Hyderabad Pollution
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Hyderabad: భవిష్యత్తులో హైదరాబాద్‌లో బతకలేమా?

Hyderabad: ఊపిరి తీసుకుంటే బతుకుతాం. కానీ, హైదరాబాద్​ జనం మాత్రం క్రమంగా చావుకు దగ్గరవుతున్నారు. కారణం ఏయేటికాయేడు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న కాలుష్యం. స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్​ సంస్థ గతంలో సమర్పించిన నివేదిక ప్రకారం దక్షిణ భారత దేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న సిటీల్లో హైదరాబాద్​ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. హైదరాబాద్​‌ను 540 పొల్యూషన్​ గ్రిడ్లుగా విభజించి జరిపిన సర్వేలో క్యూబిక్​ మీటర్‌కు 2.5 మైక్రోగ్రాములుగా ఉండాల్సిన కాలుష్యం (Pollution) 42.4గా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.


వాహనాల వల్లే..

అధికార యంత్రాంగాల అలసత్వం, జనంలో కనిపించని అవగాహన చారిత్రక నగరాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాహనాలే. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో 70 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాల సంఖ్య 55 లక్షలకు పైగానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఏయేటికాయేడు వాహనాల (Vehicles) సంఖ్య పెరిగి పోతుండటమే. దీనిపై అధికార వర్గాలతో మాట్లాడగా ప్రజా రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండడమే కారణమని చెబుతున్నాయి. మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్​ రైళ్లు, ఆర్టీసీ (RTC) బస్సులు ప్రజల ప్రయాణావసరాలను పూర్తిగా తీర్చలేక పోతున్నాయని పేర్కొన్నాయి. దాంతో జనం సొంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నాయి. కోవిడ్​ తరువాత ఈ ట్రెండ్​ మరింత ఎక్కువైందని చెబుతున్నాయి.


లోన్లు సులభం కావడంతో..

బ్యాంకులు, ప్రైవేట్​ సంస్థల నుంచి తేలికగానే లోన్లు (Loans) దొరుకుతుండడం కూడా నగరంలో సొంతంగా వాహనాలు కొంటున్న వారి సంఖ్య పెరగడానికి కారణమవుతున్నది. రూ.15 వేలు కడితే టూ వీలర్, లక్ష కడితే కారు కొనే అవకాశాన్ని ఆయా బ్యాంకులు, ప్రైవేట్​ ఫైనాన్సర్లు కల్పిస్తున్నారు. మిగితా మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో వసూలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 30 వేల ఆదాయం ఉన్నవారు ద్విచక్ర వాహనాలను కొంటుంటే, 50వేలకు పైగా సంపాదన ఉన్నవారు కార్లు కొనేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి దాటినా హైదరాబాద్ రోడ్లు వచ్చిపోయే వాహనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఇక, జనంలో అవగాహన లేకపోవడం కూడా కాలుష్యానికి కారణమవుతున్నది.

ఇంజిన్లు ఆఫ్ చేస్తున్నారా?

అధికశాతం మంది రవాణావసరాల కోసం బైకులు, కార్లు ఉపయోగించుకుంటున్నారు తప్పితే సరైన సమయానికి వాటిని సర్వీస్ చేయించడం లేదు. దాంతో వాహనాలు పూర్తి స్థాయిలో పెట్రోల్​, డీజిల్‌లను మండించలేకపోతున్నాయి. దాంతో కార్బన్​ డైఆక్సయిడ్​, కార్బన్​ మోనాక్సయిడ్​, సీసం వంటి పదార్థాలు వాతావరణంలో క​లిసిపోతున్నాయి. రెడ్​ సిగ్నల్ పడినప్పుడు వాహనాలను ఆపడం తెలిసిందే. అయితే, ఇలా ఆగుతున్న వారిలో 70 శాతం మంది తమ తమ వాహనాల ఇంజన్లను ఆఫ్​ చేయడం లేదు. ప్రస్తుతం వస్తున్న ద్విచక్ర వాహనాలకు బటన్​ స్విచ్చాఫ్​, స్విచాన్​ సౌకర్యం ఉన్నా వాహనదారులు ఉపయోగించుకోవడం లేదు. ఇక, కార్లు నడుపుతున్న వారైతే ఇంజిన్​ ఆఫ్​ చేస్తే ఏసీ పోతుందని వాటిని ఆన్​‌లోనే పెడుతున్నారు.

