Mahesh Kumar Goud: ఇందిరమ్మతో మోడీకి పోలిక ఏంటి..? మోడీ పదవుల కోసం పుట్టిన మనిషి.. గాంధీ కుటుంబం త్యాగాల కోసం పుట్టింది.. అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. షాద్ నగర్ పట్టణంలోని ఈడెన్ గార్డెన్ లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓవైపు మతవిద్వేశాలను రెచ్చగొడుతూ మరోవైపు బయటి దేశాలకు ఊడిగం చేస్తున్న మోడీ నుంచి ప్రజలను కాపాడేందుకు, దేశ సమగ్రతను ఆవిష్కరించేందుకు సమయం ఆసన్నమైందన్నారు.
కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 400 స్థానాలు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూసిన మోడీకి భారతదేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవ చేశారు. దేశానికి నిజమైన శత్రువులు మోదీ, అమిత్ షా అని ఆయన ఆరోపించారు. ఎన్నో ఉన్నతమైన ఆలోచనలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దళిత, బడుగు వర్గాలకు అండగా నిలిస్తే ఆ రాజ్యాంగాన్ని నిండు పార్లమెంటులో అపహాస్యం చేయడం బిజెపికే చెల్లిందన్నారు.
ఒక్క పిలుపుతో ముందుకు నడిపి స్వరాజ్యాన్ని తెచ్చిన మహాత్మా గాంధీని విమర్శించే స్థాయికి బిజెపి దిగజారిందన్నారు. అందుకే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందన్నారు. దేశ సంపదలో 40 శాతం అంబానీలకు, ఆదానీలకు అంట కడుతూ దళిత వర్గాలకు మట్టిని మిగిలిస్తున్న హీనస్థితి, దీనస్థితి భారతీయ జనతా పార్టీదని మండిపడ్డారు.
Also Read: Civil Rights Day: ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారంలో.. సత్వర చర్యలు చేపట్టాలి!
కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని..రాష్ర్టంలో దళితులు, గిరిజనులు, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించి అధికారంలోకి తీసుకువచ్చిన నేతలు, కార్యకర్తల కోసం త్వరలోనే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినప్పటికీ ప్రజల కోసం వివిధ పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తూ ముందుకు సాగుతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాష్ర్టంలో పదేళ్ల కాలంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే, అదే 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి సర్వనాశనం చేసిందని విమర్శించారు.
రాజ్యాంగాన్ని మార్చాలని, మహనీయుల చరిత్రలను వక్రీకరించాలని చూస్తున్న వీరి ప్రయత్నాలను సమైక్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మత వివాదాలు సృష్టించడం తప్ప పాలనకు పనికిరారని, వారిద్దరు ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని.. మంత్రులుగా వారు అనర్హులని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ చల్లా నరసింహారెడ్డి, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఇంచార్జ్ తారా నాయక్, ఛైర్మన్ జైపాల్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ నాయకులు కాశీనాథ్ రెడ్డి, విశ్వం, తిరుపతిరెడ్డి, విశాల శ్రవణ్ రెడ్డి, ఇబ్రహీం, రఘు, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నేతలు విదేశాల్లో..గులాబీ కార్యకర్తలు రోడ్డుపై ః షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రాష్ర్టంలో పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ధనిక రాష్ర్టంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్ట ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని అభివృద్ధి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ కుటుంబం మాత్రమే అసంతృప్తితో ఉందని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో, కేటీఆర్ డల్లాస్ లో, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య సౌదీలో సేద తీరుతున్నారని, గులాబీ కండువా వేసుకున్న కార్యకర్తలు మాత్రం రోడ్లపై ఉన్నారని ఎద్దేవా చేశారు.
Also Read: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో ఇంత జరిగిందా? ప్రేమ, ద్రోహం, క్రోదం ఎన్ని కోణాలో!