Chandrababu: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. వైసీపీ, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నుంచి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా గుణపాఠాలే నేర్చుకున్నారు. ఏయే విషయాలతో అయితే వైసీపీ (YSR Congress) అట్టర్ ప్లాప్ అయ్యిందో.. వాటి జోలికి వెళ్లడానికి సీబీఎన్ అస్సలు సాహసం చేయట్లేదు. అందుకే ఆయన వేసే ప్రతీ అడుగు ఆచితూచి వేస్తున్నట్లుగా కొన్ని పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ వైఎస్ జగన్ చేసిన తప్పులేంటి? ఆ తప్పులు బాబు చేయకుండా కనువిప్పు చేసుకున్న విషయాలేంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం..
Read Also- Cm Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఇదీ అసలు సంగతి..
వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే ప్రజా వేదిక కూల్చడంతో మొదలైన తప్పటడుగులు ఎక్కడెక్కడికో వెళ్లాయి. మరీ ముఖ్యంగా మద్యపాన నిషేధం పూర్తిగా బూమరాంగ్ అయ్యింది. ఇక మూడు రాజధానుల అంటారా? ఇది ఎంత మైనస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఘోర పరాజయానికి కారణమైన వాటిలో ఇదొక ముఖ్య కారణం. చెప్పేవాళ్లు లేక అలా చేశారో లేకుంటే చెప్పినా వినకుండా అడుగులు ముందుకు పడ్డాయో కానీ.. కొన్ని నిర్ణయాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా సలహాదారులు, నాయకులు అడ్డూ అదుపు లేకుండా దూకుడు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేరువ కాలేకపోవడం, పార్టీలో చేరికలు, చెట్లు నరికివేత ఇలా చెప్పుకుంటూ ఒకటా రెండా లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే ఈ విషయాలన్నింటిలోనూ చంద్రబాబు చాలా జాగ్రత్తగా, ఒకటికి పదిసార్లు కాదు వెయ్యిసార్లు ఆలోచించి మరీ అడుగులు ముందుకేస్తున్నారు. వాస్తవానికి చూసి నేర్చుకునే విషయంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అందుకే తాను నిత్య విద్యార్థిని అని అప్పుడప్పుడూ సభల్లో చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు సాటి మరెవరూ లేరు అంతే. నేర్చుకోవడంలో ఎక్కడా మొహమాటం పడరు, ఏ మాత్రం చిన్నబుచ్చుకోరు కూడా. గత అనుభవాలను నెమరు వేసుకుంటూ.. పొరుగు వ్యక్తులను చూసి ఏం నేర్చుకోవాలి? ఎవరిలా ఉండకూడదు? అనే విషయాలు అని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తుంటారు.
సలహాదారులు లేరు.. ఓవరాక్షన్ అస్సలే లేదు!
వైసీపీ హయాంలో తక్కువలో తక్కువ 89 మంది వరకూ సలహాదారులను నియమించుకున్నారు. ఈ నియామకాలు అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగానే మారాయి. ఈ విషయంలో వివిధ లెక్కలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సలహాదారులు ఏం చెప్పారో? ఏం చేస్తున్నారో? ఎలాంటి సలహాలు ఇస్తున్నారో కూడా కనీసం ఆలోచించకుండానే గుడ్డిగా ఫాలో అయ్యారన్నది వైసీపీ నుంచే వచ్చిన అతిపెద్ద ఆరోపణ. అందుకే సలహాదారుల జోలికే చంద్రబాబు వెళ్లలేదు. అందుకే కార్యకర్తలు మొదలుకుని నేతలు, మంత్రుల వరకూ ఏం చెప్పినా సరే వాటిని సావధానంగా వింటూ.. ఆ సలహా ఎంతవరకూ ఉపయోగం? ఏది ప్రజాహితం అనేది తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక నాయకుల దూకుడు అంటారా..? వైసీపీ హయాంలో ఒక్కో నేత నోటికి అడ్డూ అదుపులేకుండా పోయింది. కొందరు కార్యకర్తలు మొదలుకుని మంత్రుల వరకూ ఏ రేంజిలో రెచ్చిపోయారో కళ్లారా చూశాం. కొందరు మంత్రులు అయితే పచ్చి బూతులు మాట్లాడిన పరిస్థితి. ఆఖరికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా ఇష్టానుసారం మాట్లాడిన పరిస్థితి. అందుకే కూటమి ప్రభుత్వంలో ఏ కార్యకర్త అయినా ఓవరాక్షన్ చేస్తే జైలే గతి అంటూ ఇప్పటికే అరెస్టులు కూడా జరిగాయి. ఇక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంటారా ఎక్కడేం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలని, ఏ మాత్రం అదుపు తప్పినా సహించే పరిస్థితి లేదని వార్నింగులు కూడా ఇస్తున్నారు. తేడా వస్తే సీఎంవోకు పిలిపించి మరీ క్లాస్ తీసుకుంటున్నారు.