Read Also- CM Revanth Reddy: ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా రెండుసార్లు.. సీఎం కీలక నిర్ణయం

నిషేధం అమలు ఎక్కడ?

పెరిగిపోతున్న కాలుష్యాన్ని కాస్తలో కాస్త తగ్గించడానికి 15 సంవత్సరాలకు పైబడిన వాహనాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అన్ని రాష్ట్రాల్లో దీనిని కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ప్రభుత్వ వాహనాలైనా ఉపేక్షించ వద్దని స్పష్టంగా తెలిపింది. అయితే, దీనిని అమలు చేసే నాథుడే లేడు. ప్రభుత్వ, ప్రైవేట్‌కు చెంది 15 ఏళ్లకు పైగా రహదారులపై తిరుగుతున్న వేలాది వాహనాలు పొగలు చిమ్మే దృశ్యాలు సర్వసాధారణం అయిపోయింది.

పరిశ్రమలు మరో కారణం

ఇక, హైదరాబాద్‌లో జనవాసాల మధ్య ఉన్న పరిశ్రమలు కూడా వాతావరణంలోకి కాలుష్యాన్ని కక్కుతున్నాయి. చెత్త, బొగ్గు, కలపను కాల్చినప్పుడు కార్బన్ మోనాక్సయిడ్ ఎక్కువగా గాలిలో కలుస్తుందని పొల్యూషన్ కంట్రోల్​ బోర్డు అధికారులు చెబుతున్నారు. జీవాల కళేబరాలు కుళ్లినప్పుడు మిథేన్​ వాతావరణంలో కలుస్తుందన్నారు. ఆమ్ల పరిశ్రమల నుంచి సల్ఫర్​ డైఆక్సయిడ్​, సల్ఫ్యూరిక్​‌లు గాల్లోకి చేరుతున్నాయి. ఎయిర్​ కండీషన్లు, ఫ్రిడ్జీల నుంచి క్లోరో ఫోరో కార్భన్లు వాతావరణంలోకి చేరి కాలుష్యానికి కారణమవుతోంది. పెట్రోల్​ ఆవిరవుతుండడం వల్ల బెంజిన్​, బెండిఫైన్ అనే రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి. ఇలా పెరిగిపోతున్న కాలుష్యం జనాన్ని రకరకాల రోగాలకు గురి చేస్తున్నది. ప్రధానంగా క్యాన్సర్​, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు పెరిగిపోవడానికి కారణమవుతున్నది. ఓ అధ్యయనం ప్రకారం ఏటా కనీసం 3 వేల మంది కాలుష్యం కారణంగానే మృత్యువాత పడుతున్నారంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

నివారించాలంటే..

ఈ పరిస్థితిని నివారించాలంటూ కట్టుదిట్టమైన చర్యలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బ​లోపేతం చేయాలంటున్నారు. ఢిల్లీ తరహాలో నగర రహదారులపై తిరుగుతున్న వాహనాలకు సరి, బేసి సంఖ్యలు కేటాయించి వాటిని రోడ్లపైకి అనుమతించాలన్నారు. ఇక, నగరం మొత్తంలో సాంప్రదాయ మొక్కలను విరివిగా నాటాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కోలోకార్భస్​ మొక్కల వల్ల ప్రయోజనం ఏదీ లేదంటున్నారు. కాలుష్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో మరింత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

Read Also- Elon musk on Trump: ట్రంప్‌పై ఎలాన్ మస్క్ బిగ్ బాంబ్.. షేక్ అవుతున్న ప్రపంచ దేశాలు!

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