక్షేమం 33 జిల్లాల్లో మైత్రి హెల్త్‌కేర్ క్లినిక్‌లు, ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇలా పలు పథకాలను ప్రవేశపెట్టింది.
అయితే, చేసిన పనులను చెప్పుకోవడంలో వెనుకబడుతున్నామని, ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో పథకాలకు ప్రచారం జరగడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటిపై ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నది. అందుకు తెలంగాణ సాంస్కృతిక సారథిని వినియోగించుకోవాలని భావిస్తున్నది. ఇందులో ప్రస్తుతం 550 మంది కళాకారులు పనిచేస్తున్నారు. వీరితో బృందాలుగా ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: New Ministers Portfolios: కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఒక్కో పథకంపై రచనలు
ప్రభుత్వం ప్రవేశపెట్టే ఒక్కో పథకంపై ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నది. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు, కళాకారులకు ఒక్కో పథకంపై పాటలు రాయాలని టాస్క్ ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకోసం త్వరలోనే వర్క్ షాపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిపుణుల బృందం సైతం ఏర్పాటు చేసి అధ్యాయనం చేయించనున్నారు. ఎంపిక చేసిన పాటలను గ్రామ గ్రామంలో ప్రచారం చేయనున్నారు.
అదే విధంగా విద్యా కరికులంలో నాటకం, సంగీతం, నృత్యం వంటి వాటిని చేర్చడం, జానపద, గిరిజన కళా రూపాలను భవిష్యత్ తరాలకు అందిచేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఆడియో విజువల్స్‌ను రూపొందించి, గతంలో మాదిరిగా థియేటర్లలో న్యూస్ రీల్స్ ప్రదర్శించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. చెడు వ్యసనాల బారి నుంచి యువతను కాపాడేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ద్వారా సందేశాలు ఇప్పించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం.
కళా రంగాల వారీగా డివిజన్
సాంస్కృతిక సారధిలోని సభ్యులను కళారంగాల వారీగా డివిజన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒగ్గుడోలు, థియేటర్, ఫోక్, కళాకారులు ఆటపాటలు, వీధి నాటకాలు ద్వారా ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై చైతన్యం కలిగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అవసరమైతే ప్రచారానికి రూ.10 కోట్లు కేటాయిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే ప్రకటించారు.
ఈ నెల 9న బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రభుత్వ పథకాలు- సమాజాభివృద్ధి, సాంస్కృతిక అంశాలపై సదస్సులో కవులు కళాకారుల అభిప్రాయాలను తీసుకున్నారు. సదస్సులో చర్చించిన అంశాలపై కమిటీ వేసి కార్యచరణ రూపోందించే బాధ్యతను ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాంకు అప్పగించడం పాటు సమన్వయ కర్తగా వ్యవహరించాలని మంత్రి కోరారు. యూట్యూబ్‌లలో సైతం ప్రభుత్వ పథకాలపై పాటలు రాసి ప్రచారం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
సారథిలో కొత్త సభ్యులకు అవకాశం?
సారథిలో ప్రస్తుతం 550 మంది ఉన్నారు. మరికొంత మందికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత ప్రభుత్వంలో ఏక పక్షంగా సారథిలో సభ్యులుగా చేర్చారని, అర్హులైన వారికి అన్యాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వానికి 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అందులో అర్హులకు చోటు కల్పించి వారిని సైతం ప్రభుత్వ పథకాల ప్రచారానికి వినియోగించుకోవాలని, సాంస్కృతిక సారథిని సైతం ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Also Read: Kaleshwaram Commission: 115వ సాక్షిగా కమిషన్.. ఒన్ టు వన్ విచారణ!