Vijayabhanu: విజయభాను.. ఈ పేరు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చేమోగానీ, 70వ దశకంలో ఒక వెలుగు వెలిగి అప్పటి అగ్ర హీరోలందరి సరసన నటించిన మేటి నటీమణి విజయభాను. తెలుగు సినిమా రంగంలో విజయ పతాకం ఎగురవేయడమే కాకుండా… తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించారామె. ముఖ్యంగా అప్పట్లో రాజబాబు – విజయభాను జంటకు ఓ రేంజ్‌లో క్రేజ్ ఉండేది. కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా సినిమాలు చేసిన విజయభాను.. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి పాన్ ఇండియా పాపులర్ యాక్ట్రెస్‌గా పేరు పొందారు. ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె తిరిగి అమెరికాకు పయనమవ్వాల్సి ఉండగా.. శాశ్వతంగా 2025, ఏప్రిల్ 25న ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె వయసు 75. ఆమెకు ఒక్కరే కుమార్తె. అమెరికాలోని ఓ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. విజయభాను స్వస్థలం అనంతపురం. కానీ ఆమె పుట్టింది, పెరిగింది, పేరు తెచ్చుకుందంతా కూడా చెన్నైలోనే.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఓ అమెరికన్‌తో పీకల్లోతు ప్రేమలో పడిన ఆమె, కెరీర్‌తో పాటు ఇండియాను కూడా విడిచిపెట్టి.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడ్డారు. స్వతహాగా నాట్యకారిణి అయిన విజయభాను, తనకొచ్చిన కళను ప్రదర్శించి ‘నాట్యమయూరి’ బిరుదాంకితురాలయ్యారు. లాస్ ఏంజెల్స్‌లో ‘శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్’ పేరుతో నృత్య కళాశాల స్థాపించి, వేలాది మందికి శిక్షణనిచ్చారు. మన భారతీయ నాట్యకళలైన ‘భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి’ వంటి అన్ని నృత్యరీతులలోనూ నిష్ణాతురాలైన విజయభాను.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు ఎవరు వెళ్లినా.. విజయభాను ఎంతో ఆత్మీయంగా ఆతిధ్యమిస్తుంటారని అంటుంటారు.
Also Read- Arjun Das: ‘ఓజీ’ షూట్‌లో.. అర్జున్ దాస్ ఆనందానికి అవధుల్లేవ్!
అమెరికా కోడలుగా అక్కడే స్థిరపడినప్పటికీ.. భారతీయ మూలాలను మాత్రం ఎన్నడూ మరువని ఈ భరతమాత ముద్దుబిడ్డ, అనంతపురంలో ఆమె మాతృమూర్తి కట్టించిన ‘శివ నారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయం’ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. సేవా దృక్పధం, మానవతావాదం మెండుగా ఉన్న ఈ అనంతపురం ఆడపడుచు.. తన సహాయం కోరి వచ్చిన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. గత నెలలో ఇండియా పర్యటనకు వచ్చి, చెన్నైలోని తన ఇంటిని చూసుకునేందుకు వెళ్లిన విజయభాను, ఎండ వేడిని తట్టుకోలేక వడదెబ్బకు లోనై.. అర్ధాంతరంగా కన్ను మూశారు. తన ఇంట్లో చనిపోవడం కోసమే ఆమె పనిగట్టుకుని అమెరికా నుంచి ఇండియాకు వచ్చారా? అనిపించేలా.. ఎక్కడైతే ఆమె ఒంటరిపోరాటంతో ఒక నటిగా, విరాజిల్లారో.. అక్కడే మృత్యువు ఒడిలో ఒంటరిగా ఒదిగిపోయి.. మాతృభూమిపై ఉన్న ప్రేమని తెలియజేశారు. కమల్ హాసన్, చిరంజీవి, జయసుధలతో కె. బాలచందర్ తెరక్కించిన దృశ్యకావ్యం ‘ఇది కథ కాదు’ చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయభాను.. ఆ చిత్రంలో కనబరిచిన అత్యుత్తమ నటనకు ‘ఉత్తమ సహాయ నటి’గా నంది పురస్కారం అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా ‘నాట్యమయూరి’ బిరుదును అందుకున్నారు. ‘నిప్పులాంటి మనిషి’ (ఎన్టీఆర్), ‘ఇది కథ కాదు’ (చిరంజీవి – కమల్ హాసన్), ‘కిలాడి బుల్లోడు’ (శోభన్ బాబు), ‘ఒక నారి వంద తుపాకులు’ (విజయ లలిత) వంటి చిత్రాలెన్నింటిలోనో ఆమె నటించారు.
Also Read- King Nagarjuna: అఖిల్ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. ఏం చెప్పారంటే?
విజయభాను గురించి అమెరికాలోనే స్థిరపడిన ఆమె సోదరి కలైమామణి డా. సిందూరి జయసింఘే మాట్లాడుతూ.. మా అక్క నిజంగా దేవత. ఒక పోరాట శక్తి. ఎన్నో కుటుంబాలకు ఆమె జీవన జ్యోతి. ఎందరికో ఆదర్శమూర్తి. ఆమెకు నివాళిగా, అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితంపై ఒక పుస్తకం తీసుకురావాలని మేము సంకల్పించాం. జయప్రద మా అక్కకు చాలా సన్నిహితురాలు. చెన్నైలో నిర్వహించిన మా అక్క దశదినకర్మకు కూడా ఆమె హాజరయ్యారు. మా అక్క ప్రేరణతోనే నేనూ అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడి, నేను కూడా డాన్స్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నాను. అక్కతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వారందరినీ కలిసి.. అక్కపై పుస్తకాన్ని వీలైనంత సమగ్రంగా తీసుకు రావాలని భావిస్తున్నామని అన్నారు. విజయభాను ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ నటి – మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద.. నటులు సుమన్, దర్శకనిర్మాత వై.వి.ఎస్.చౌదరి తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు