Food adulterated
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Adulterated Food: కల్తీ కాలం.. ఏం తినేటట్టు లేదు!

Adulterated Food: పిల్లలకు చాక్లెట్ కొనిద్దామన్నా గొంతెండి ఐస్ క్రీం తిందామనుకున్నా చివరకు బలవర్ధకమని పాలు తాగాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొంది. కారణం డబ్బు సంపాదనే లక్ష్యంగా పదుల సంఖ్యలో ముఠాలు వంటింట్లో వాడే దినుసులతోపాటు ప్రతీదాన్నీ కల్తీ చేస్తుండటమే. ఆకర్షణీయంగా ప్యాక్​చేసి బ్రాండెడ్​పేర మార్కెట్లోకి వదులుతుండటమే. డబ్బులిచ్చి మరీ వీటిని కొని తింటున్నవారు ప్రమాదకర రోగాల బారిన పడుతున్నారు. కోట్ల రూపాయల్లో జరుగుతున్న ఈ దందాకు చెక్​ పెట్టాల్సిన అధికార యంత్రాంగాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఏదైనా విషాదం జరిగినపుడు హడావిడి చేస్తూ ఆ తరువాత మిన్నకుండి పోతున్నాయి. దీనికి కారణం వారికి ఆమ్యామ్యాలు అందుతుండటమే అన్న ఆరోపణలు ఉన్నాయి.


తింటే అస్వస్థతకు గురి కావటం ఖాయం

తినే పదార్థం ఏదైనా దానికి ఖచ్చితంగా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఆ తరువాత వాటిని తింటే అస్వస్థతకు గురి కావటం ఖాయం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అయితే, కొన్ని ముఠాలు ఇలా గడువు ముగిసిన ఆహార పదార్థాలను తక్కువ ధరలకు కొని రీసైక్లింగ్​చేసి వాటిని తిరిగి మార్కెట్ లోకి పంపిస్తున్నారు. ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే ఈ గ్యాంగులు చిన్నపిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లు, బిస్కెట్లతోపాటు ప్రతీదాన్ని రీ సైక్లింగ్ చేసి మార్కెటింగ్ చేస్తుండటం. దీనికి నిదర్శనంగా కోఠిలోని హరిహంత్ అన్న సంస్థ నిర్వాకాన్ని పేర్కొనవచ్చు. దీనిని నడిపినవారు హైదరాబాద్ వ్యాప్తంగా కిరాణా దుకాణాల నుంచి ఎక్స్ పైరీ డేట్ దాటిన చాక్కెట్లు, బిస్కెట్లు, లాలీపాప్ తదితర తినుబండారాలను నామమాత్రపు రేట్లకు కొని బోడుప్పల్ సమీపంలో ఏర్పాటు చేసుకున్న గోడౌన్ కు తరలించేవారు. అక్కడ వీటిని రీ సైక్లింగ్ చేసి తిరిగి అవే కవర్లలో ప్యాక్​చేసి తెలంగాణ వ్యాప్తంగా విక్రయిస్తూ వచ్చారు. చివరకు రాచకొండ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి లక్షల రూపాయల విలువ చేసే పదార్థాలు దొరకటం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.


చిన్నపిల్లలు తాగే మ్యాంగ్ జ్యూస్

ఇక, వంటల్లో ఉపయోగించే దినుసులను సైతం పదుల సంఖ్యలో ముఠాలు కల్తీ చేస్తున్నాయి. దీనికి నిదర్శనంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసి అమ్ముతూ రెండు రోజుల క్రితం సౌత్ ఈస్ట్ జోన్​టాస్క్​ఫోర్స్​పోలీసులకు పట్టుబడ్డ మహ్మద్​ఫైజల్​ఉదంతాన్ని పేర్కొనవచ్చు. పటేల్​నగర్లో నివాసముంటున్న మహ్మద్​ఫైజల్​తన ఇంట్లోనే కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లితో టైటానికం డయాక్సయిడ్, మోనో సైట్రేట్​తదితర రసాయనాలను ఉపయోగించి పేస్టును తయారు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నాడు. టీ, కారం పొడి, పసుపు, గరంమసాలా, చికెన్​మసాలా ఇలా ప్రతీదాన్ని కల్తీ చేస్తున్నారు. చివరకు చిన్నపిల్లలు తాగే మ్యాంగ్ జ్యూస్ ను కూడా కల్తీ పౌడర్​తో తయారు చేసి అమ్ముతున్నారు. పాలు పగిలిపోకుండా హైడ్రోజన్​ఫెరాక్సయిడ్ అనే రసాయనాన్ని కలిపి విక్రయిస్తున్నారు. ఎక్స్​పైర్ అయిన సింథటిక్​కలర్లను వాడుతూ వెనిల్లా, చాక్లెట్, బటర్​స్కాచ్​ఇలా వేర్వేరు రకాల ఐస్​క్రీంలు తయారు చేసి అమ్ముతున్నారు.

Also Read: Hydraa: నాలా ఆక్రమణలపై.. హైడ్రా యాక్షన్ షురూ!

హోటళ్లలో కుళ్లిపోయిన మాంసం

ఇక, హోటళ్లలో కొనసాగుతున్న ఆహార కల్తీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పనికిరాని పప్పులు, పెరుగు, పాలు, కుళ్లిపోయిన మాంసం, చికెన్, రోజుల తరబడి ఫ్రిడ్జీల్లో నిల్వ చేసిన చేపలు, రొయ్యలు వండి వారుస్తున్నారు. ఆర్డర్​రాగానే ఇలా నిల్వ చేసిన వాటిని బయటకు తీసి మసాలాలు దట్టించి వేడి వేడిగా వడ్డిస్తున్నారు. రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్లపై మిర్చీబజ్జీలు చేసి అమ్ముతున్నవారు పశువుల కొవ్వును కరిగించి తీస్తున్న నూనెను ఉపయోగిస్తున్నారు.

ఫుడ్​సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టాలున్నా

నిజానికి మార్కెట్లో విక్రయించే ఆహార పదార్థాలకు ఫుడ్​సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్​(FSSAI) చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరి. కల్తీకి చెక్​పెట్టటానికి వంట నూనెల నియంత్రణ చట్టం, నిత్యావసర సరుకుల చట్టం, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం, ఆహార కల్తీ నిరోధక చట్టం ఇలా చాలానే ఉన్నాయి. వీటిని అమలు చేయటానికి అధికార యంత్రాంగాలు కూడా ఉన్నాయి. అయితే, ఆయా అధికార యంత్రాంగాలు అల​సత్వంతో వ్యవహరిస్తుండటం కొందరు అధికారులు సొంత జేబులు నింపుకోవటానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో కల్తీ దందా యధేచ్ఛగా సాగిపోతూనే ఉంది.

ప్రాణాంతక వ్యాధులు

ఇలా ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్న కల్తీ ఆహార పదార్థాలు తిని జనం గుండె, ఊపిరితిత్తులు, నరాలు, ఎముకలు, మూత్రపిండాలు, మెదడు, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని సీనియర్​ఫిజీషియన్​డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. కొందరు చికిత్స లేని రోగులకు గురై ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారన్నారు. చనిపోతున్న వారిలో ఇరవై అయిదు శాతం అయిదేళ్లలోపు చిన్నారులే ఉంటున్నారన్నారు. పేరొందిన వాటితోపాటు ఏ హోటల్ వంటగదిలో తనిఖీలు చేసినా పదుల సంఖ్యలో బొద్దింకలు, ఎలుకలు దర్శనమిస్తుంటాయన్నారు. ఇలాంటి దందాలు చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా చూసినపుడే కల్తీకి కొంతలో కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చన్నారు.

Also Read: CM Revanth Reddy: చిన్నారికి కొండంత కష్టం.. రంగంలోకి సీఎం.. కీలక ఆదేశాలు జారీ

 

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