Vallabhaneni Vamsi: అవును.. వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్త గత వారం రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఇందుకు కారణాలూ లేకపోలేదు. అరెస్ట్ (Vamsi Arrest) తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, అనారోగ్యం ఇవన్నీ కారణాలని ఆయన సొంత అనుచరులే చెప్పుకుంటున్న పరిస్థితి. అందుకే తొలుత ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని భావించిన వంశీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తున్నది. వాస్తవానికి జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి, ఆరోగ్యంపైనే దృష్టి.. ఆ తర్వాత వ్యాపారాలు చూసుకుంటారని ‘‘వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?’’ అంటూ ‘స్వేచ్ఛ’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించగా.. చివరికి ఇదే కథనం నిజం కావొస్తున్నది..! ఒకవేళ వంశీ పాలిటిక్స్‌కు గుడ్ బై చెబితే రంగంలోకి దిగేది ఎవరు? గన్నవరం వైసీపీ క్యాడర్‌కు దిక్కెవరు? ఏడాదిగా క్యాడర్ పడుతున్న క్యాడర్‌ను కష్టాల కడలి నుంచి గట్టెక్కించేదెవరు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?
ఏడాదిగా ఎవరూ లేరు!
వల్లభనేని వంశీ రాజకీయ అధ్యాయం దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ ప్రజా, రాజకీయ జీవితాలకు దూరంగా ఉంటూ వస్తున్న వంశీ సతీమణి పంకజ శ్రీ (Vamsi Wife Pankaja Sri) పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న వంశీ.. కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో అటు గన్నవరంలో వంశీ, ఇటు ఆంధ్రాలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వంశీ నోటికి పనిచెప్పి ఇష్టానుసారం మాట్లాడటం, పార్టీ ఆఫీసుపై దాడి, అవినీతి, అక్రమాలు చేయడం.. వీటన్నింటికీ తోడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని తిట్టారనే ముద్ర పడిపోయింది. దీంతో అధికారంలోకి రాగానే వంశీని చంద్రబాబు, నారా లోకేష్ ఒక పట్టుపట్టారు. ఒక్క అరెస్ట్‌తో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎంతలా అంటే అసలు రాజకీయాల్లో కొనసాగడం అవసరమా? అన్నట్లుగా పరిస్థితి తయారైందట. ఇలా ఫలితాలు వచ్చిన వారం, పది రోజుల్లోనే గన్నవరంను వదిలేసిన హైదరాబాద్‌లో మకాం మార్చేశారు. అలా గన్నవరంలో ఏడాదికి పైగా వైసీపీ కార్యకలాపాలు దాదాపుగా లేవనే చెప్పుకోవాలి. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు గట్టు రామచంద్రరావు, కుమార్తె, ఇతరులు ఉన్నప్పటికీ ఎక్కడా చడీ చప్పుడు చేయలేదు. కనీసం మీడియా ముందుకొచ్చిన సందర్భాలు కూడా లేవు.
ఇక అంతా మేడమేనా?
సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే వైసీపీ (YSRCP) వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించినట్లుగా సమాచారం. వంశీ స్థానంలో రాజకీయ ప్రత్యామ్నాయంగా పంకజ శ్రీని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రాజకీయాలకు అవసరమా? ఇలాగే కొనసాగితే ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయో? అని ఆమె.. తన రాజకీయ అరంగేట్రానికి సంశయించినప్పటికీ, పార్టీ నాయకత్వం ఒప్పించిందట. ఇక వంశీ సైతం ఈ ప్రతిపాదనకు అంగీకరించడంతో పంకజ శ్రీ పొలిటికల్ ఎంట్రీకి మార్గం సుగుమమైందట. వంశీ సతీమణితో చర్చలు, జైల్లో ములాఖత్ అయినప్పుడు ఇవన్నీ చర్చించడంలో మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చక్రం తిప్పినట్లుగా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు తీసుకోనున్నట్లుగా తెలుస్తున్నది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గన్నవరం ఇన్‌ఛార్జీగా పంకజ శ్రీని పార్టీ ప్రకటించడంతో పాటు, వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా హాజరవుతారని తెలిసింది. ఓ వైపు వంశీ అభిమానులు ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి కానీ, వంశీ పరిస్థితిని చూసిన తర్వాత జరగబోయేది ఇదేనంటూ అనుచరులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే.. ఇకపై గన్నవరం నియోజకవర్గానికి అంతా మేడమే అన్నమాట.
ఎమ్మెల్యేగా కూడా పోటీ?
ప్రస్తుతానికి గన్నవరం ఇన్‌ఛార్జీ బాధ్యతలను పంకజ శ్రీకి కట్టబెట్టి.. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయించడానికి వైసీపీ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఎందుకంటే.. ఆమెకు రాజకీయ అనుభవం తక్కువే అయినప్పటికీ, వంశీకి ఉన్న రాజకీయ వారసత్వం, సామాజికవర్గంలో ఉన్న పట్టు కలిసొచ్చే అంశాలుగా వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. తన భర్తపై పెట్టిన కేసుల విషయంలో కూడా చురుగ్గా వ్యవహరించడం, ఆడబిడ్డ అనే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) కూటమికి గట్టి పోటీ ఇవ్వడానికి వైసీపీ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నది. మరోవైపు గట్టు రామచంద్రరావు కుమార్తె కూడా ఇన్‌ఛార్జీ బాధ్యతలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ‘గట్టు’ వైఎస్ హయాం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వరకూ ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ఈ పరిస్థితుల్లో గట్టుకు జగన్ ప్రాధాన్యత ఇస్తారా? లేకుంటే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని పంకజ శ్రీని రంగంలోకి దింపుతారా? అనేది చూడాలి మరి.
Read Also- YSRCP: వంశీ విడుదల సరే.. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేదెవరు?