Rythu Bharosa: ఈ సంవత్సరం పంట వేయకముందే అతి త్వరలో రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు రోజులపాటు జరగనున్న రైతు మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు కార్యక్రమానికి ఎడ్లబండ్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కార్యక్రమంలో ఏర్పాటుచేసిన 150 కి పైగా స్టాల్ లను మంత్రులు పరిశీలించారు. స్టాల్ లలో ఆయిల్ ఫామ్, ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఉద్యానవన, పట్టు పరిశ్రమకు సంబంధించిన వాటిని పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు రైతుల అనుభవాలను రైతులు తెలుసుకున్నారు.
రైతు మహోత్సవం కార్యక్రమం
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కావస్తున్న సందర్భంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజేయడానికి రైతు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మూడు రోజులు జరుగుతున్న కిసాన్ మేళా కు రావాలని పేరు పేరున రైతులను కోరారు. రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాల్ లను సందర్శించి ఇక్కడున్న నూతన వ్యవసాయ విధానాలను,పంటలను పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గల్లో గ్రామీణ ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ రైతు మహోత్సవం ద్వారా హుస్నాబాద్ రైతాంగం తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకంగా మారాలని ఆకాంక్షించారు.
Also Read: Bachupally Police: వివాహేతర సంబంధమే.. హత్యకు కారణమా?
మందులు ఎక్కువ వాడడం వల్ల ఇతర దేశాల్లో మన పంటలు కొనడం లేదు
మారుతున్న వాతావరణ పరిస్థితులు, యాంత్రీకరణ, సేంద్రీయ పద్ధతుల పై రైతులకు అవగాహన కల్పించడం కోసం రైతు మహోత్సవ రాష్ట్రవ్యాప్తంగా రైతు మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో కంటే రైతులు నేడు యూరియా, పురుగుల మందులు ఎక్కువ వాడుతున్నరన్నారు. మందులు ఎక్కువ వాడడం వల్ల ఇతర దేశాల్లో మన పంటలు కొనడం లేదన్నారు. దీంతో రైతులకు ఏం కావాలో తెలుసుకోవాలని వ్యవసాయ శాస్రవేత్తలు గ్రామాలకు వస్తున్నారన్నారు. హార్టికల్చర్, కూరగాయల సాగు మన రాష్ట్రంలో తక్కువ ఉన్నాయన్నారు.
పంటగా కూరగాయలను సాగు చేయాలి
మన రాష్ట్ర రైతులు మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలకు కూరగాయలు ఉత్పత్తి చేసేలా ఎదగాలన్నారు. వ్యవసాయ విద్యాలయం సహకారంతో రైతులకు విత్తలను పంపిణీ చేస్తున్నామని, హుస్నాబాద్ లో స్థలం కేటాయిస్తే ఆయిల్ ఫామ్ గొడవున్, రిఫైన్డ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమని, అంతర్ పంటగా కూరగాయలను సాగు చేయాలన్నారు. కేంద్రం యూరియా, డీఏపీ సరిపడ ఇవ్వడం లేదనీ, త్వరగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నమన్నారు.కొన్ని రాజకీయ పార్టీలు ఆనవసర విమర్శలు మానుకోవాలని, ఎరువులు సకాలంలో ఇవ్వలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. మునుగకు పెద్ద డిమాండ్ ఉందనీ, ఫామ్ ఆయిల్ పంటలో అంతర్ పంటగా వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. హార్టికల్చర్ పెంచుకుంటే సకాలంలో వర్షాలు వస్తాయని, మూడు రోజులు రైతులు వారికి ఉన్న అనుభవాలను వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఈ వేదికలో చర్చించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిహెచ్. అంజిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి,సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నాయకురాలు భవానీ రెడ్డి, జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్లు అబ్దుల్ హమీద్, గరిమ అగ్రవాల్, హుస్నాబాద్ సింగిల్బండ చైర్మన్ బొలిశెట్టి శివయ్య,హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్, ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, హుస్నాబాద్ నియోజకవర్గ రైతులు, రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!