Civil Rights Day: ఎస్సీ,ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతీ నెల చివర పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కలెక్టరేట్ ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితలపై అణిచివేత, అసమానత్వం,అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కమిషన్ నిరంతరం పనిచేస్తోందని చైర్మన్ వెల్లడించారు. జిల్లాలో పెండింగ్ గా ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.అన్ని రకాల పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండు గ్లాస్ ల పద్దతి, కుల వివక్ష ఉన్నందున విచారం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతీ నెల చివర శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు.
Also Read: MLC Kavitha: తెలంగాణలో సంచలనం.. పోలీసుల అదుపులో కవిత.. ఎందుకంటే?
అందుకు ఎస్‌ఐలు, తహసీల్దార్లు సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రత్యేకంగా రాయపురం గ్రామంలో వివక్ష ఎక్కువగా ఉన్నందున ఆర్డీఓ,డీఎస్పీ లు చొరవ చూపి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం,రాజీవ్ యువ వికాసం పథకాలలో ఎస్సీ,ఎస్టీ కోటా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు పరచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పడకుండా చూడాలని తెలిపారు. నిధుల దుర్వినియోగం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎథనాల్ ఫ్యాక్టరీ ఘటనపై నివేదికను కమిషన్‌కు సమర్పించాలని, ఎవరికీ ఆన్యాయం జరగకూడదని ఆదేశించారు. ఎస్సి,ఎస్టి సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, కులాంతర వివాహాలు, అంబేద్కర్ విద్యా తదితర పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా ఎస్సీ,ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డి.వి.యం.సి)వెంటనే ఏర్పాటు చేస్తామని అన్నారు.
Also Read: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో ఇంత జరిగిందా? ప్రేమ, ద్రోహం, క్రోదం ఎన్ని కోణాలో!
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ , ఎస్సీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల వివరాలు వంటి జిల్లా ప్రొఫైల్‌ను కలెక్టర్ వివరించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు 85 శాతం ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు.కులాంతర వివాహాల క్రింద మొత్తం 59 దరఖాస్తులు అందగా,6 జంటలకు రూ.15 లక్షల ప్రోత్సాహకాన్ని అందించామని తెలిపారు.
నిధులు వచ్చిన వెంటనే మిగతా వారికి ప్రోత్సాహకం అందించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టి కోటా ప్రకారం మంజూరు చేయాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో వసతి గృహాల నిర్వహణ,విద్యా, వైద్యం అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని,ఎస్సీ,ఎస్టీ కేసుల పరిష్కారం తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ, సెప్టెంబరు 2023 నుండి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 62 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా,వాటిలో 19 కేసులు విచారణలో ఉన్నాయని,మిగతా కేసులకు చార్జ్‌షీట్ వేసినట్లు తెలిపారు.ఈ కేసుల్లో ఒకటిలో నిందితులకు శిక్ష విధించబడినట్టు పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులలో 32 కేసులకు సంబంధించి రూ.38.75 లక్షల నష్టపరిహారం బాధితులకు చెల్లించినట్లు తెలిపారు. విచారణలో ఉన్న కేసులన్నింటిపై నెలలోపే పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వివిధ సమస్యలపై బాధితుల సమస్యల పరిష్కారంపై వినతి పత్రాలను సేకరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ,నర్సింగ్ రావు,కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ,నీలా దేవి, రాంబాబు నాయక్,రెణికుంట్ల ప్రవీణ్, ఆర్డిఓ అలివేలు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, డిఎస్పీ మొగలయ్య,జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,కుల సంఘ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Also Read: Akhil Akkineni: నాగార్జున పెళ్లి బట్టల సెంటిమెంట్ ను అఖిల్ కూడా ఫాలో అయ్యాడా.. అంత రిస్క్ చేశారా?