Pottimama: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పొట్టిగా, బక్కపలచగా ఉండే ఓ పర్సన్, పక్కన కత్తిలాంటి అమ్మాయితో.. ‘ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్లు’ అని ఒకసారి, ‘సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది’ అని మరోసారి, ‘ఆట కావాలా, పాట కావాలా’ అని ఇంకోసారి.. ఇలా మెగాస్టార్ చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేస్తూ.. కాదు కాదు, సేమ్ టు సేమ్ చిరంజీవి వేస్తున్నట్లుగా డ్యాన్స్ దింపుతూ కనిపిస్తుంటారు. ఆయనని చూడటానికి అంతగా ఆకర్షించకపోయినా, ఆయన డ్యాన్స్ మాత్రం అందరినీ అలరిస్తుంటుంది. ప్రస్తుతం యూట్యూబ్ స్టార్‌గా దూసుకుపోతున్న ఈ పొట్టిమామకు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటే తనలో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది కదా. అదే ఆయనని స్టార్‌ని చేసింది. నటుడిగా మారాలనే తన డ్రీమ్‌ని నిజం చేసింది. అయితే ఎప్పుడూ డ్యాన్స్ వీడియోలతో, అందరూ చమత్కరించేలా మాట్లాడుకునే ఈ పొట్టిమామ కథ తెలిస్తే మాత్రం అందరికీ కళ్లవెంట నీళ్లొస్తాయి. ఇంత బాధని దిగమింగుకుని ఆయన వేసిన ఒక్కో మెట్టు ఇప్పుడెందరికో స్ఫూర్తినిచ్చేలా ఆయన స్టోరీ ఉంటుందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు.
Also Read- Samantha: సమంత మోసం చేస్తుంది.. డాక్టర్ ఫైర్!
ఈ పొట్టిమామ అసలు పేరు రవీంద్ర. ప్రస్తుతం ఆయనకి 57 సంవత్సరాలు. శ్రీకాళహస్తి సమీపంలోని భీమవరానికి చెందిన రవీంద్ర.. ఏడో తరగతిలోనే మాతృవియోగానికి లోనయ్యారు. అతని తల్లి బ్లడ్ క్యాన్సర్‌తో మృతి చెందారు. ఆ తర్వాత 18 ఎకరాల భూమి, ఇల్లుతో పాటు వీధి నాటకాలను ఆయనకు వారసత్వంగా ఇచ్చాడు తండ్రి. రవీంద్ర నాటకాల పిచ్చి చూసి.. నాలుగు ఎకరాలు అమ్మి మరి డబ్బిచ్చాడు తండ్రి. అంతే, ఆ డబ్బు తీసుకుని 10వ తరగతి చదివే సమయంలోనే మద్రాసుకు రైలేక్కేశాడు రవీంద్ర. మద్రాసులో ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడ వాలిపోతూ.. దాదాపు రెండు నెలలు గడిపాడు. చేతిలో డబ్బులైపోయాయి. డబ్బులు లేవని ఆకలికి తెలియదు కదా. కడుపు నింపుకోవడానికి మద్రాసులోని ఓ హీరోయిన్ ఇంట్లో కుక్కలను చూసుకునే పనికి కుదిరాడు. ఎప్పటికైనా సినిమా వాళ్ల చూపు తనపై పడుతుందని ఆశపడ్డాడు కానీ.. అది జరగలేదు. మద్రాసు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం పై ఆకలితో పడుకుని ఉన్న రవీంద్రను చూసిన పోలీసులు, ఏ ఊరో తెలుసుకుని నాయుడు పేట వెళ్లే రైలు ఎక్కించారు. ఆయన తీసుకెళ్లిన డబ్బులన్నీ అయిపోయాయి. రైలు దిగి సుమారు 50 కి.మీ. నడుచుకుంటూ భీమవరానికి చేరుకున్నాడు. అదే సమయంలో తండ్రి లివర్ క్యాన్సర్‌తో చనిపోయాడు. ఆస్తులన్నీ కరిగిపోయాయి. పుట్టిన ఊళ్లోనే అనాథగా మిగిలిన రవీంద్రకు ఆ ఊరిలోని వారంతా, వారాల వంతులు ఇంటికొకరు అన్నం పెట్టేవారు.
