L and T
సూపర్ ఎక్స్‌క్లూజివ్

L & T: ఎల్ అండ్ టీ ఫైల్స్.. మొన్న మేడిగడ్డ.. నిన్న మెట్రో.. నేడు వరంగల్ ఆస్పత్రి

  • ఎందులో చూసినా నిబంధనలకు విరుద్ధమే!
  • అంచనాలు పెంచుకుని జేబులు నింపుకోవడమే!
  • ఇష్టారాజ్యంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
  • ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే అంచనా వ్యయం పెంపు
  • రూ.600 కోట్ల దాకా స్కాం జరిగినట్టు ఆరోపణలు
  • విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశం
  • ఆస్పత్రి పరిశీలించి అసహనం వ్యక్తం చేసిన సీఎస్
  • ఏడాదిన్నర కాలంలోనే పనులు పూర్తి చేస్తామన్న కేసీఆర్
  • మూడేళ్లవుతున్నా పూర్తికాని ఆస్పత్రి పనులు
  • రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభం
  • అదనంగా రూ.450 కోట్లు పెంచిన నాటి ప్రభుత్వం
  • ఎల్ అండ్ టీ సంస్థకు లబ్ధి చేకూర్చే కుట్ర?

L & T: ఎల్ అండ్ టీ.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఈ సంస్థ తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎల్ అండ్ టీ అంటే బ్రాండ్. కానీ, రాను రాను పరిస్థితి తారుమారు అవుతున్నది. మేడిగడ్డ (Medigadda) వ్యవహారంలో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో (Metro) అడ్వర్టైజింగ్ విషయంలో వ్యవహరిస్తున్న తీరును ‘స్వేచ్ఛ’ (Swetcha) బయటపెట్టింది. ఇష్టమొచ్చినట్టు పిల్లర్లకు హోల్స్ పెట్టడంతో ఏకంగా ప్రాజెక్ట్ ప్రమాదంలో పడుతున్న పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, వరంగల్ (Warangal) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీన్ని కూడా ఎల్ అండ్ టీ సంస్థే నిర్మాణం చేస్తున్నది. నిర్మాణం అంచనాలు పెంచి ఎల్ అండ్ టీ సంస్థకు లబ్ధి చేకూర్చి తద్వారా తాను లబ్ధి పొందాలని కేసీఆర్ ప్లాన్ వేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయిస్తున్నది.


ఆగమేఘాల మీద జైలు కూల్చివేసి..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో గంటల వ్యవధిలో నిర్ణయాలు. రోజుల వ్యవధిలోనే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న భవనాల కూల్చివేతలు జరిగాయి. ఇష్టారాజ్యంగా నమూనాలు మార్చుకోవడం, నిర్మాణ పనుల అంచనాలు పెంచుకోవడం, ఉన్నదాన్ని బాగుచేయడం మాని లాభం వచ్చే పనులు చేపట్టడం జోరుగా సాగాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో ఒకటే వరంగల్ ఆస్పత్రి నిర్మాణం. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అధునాతన వైద్య సదుపాయాలతో ఏడాదిన్నర కాలంలో 33 అంతస్తులతో హైదరాబాద్‌కు దీటుగా హెల్త్ సిటీ నిర్మాణం పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి ఆగమేఘాల మీద 135 సంవత్సరాల చరిత్ర కలిగిన వరంగల్ జైలును కూల్చివేశారు. పనులు ప్రారంభించారు. కానీ, ఇందులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు రూ.600 కోట్లకు పైగా స్కాం జరిగింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


తగ్గిన అంతస్తులు.. పెరిగిన అంచనా వ్యయం

2021లో వరంగల్ పర్యటనకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ సడన్‌గా ఒక ప్రకటన చేశారు. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చి వేసి ఆ స్థానంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ప్రతిపక్షాలు తీవ్రంగా ఆక్షేపించినా పట్టించుకోకుండా తీవ్ర నిర్బంధాల మధ్య, ఏకపక్షంగా కనీసం కొత్త జైలు నిర్మాణం చేయకుండా ఖైదీలను తరలించి 135 సంవత్సరాల చరిత్ర కలిగిన వరంగల్ సెంట్రల్ జైలును నేలమట్టం చేశారు. 15 రోజుల్లో జైలు భూమిని ఆరోగ్య శాఖకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకొని 11 రోజుల్లోనే పని పూర్తి చేశారు. 2021 జూన్ 21న 2100 పడకల ఆస్పత్రిని 15 ఎకరాల భూమిలో రూ.1115 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ముందు 33 అంతస్తులు అని చెప్పిన ఆస్పత్రి భవనాన్ని పనుల ప్రారంభ సమయానికి 24 అంతస్తులకు కుదించారు. ప్రారంభ సమయంలో ఏడాదిన్నర కాలంలోనే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. పనులు ప్రారంభమైన 14 నెలల తర్వాత ఆస్పత్రిని పరిశీలించిన కేసీఆర్ నిర్మాణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మార్పులు సూచించారు. దీంతో వ్యయం మరో రూ.450 కోట్లకు పెరిగింది. పెంచిన అంచనాలకు ఆర్థిక శాఖ అనుమతి రాలేదు.

ప్రజల క్షేమమా.. సొంత లాభం కోసమా?

అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించే వరంగల్ ఎంజీఎంను పట్టించుకోకుండా అక్కడి సేవలను మెరుగుపరచకుండా
రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇది కేసీఆర్ కుటుంబానికి లాభం చేసుకునేందుకేనన్న విమర్శలు వినిపించాయి. వరంగల్, హనుమకొండ నగరాల ప్రధాన రహదారిలో ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న సెంట్రల్ జైలు స్థలంలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ప్రారంభ సమయంలో రూ.1,115 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో 158ని విడుదల చేసింది. దాని ప్రకారం సివిల్ పనులకు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనులకు రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, ఇతర పనుల కోసం రూ.229.18 కోట్ల నిధులను కేటాయించారు. ఆస్పత్రి నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీకి టెండర్ల ద్వారా అప్పగించి, ఆర్ అండ్ బీ శాఖ పర్యవేక్షణలో ఆ పనులు పూర్తి చేసేలా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు వాస్తవిక లెక్కల ప్రకారం ఇన్ని కోట్లు ఉండదు. కేవలం కేసీఆర్ కమీషన్ కోసం కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీకి లాభం చేసేందుకే అంచనాలు పెంచారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పెంచిన అంచనాలకు ఆర్థిక శాఖ అనుమతులు లేకపోవడంతో పనులు చేపట్టిన తీరుపై కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అనుమానాలు వ్యక్తం చేసి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

Read Also- Telangana Ministers: బెర్త్ లపై బిగ్ డిస్కషన్..? ఏం జరుగుతుందోనని పార్టీలో ఉత్కంఠ!

డిజైన్, నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా వరంగల్ ఆస్పత్రిని పరిశీలించారు. డిజైన్, నిర్మాణం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో డిజైన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 24 అంతస్తులు నిర్మించడానికి అది ఆస్పత్రా, లేదంటే ఆపార్ట్‌మెంట్ టవరా అని ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే 24 అంతస్తుల నుంచి రోగులను ఎలా తరలిస్తారని సీఎం ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. మొదటి అంతస్తులోనే ఆస్పత్రి ఉండేలా, పై అంతస్తుల్లో నిర్వహణ ఆఫీసులు ఉండేలా నిర్మాణాలు డిజైన్ చేయాలని సూచించారు. నిర్మాణ వ్యయం పెంపుపై కూడా ఆరా తీశారు.

కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ

హాస్పిటల్ నిర్మాణ వ్యయం పెంపు, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే పనులు చేపట్టడంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు రెండుసార్లు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. మే నెల 26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఆస్పత్రిని పరిశీలించారు. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా అంచనా వ్యయం ఎలా పెంచారు, నిర్మాణం పనులు ఎలా చేపట్టారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అంచనా వ్యయం పెంపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.

జైలు జాగా కబ్జా చేసేందుకే..

అధికారంలో మేమే ఉన్నాం. తిరిగి అధికారంలోకి మేమే వస్తాం. మమ్మల్ని అడిగే వారెవరు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారు. వరంగల్ ట్రై సిటీలోని ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న కోట్ల విలువ చేసే జైలు జాగాపై కన్నేసి కబ్జా చేసేందుకే ఆస్పత్రిని తెరమీదకి తీసుకువచ్చారు. ఆ జాగాలో ఏదో ఒక నిర్మాణం చేసి మిగిలిన స్థలాన్ని కబ్జా చేయాలన్నదే ప్రధాన కుట్ర. హైదరాబాద్ తర్వాత అంతటి అభివృద్ధి చెందుతున్న రెండో నగరం వరంగల్ చరిత్రను ఆరు జిల్లాలుగా చేసి విచ్ఛిన్నం చేశారు. ఉత్తర తెలంగాణలోని అనేకమంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఎంజీఎంను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసి జైలును కూలగొట్టి బ్యాంకుకు కుదవబెట్టి గ ప్రభుత్వం అప్పు తీసుకువచ్చింది. తెచ్చిన పైసలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారు. –
బక్క జడ్సన్, సామాజిక వేత్త

రూ.600 కోట్ల వరకు స్కాం

వంద సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన జైలును కూలగొట్టి ఆ స్థానంలో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో 600 కోట్లకు పైగా స్కామ్ జరిగిందనే అనుమానం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ సంస్థకు లాభం చేకూర్చి తద్వారా వారు లబ్ధి పొందేందుకు అంచనా వ్యయం పెంచుకున్నారు. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా, నిబంధనలకు విరుద్ధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపైన సమగ్రమైన విచారణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వరంగల్ వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. – నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే

Read Also- Kangana Ranaut: హనీమూన్ మర్డర్ కేసుపై కంగనా సంచలన వ్యాఖ్యలు

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?