TG Cabinet: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్యాబినెట్ విస్తరణ (Cabinet Expansion) పూర్తయింది. ప్రస్తుతానికి ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఇతర మంత్రులు, నాయకులు పాల్గొన్నారు.
గడ్డం వివేక్ రాజకీయ ప్రస్థానం
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి చిన్న కుమారుడు వివేక్. తండ్రిలాగే రాజకీయాల్లోకి సత్తా చాటాలని 2009లో అరంగేట్రం చేశారు. పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీ స్థాయిలో పోరాడారు. 2013లో బీఆర్ఎస్ గూటికి చేరారు. కొన్నాళ్లకే తిరిగి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో మళ్లీ బీఆర్ఎస్‌లో చేరి, ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. మళ్లీ 2019లో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. అక్కడ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిచారు.
Read Also- Samantha: నాగ చైతన్య నా ఫస్ట్ లవ్ అంటూ మళ్లీ ఓపెన్ అయిన సమంత
వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కీలక నేతల్లో వాకిటి శ్రీహరి ఒకరు. మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో మక్తల్ గ్రామ సర్పంచ్‌గా, 2014లో జెడ్పీటీసీగా, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 2023 ఎన్నికల్లో 17వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా మక్తల్ నుంచి గెలిచారు. బీసీ కోటాలో ఈయన్ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.
అడ్లూరి లక్ష్మణ్ రాజకీయ ప్రస్థానం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్. 1982లో ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడి(గోదావరిఖని)గా పని చేశారు. 1996లో ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006లో ధర్మారం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో మేడారం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత 2009 ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014, 2018లోనూ అదే సీన్ రిపీట్ అయింది. కానీ, 2023 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌పై 22వేలకు పైగా మెజారిటీతో ధర్మపురిలో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
Read Also- Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ కన్నుమూత.. టీడీపీతో మొదలై.. బీఆర్ఎస్‌లో కీలకమై!