ఆ తర్వాత వెంకటగిరిలోని ఓ బారులో సప్లయర్‌గా చేరిన రవీంద్రకు మేనత్త తన కుమార్తె సుబ్బరత్నని ఇచ్చి ఇంటికి ఇల్లరికం తెచ్చుకుంది. రవీంద్ర, సుబ్బరత్నలకు ముగ్గురు కుమారులు పుట్టారు. తనకున్న నాటకాల పిచ్చిని బలవంతంగా అణచుకుని మేకలు మేపుకుంటూ బతుకుతున్న రవీంద్రకు మేర్లపాకకు చెందిన ప్రజ్వల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. తన గురించి తెలుసుకుని, ఇంటిలో అందరినీ ఒప్పించి.. అతన్ని యూట్యూబ్‌లోకి లాక్కొచ్చాడు. టెక్నాలజీ గురించి తెలిసిన ప్రజ్వల్‌కు కూడా సినిమా పిచ్చి. అలాంటి ప్రజ్వల్.. మొబైల్ కూడా వాడడం రాని రవీంద్రతో పెద్ద మ్యాజిక్కే చేశాడు. అతన్ని యూట్యూబ్ స్టార్‌ను చేశాడు. వారిద్దరూ కలిసి చేసిన వీడియోలకు బీభత్సంగా వ్యూస్ రావడంతో.. వారిద్దరి దశ తిరిగిపోయింది. చిన్న చిన్న స్క్రిప్ట్‌ల నుంచి కవర్ సాంగ్స్ చేసే వరకు వెళ్లారు. అప్పటి నుంచే రవీంద్ర కాస్తా.. పొట్టిమామగా మారిపోయారు. ప్రేక్షకులు, ఫాలోయర్స్ అందరూ ఆయనని ముద్దుగా పొట్టిమామ అని పిలవడం, కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడదే పేరుగా మారిపోయింది.
Also Read- Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు?
మొదట్లో పొట్టి మామతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. జ్యోత్స్న అనే చిన్న పాపతో మొదటి పాట చేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘స్నేహం కోసం’ సినిమాలోని కైకలూరి కన్నేపిల్ల పాట మూడు మిలియన్ల వ్యూస్‌తో అప్పట్లో సంచలనం అయింది. ఆ తర్వాత పొట్టిమామ పక్కన డ్యాన్స్ చేయడానికి అమ్మాయిలు క్యూ కట్టారు. అంతా ఓ టీమ్‌గా ఏర్పడి వరుసగా చిరంజీవి పాటలతో వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ బాగా ట్రెండింగ్ అవడంతో.. పొట్టిమామ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దీంతో వరుసగా ఆయనకు ఈవెంట్లు రావడం మొదలయ్యాయి. వీడియోలకు, ఈవెంట్లకు వస్తున్న డబ్బుతో అవసరాలన్నీ తీర్చేసుకుంటూ వస్తున్న పొట్టిమామకు.. ఒకప్పుడు వెంటబడితే వెనక్కిపోయిన సినిమా అవకాశాలు ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా గ్లోబర్ స్టార్ రామ్‌చరణ్ సినిమాలో నటించే అవకాశం ఆయనని వరించింది. ఈ పొట్టిమామకు ఉన్న ఏకైక డ్రీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలవడం. మరో విశేషం ఏమిటంటే.. చిరంజీవి పుట్టినరోజునే పొట్టిమామ పుట్టిన రోజు కూడా కావడం. త్వరలోనే ఈ పొట్టిమామకు మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం.. ఆ రోజు ఎప్పుడు వస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు