Pawan Kalyan: అవును.. టీడీపీ యువనేత, ఐటీ మంత్రి నారా లోకేష్‌పై (Nara Lokesh) డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు లోకేష్ యువగళం పాదయాత్ర ఏ రేంజిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ యాత్రను పవన్, లోకేష్ ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం అంటూ పవన్ అభినందించారు. బుధవారం క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ‘యువగళం’ (YuvaGalam) పుస్తక ప్రతిని పవన్‌తో పాటు, ఇతర మంత్రులకు లోకేష్ అందజేశారు. రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతం అయ్యిందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకు కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్‌ను ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా లోకేష్.. పవన్‌తో పంచుకున్నారు.
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు
‘ సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. చంద్రబాబు పాలనానుభవం, పవన్ అన్న ఆశయానికి నరేంద్ర మోదీ ఆశీస్సులు పుష్కలంగా లభించడంతో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నాను. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’ అని నారా లోకేష్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
అన్నీ షాక్‌లే..
గత అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత, అన్నింటినీ మర్చిపోయిందని వైసీపీ ఆరోపిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అలా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఎద్దేవా చేస్తోంది. ‘ టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు.. ప్రతి ఒక్కరూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. మరోవైపు తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్. ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకపోయినా ఏడాది కాలంలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల అప్పు. మరోవైపు యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడంతో, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైంది. ఇదీ టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాకం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైసీపీ ఉద్యమబాట పట్టింది’ అని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
Read Also-Vennupotu Dinam: వైసీపీ చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ హిట్టా.. ఫట్టా?
#YuvaGalam పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి సచివాలయంలో అందజేశాను. పవనన్నతో పాటు, ఇతర మంత్రులకు కూడా పుస్తకాన్ని అందజేశాను. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందని పవనన్న అన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి… pic.twitter.com/0UsPWS8ZfF
— Lokesh Nara (@naralokesh) June 4, 2025