Read Also- Pawan Kalyan: సెలూన్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఓ రేంజిలో ఆడుకుంటున్నారుగా!
మరో రెండు విషయాలు ఇవే..!
వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో పనులన్నీ చకచకా జరిగిపోయేవి కానీ.. ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. దీంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అంటూ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ ఇంటింటికీ పంపారు కానీ ఈ కార్యక్రమం ఎందుకో అట్టర్ ప్లాప్ అయ్యింది. అందుకే ప్రజలకు సీఎంతో పాటు నేతలు కూడా చేరువ కాలేకపోయారనే వాదన బలంగా వినిపించింది. ఈ విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతినెలా ఒకటో తారీఖున పెన్షన్లు ఏదో ఒక జిల్లాలోని ప్రాంతానికి వెళ్లి స్వయంగా పంపిణీ చేయడం, జనాలతో ప్రజా వేదిక ద్వారా మమేకం కావడం లాంటి చేస్తూ గ్యాప్ లేకుండా చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను సైతం ప్రజలకు చేరువ కావాలని ఎప్పటికప్పుడు సూచిస్తూ పంపుతున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వస్తున్నారు చంద్రబాబు. వాస్తవానికి ఇదొక మంచి పరిణామం అని ప్రజల నుంచే కితాబు వస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక వైసీపీ హయాంలో చేరికలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎవరొచ్చినా సరే అయితే తాడేపల్లి ప్యాలెస్‌లో లేదా ఆయా ఎమ్మెల్యేల కార్యాలయాల్లో కండువాలు కప్పడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో నేతల మధ్య గ్యాప్ రావడం, మనస్పర్థలు రావడంతో ఎక్కడికక్కడ చీలికలు వచ్చేశాయి. ఇది కూడా వైసీపీ ఓటమికి ఒక కారణమని చెప్పుకోవచ్చు.
అన్నొస్తే అంతే.. మరి ఇప్పుడు?
వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) నుంచి అడుగు బయటపెట్టారంటే చాలు ఏ ప్రాంతానికి వెళ్తారో ఆ చుట్టు పక్కాలా చెట్లు నరికివేతలే కనిపించేవి. అదేం విచిత్రమో కానీ.. జగన్ హెలికాఫ్టర్‌లో వెళ్లినా సరే కిందున్న చెట్లు నరికేయడం తీవ్ర విమర్శలు, వివాదాలకు దారితీసింది. ఇక రోడ్డుపక్కన ఉండే షాపులు, పరదాలు, ఏ రేంజిలో సెక్యూరిటీ ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఈ విషయంలో చంద్రబాబు ఎక్కడా వివాదాలకు దారితీసే పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ, ఈ మధ్య తూర్పుగోదావరి పర్యటనలో చెట్లు నరికేసినట్లు వార్తలు వచ్చాయి కానీ, సదరు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి తోడు ‘వన మహోత్సవం’ పేరిట ఏడీసీఎల్ పార్కులో పెద్ద కార్యక్రమాన్నే నిర్వహించి.. అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ జగన్ నుంచి చంద్రబాబు చాలానే గుణపాఠాలు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. సో.. మొత్తానికి చూస్తే జగన్ చేసిన తప్పులు.. చంద్రబాబుకు మాత్రం బాగానే కనువిప్పు కలిగించాయని చెప్పుకోవచ్చు.