Tummala Nageswara Rao: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు సీడ్ యాక్ట్ ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వచ్చే నెలలో మిర్చి విత్తన కంపెనీలు, నర్సరీల నిర్వహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సెక్రటరీ రఘునందన్‌కు సూచించారు. సచివాలయంలో మార్క్ ఫెడ్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, ఎరువుల కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కంపెనీలు తమకు ఇచ్చిన లక్ష్యానికన్నా తక్కువగా సరఫరా చేసిన ఎరువులను, జూన్ నెలకు కావల్సిన ఎరువులను కలిపి జులైలోగా సరఫరా చేయాలని ఆ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు.
కంపెనీలపై కఠిన చర్యలు
ఏప్రిల్‌లో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను 1.22 లక్షల మెట్రిక్ టన్నులు, మే నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 0.87 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడంపై కంపెనీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌లో కేటాయించిన 1.70 లక్షల మెట్రిక్ టన్నులతో పాటు ఇప్పటివరకు తక్కువగా సరఫరా చేసిన 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను జూలై నెలలోగా సరఫరా చేయాలన్నారు. ఒకవేళ కేటాయించిన ఎరువులను సరఫరా చేయని పక్షంలో ఆ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతుల అవసరాలకు తగ్గట్టు ఎరువులు
జిల్లా వారిగా కేటాయించిన ఎరువులను, ఆ జిల్లాలలోనే పంపిణీ చేసేలా కంపెనీలు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మండలాలలో రైతుల అవసరాలకు తగ్గట్టు ఎరువుల ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ డైరెక్టర్, మార్క్ ఫెడ్ ఎండీని ఆదేశించారు. రోజువారి కొనుగోళ్లను కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ఒకవేళ డీలర్లు ఈపీఓఎస్ ద్వారా అమ్మకాలు జరపకపోతే, ఆయా మండలాలలో ఉన్న నిల్వలు తెల్సుకొనే అవకాశం ఉండదన్నారు. అలాంటి డీలర్లు, వారికి ఎరువులు సరఫరా చేసే కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ని ఆదేశించారు.
Also Read: Bonalu Festival: సంస్కృతి సంప్రదాయాలకు.. అద్దం పట్టేలా బోనాలు!
విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష
విత్తన కంపెనీ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. జిల్లాల వారీగా అన్ని రకాల విత్తనాల లభ్యత, కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరిలో సన్న రకాల విత్తనాలు, సివిల్ సప్లై కొనుగోలుకు అనువుగా ఉన్న రకాల లభ్యతపై దృష్టి సారించాలని డైరెక్టర్ గోపికి సూచించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి మాట్లాడుతూ మంత్రి తుమ్మల ఆదేశాలతో అన్ని రకాల విత్తనాలను ముందస్తుగానే సిద్ధం చేసుకున్నామన్నారు.
కల్తీ విత్తనాలు సీజ్
కల్తీ విత్తనాల విషయంలో మంత్రి ఆదేశాల మేరకు పోలీసు శాఖతో టాస్క్ పోర్స్‌లను ఏర్పాటు చేశామని, ఇప్పటికే 13 జిల్లాలలో 46 కేసులు పెట్టి 111 మందిని అరెస్ట్ చేశామన్నారు. 323.2 క్వింటాళ్ల కల్తీ విత్తనాలను సీజ్ చేయడం చేశామని తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ కల్తీ విత్తనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలన్నారు. సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీలను కూడా సీడ్ చట్టం పరిధిలోకి తెచ్చి, విత్తనోత్పత్తి రైతులు నష్టపోయిన సందర్భాలలో ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: KCR Ghosh Panel Interrogation: విచారణలో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్ అభ్యర్థన.. కమిషన్ కీలక నిర్ణయం!